ETV Bharat / state

AP Govt Paid Crores to Monopoly Firm Megha: మేఘాకు కోట్లు సమర్పణ.. దాచిన మెటీరియల్​కూ చెల్లింపులు..!

author img

By

Published : Jul 18, 2023, 8:31 AM IST

Updated : Jul 18, 2023, 2:41 PM IST

AP Govt Paid Crores to Monopoly Firm Megha: రాష్ట్రంలో అసలే బిల్లుల చెల్లింపుల సంక్షోభం ఉంది. ఎందరో బాధితులు.. బిల్లుల కోసం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందినా.. కోర్టుధిక్కరణ కేసులు నమోదు చేసినా.. సర్కార్‌ ఇవ్వడం లేదు. నిధులు ఉన్న మేరకే చెల్లింపులు జరుపుతున్నామంటూ.. ఉన్నత న్యాయస్థానానికి అధికారులు చెబుతున్నారు. చెల్లింపులు జరక్క అనేక కీలక ప్రాజెక్టుల్లో ముఖ్యమైన పనులూ ఆగిపోయిన పరిస్థితి. అలాంటిది ఎప్పుడో రెండేళ్ల కిందట ఆగిపోయిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో.. గుత్తేదారు సంస్థ మేఘాకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 739 కోట్ల రూపాయలు చెల్లించేసింది. అది కూడా అప్పు తీసుకుని మరీ ఇచ్చేసింది. జరగని పనులకు అధిక వడ్డీకి అప్పు తెచ్చి మరీ చెల్లింపు చేయడం.. వైసీపీ ప్రభుత్వ పాలన ఏ తీరున సాగుతుందో చెప్పకనే చెబుతోంది.

AP Govt Paid Crores to Monopoly Firm Megha
గుత్తేదారు సంస్థ మేఘాకు కోట్లు చెల్లింపులు

AP Govt Paid Crores to Monopoly Firm Megha: రాయలసీమలో తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు నగరి, కేసీ కాలువలే ఆధారం. కృష్ణాలో తక్కువ రోజులే ప్రవాహాలు ఉంటున్నందున.. వీటి అవసరాలు తీరడం లేదు. ఈ క్రమంలో రాయలసీమ ఎత్తిపోతలు నిర్మించి రోజుకు 3 టీఎంసీలు మళ్లించాలనుకున్నారు. శ్రీశైలంలో 800 అడుగుల నీటిమట్టం వద్ద కూడా నీటిని తీసుకునేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. ఇందులో కొత్తగా అదనంగా నీళ్లు తీసుకోబోరు. ఉన్న ఆయకట్టుకే ఇప్పటికే కేటాయించిన నీటినే తీసుకుంటారు. 3 వేల 825 కోట్ల రూపాయలతో ఈ ఎత్తిపోతలకు 2020లో ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. మేఘా ఇంజినీరింగు, ఎస్‌పీఎంఎల్, ఎన్‌సీసీ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయి. అయితే పర్యావరణ అనుమతులు వచ్చే వరకు నిర్మించవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించడంతో.. 2021లోనే ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేశారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఈ పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖలను ఆదేశించింది. ఆ మేరకు శాస్త్రవేత్త పసుపులేటి సురేష్‌బాబును నియమించింది. ఆయన 2021 సెప్టెంబరు 6న రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. అన్నీ పరిశీలించి ఎన్‌జీటీకి తన నివేదిక సమర్పించారు. అందులో ఎంత మేర పనులు జరిగాయో ఫోటోలతో సహా నివేదించారు. అక్కడ కేవలం తవ్వకం పనులు, కొంత సివిల్‌ పనులు తప్ప.. ఎలక్ట్రో, మెకానికల్‌ పనులు చేసిన దాఖలాలు ఏవీ ఆ ఫోటోల్లో లేవు. ఆయన తన నివేదికలో స్పష్టంగా ఈ విషయం చెప్పారు.

AP Contractors bills Problems: రాష్ట్రంలో బిల్లుల గోస.. వారికి మాత్రమే చెల్లింపులు..

తన నివేదికతో పాటు 12 ఫొటోలను జత చేశారు. అప్రోచ్‌ ఛానల్‌ తవ్వకం, పంపుహస్‌ కోసం తవ్వకం, ఫోర్‌ బే పనుల ఫోటోలు జత చేశారు. అక్కడ రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం కోసం ఎలాంటి పనులూ జరగలేదని ధ్రువీకరించారు. పంపులు, మోటార్లతో ఏ పనులూ చేయని విషయమూ ఆ ఫొటోల్లో కనిపిస్తోంది. ఆ నివేదికలోను కేవలం డీపీఆర్‌ కోసం మాత్రమే పనులు చేశారనీ పేర్కొన్నారు. ఎత్తిపోతల నిర్మాణం కోసం అవసరమైన మెటీరియల్‌ ముందే సేకరించి అక్కడ నిల్వ చేసుకున్నారని పసుపులేటి సురేష్‌బాబు తన నివేదికలో పేర్కొన్నారు. కానీ పనులు అంతంతగానే ఉన్నా.. బిల్లులు ఏకంగా 739 కోట్ల రూపాయలు చెల్లించేయడం చర్చనీయాంశంగా మారింది.

రాయలసీమ ఎత్తిపోతలలో పని జరిగింది తక్కువ. అక్కడ నిల్వ చేసిన మెటీరియల్‌ ఎక్కువ. అంటే కేవలం పని చేసేందుకు తెచ్చిన మెటీరియల్‌కు వందల కోట్లు అప్పు చేసి మరీ చెల్లించేశారు. సివిల్‌ పనులు తక్కువ మొత్తంలో జరిగాయి. అవి కూడా కేవలం తవ్వకం పనులు, నిర్మాణ పనులూ అంతంతమాత్రమే. కానీ పంపులు, మోటార్లు, వాటి అనుబంధ భాగాల ఎలక్ట్రో మెకానిక్‌ పరికరాలు అక్కడ ఎప్పుడో తెచ్చి స్టోర్‌రూంలో నిల్వ చేసుకున్నారు. ఆ పరికరాల మొత్తం విలువను వందల కోట్లుగా చూపించి వాటితో ఎలాంటి పని చేయకపోయినా ఏకంగా 739.50 కోట్లు చెల్లించేశారు.

ముఖ్యమంత్రి తరచూ సమీక్షిస్తున్నా ఇప్పటికీ పనులు ముందుకు సాగని ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల. ఎప్పుడు పనులు చేపడతారో కూడా తెలియనిది. అలాంటి ప్రాజెక్టులో గుత్తేదారు సంస్థ మేఘాకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అప్పు తీసుకొని మరీ చెల్లింపులు చేసేసింది. వడ్డీ కూడా తక్కువా అంటే కానే కాదు. ఏకంగా 10.5శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించి మరీ అప్పు తెచ్చి అస్మదీయ గుత్తేదారు సంస్థకు సమర్పించేసింది. రాష్ట్ర ఖజానా నుంచి ఆ చెల్లింపులు జరగలేదు. నేరుగా అప్పు ఇచ్చిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్లు పనులు చేసిన మేఘా జాయింట్‌ వెంచర్‌ కంపెనీలకు చెల్లించేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. నిర్మాణ పనులు ఆగిపోయాయి. వీటి నుంచి ఎప్పుడు ప్రయోజనాలు అందుతాయో.. అవి ఆర్థిక ప్రయోజనాల రూపంలో ఎప్పుడు మారతాయో తెలియదు. అలాంటిది ఆగిన పనులకు ఏకంగా 739 కోట్లు చెల్లింపులు చేయడం, అదీ 10.5శాతం వడ్డీకి అప్పు తెచ్చి చెల్లించడం వైసీపీ సర్కార్‌ ఆర్థిక నిర్వహణకు మచ్చుతునక అనుకోవాలా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

'గృహ నిర్మాణ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి'

రాష్ట్రంలో అన్ని బిల్లులు సక్రమంగా చెల్లించేస్తున్నారు, పనులన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి, కాబట్టి ఎలాగూ గుత్తేదారుడు కొన్ని పనులు చేశారు కదా.. బిల్లు చెల్లించేశారు అని సరిపెట్టుకునేందుకు లేదు. రాష్ట్రంలో సాగునీటి రంగం కుదేలైపోయింది. అనేక ప్రాజెక్టుల్లో బిల్లులు చెల్లించక ప్రాజెక్టుల పనులు ఎన్నో ఆగిపోయాయి. ఆఖరికి కోటి బిల్లుకు, రెండు కోట్ల బిల్లుల చెల్లింపులకూ దిక్కులేదు. ఉమ్మడి రాష్ట్రాలకు ఎంతో కీలకమైన శ్రీశైలం జలాశయంలోనూ నిర్వహణ పనులకు 2 కోట్ల బిల్లులకూ దిక్కులేక గుత్తేదారుడు చాలా కాలం పనులు నిలిపివేసి వెళ్లిపోయారు. ఆ పనులు ఇంకా పూర్తి కానేలేదు. ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టులో ఊళ్లు మునిగిపోతూ ఉన్నా.. పునరావాస కాలనీలు నిర్మించేందుకు సర్కార్‌ సొమ్ములు ఇవ్వడం లేదు. కాలనీల నిర్మాణమూ ఆగిపోయింది. ప్రజలు వరద ముంపులో నానా అగచాట్లు పడుతున్నారు. గుండ్లకమ్మలో గేటు కొట్టుకుపోయినా కొంత పని చేసినా బిల్లుల చెల్లింపు లేదు. గేట్లు బాగు చేసే పనులూ జరగడం లేదు.

వైఎస్సార్‌ పల్నాడు కరవు నివారణ పథకం, చింతలపూడి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టుల్లోనూ బిల్లులు పెండింగులో ఉండటంతో మేఘా వంటి గుత్తేదారు సంస్థలు పనులు ఆపేశాయి. ఇదే రాయలసీమలో నిండా జలాశయాలో నీళ్లు నిల్వ ఉన్నా చిత్రావతి బ్యాలెన్సింగు జలాశయం కింద ఆయకట్టుకు నీళ్లు అందించే పనులకు బిల్లులు రాక నిలిపివేశారు. కడప జిల్లాలోనే ఆ పనులు జరగడం లేదు. బిల్లులు చెల్లిస్తే ఆ ప్రాజెక్టుల పనులు అన్నీ ముందుకు సాగుతాయి. లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లూ అందుతాయి. రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్టులు మూలనపడ్డవి ఎన్నో ఉంటే.. పూర్తిగా పనులు ఆపేసిన అసలు ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో కూడా తెలియని రాయలసీమ ఎత్తిపోతలకు ఏకంగా అప్పు చేసి 739 కోట్లు చెల్లించేశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమ ప్రయోజనాలకు ఎంతో ముఖ్యం. కరవు ప్రాంతాలకు తక్కువ రోజుల్లోనే ఎక్కువ నీటిని మళ్లించేందుకు ఉద్దేశించింది. ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరేకించరు. అయితే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కేంద్ర పర్యావరణ అనుమతులు అవసరమంటూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా పనులు జరుగుతున్నాయంటూ కొందరు ఎన్‌జీటీని ఆశ్రయించడంతో నిజనిర్థారణ కమిటీని కూడా పంపింది. కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సైతం ఈ ప్రాజెక్టును సందర్శించింది. ప్రధాని మోదీతో తనకు రాజకీయ అతీతమైన సంబంధాలు ఉన్నాయని ప్రకటించే ముఖ్యమంత్రి జగన్‌.. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులూ సాధించలేకపోతున్నారు.

ఈ అనుమతులు రాకపోవడానికి రాజకీయ కారణాలే ప్రధానమని ఇందులో భాగమైన అధికారులూ చెబుతున్నారు. అంతే కాదు.. ఈ ప్రాజెక్టులో కేవలం డీపీఆర్‌ రూపొందించడానికి అవసరమైన పనులు మాత్రమే చేశామని.. అంతకుమించి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఏమీ చేయలేదని సాక్షాత్తూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు తెలియజేశారు. 2021 ఆగస్టు 6న ఆయన ఈ అఫిడవిట్‌ దాఖలు చేశారు. డీపీఆర్‌ సిద్ధం చేసే పనులు అంటే.. అందులో పంపులు, మోటార్లు వినియోగించాల్సిన అవసరమే లేదు. కేవలం డీపీఆర్‌ తయారు చేసేందుకు చేపట్టిన పనులకే ఏకంగా 739 కోట్లు చెల్లించేశారా అనే ప్రశ్న వినిపిస్తోంది.

ఒక వైపు చేసిన పనులకు వేల కోట్ల చెల్లింపులు లేని రాష్ట్రంలో కేవలం పంపులు, మోటార్లు తెచ్చి అక్కడ స్టోర్‌ రూంలో భద్రపరిచినందుకు వందల కోట్లు చెల్లించేశారు. ఈ ప్రాజెక్టు కోసం పంపులు మోటార్లు ప్రత్యేకంగా ఆర్డర్‌ చేసి రప్పించారని, అవి నిర్మాణ ప్రాంతానికి.. ముందే వచ్చేశాయని.. అందుకే వాటి విలువ కూడా బిల్లులు చెల్లించేశామని ఓ ఉన్నతాధికారి చెప్పారు. సివిల్‌ పనులకు 380 కోట్లు, పంపులు, మోటార్ల వంటి మెటీరియల్‌ తెచ్చినందుకు 300 కోట్లకు పైగా చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు.

No Development Works: పన్నులపై ఉన్న శ్రద్ధ.. పనులపై ఉండదా! గుత్తేదారులు బెదిరిపోవడానికి ఎవరు కారణం?

మేఘాకు కోట్లు సమర్పణ
Last Updated : Jul 18, 2023, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.