ETV Bharat / state

AP Govt Employees Protest Issue: చెప్పిందేంటి.. చేసిందేంటి జగన్​ సారూ..?నాలుగేళ్లుగా నానావస్థలు..

author img

By

Published : Jul 18, 2023, 10:06 AM IST

Updated : Jul 18, 2023, 2:33 PM IST

AP Govt Employees Protest Issue
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన

అధికారంలోకి రాకముందు ఉద్యోగులపై వరాల జల్లు. నేను విన్నాను. నేను ఉన్నాను అన్నారు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవ్వగానే.. అదే ఉద్యోగులపై పిడిగుద్దులు. సీపీఎస్ రద్దు లేదు. ఒకటో తేదీన జీతాల్లేవ్‌. డీఏ, పీఆర్​సీ బకాయిలైతే.. నాలుగేళ్లలో చెల్లిస్తామంటూ వాయిదా. వాస్తవం తెలుసుకుని ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ ఆందోళనకు, నిరసనలకు దిగిన ఉద్యోగులపై.. తిరిగి ఎదురుకేసులు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 16వందల మందిపై కేసులు పెట్టారు మన సీఎం సారు. మొత్తంగా రెండు చేతులతో ఓట్లేసి గెలిపించి ఏరికోరి తెచ్చుకున్న జగన్‌ ఏలుబడిలో.. నాలుగేళ్లలో ఉద్యోగులకు.. శోకమే మిగిలింది.

సీపీఎస్​ను రద్దు చేసి, పాత పింఛన్‌ విధానం అమలు చేయకపోగా.. ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలను వారికి అందించట్లేదు. డీఏ బకాయిలను 90 శాతం నగదు రూపంలో చెల్లించాల్సి ఉన్నా వీటిని ఇవ్వడం లేదు. ఏప్రిల్‌ 2020 నుంచి డిసెంబరు 2021 వరకు ఉన్న పీఆర్​సీ బకాయిలు చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సీపీఎస్ ఉద్యోగులకు రాష్ట్రం వాటాగా 14శాతం చెల్లించాల్సి ఉండగా.. 10శాతం మాత్రమే ఇస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగుల నుంచి వాటాగా మినహాయిస్తున్న దాంట్లో నుంచి ప్రాన్‌ ఖాతాకు సక్రమంగా చెల్లించకపోవడంతో.. కొంతమంది ఉద్యోగుల ప్రాన్‌ ఖాతాకు ఏడెనిమిది నెలలుగా సీపీఎస్ జమ కాలేదు. ఆందోళనలు చేసినందుకు వీరిపై ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా 1,600 కేసులు పెట్టిందంటే నిర్బంధం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చెప్పిందేంటి.. చేసిందేంటి జగన్​ సార్!

ప్రతిపక్ష నేతగా జగన్‌ సారు చెప్పింది విన్నారుగా. మన కష్టాలు చూశారు. మనకు ఎవ్వరూ చేయని మేలు చేస్తారని నమ్మి రెండు చేతులతో ఓట్లేశారు ఉద్యోగులు. జగనన్న సీఎం అయ్యారు. ఇప్పుడు.. ఒకటో తేదీన జీతం కోసం అదే ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు, పోరాటాలు చేశారు. అన్నీ చేసినా.. సీఎం సారు స్పందించలేదు. దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ.. ఏకంగా గవర్నర్‌ని కలిసి ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇంక అంతే.. జగన్‌ సారుకు చిర్రెత్తుకొచ్చింది. గవర్నర్‌ను ఎందుకు కలిశారో చెప్పాలని నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఈ విషయంలో సూర్యనారాయణకు ఉపశమనం దక్కింది. ఐతే.. ఆయన అధ్యక్షుడిగా ఉన్న వాణిజ్యపన్నుల శాఖలో ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారంటూ.. ఆయనపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

ఐతే.. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సంఖ్యను తగ్గించుకునేందుకు 2014 జూన్‌కు ఐదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన పెట్టారు. తెలంగాణలో 2014 జూన్‌ వరకు ఉన్న వారందర్నీ క్రమబద్ధీకరించగా.. ఇక్కడ గడువు విధించారు. దీంతో లబ్ధి పొందేవారి సంఖ్య సగానికి తగ్గిపోయింది. ఇదే కాదు ఇంకా చాలా వాటిల్లో ఉద్యోగులకు టోకరా వేశారు సీఎం జగన్‌. పీఆర్​సీ చరిత్రలో తొలిసారి మధ్యంతర భృతి కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఐఆర్‌ 27శాతం ఉంటే ఫిట్‌మెంట్‌ 23శాతమే ఇచ్చారు. అంటే 4శాతం మేర ప్రభుత్వం కోత పెట్టింది. మొదట్లో రికవరీ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఉద్యోగుల ఆందోళనతో వెనక్కి తగ్గింది. ఇంటి అద్దె భత్యాన్ని తగ్గించేసింది. సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో 30శాతం ఉండగా.. వైసీపీ వచ్చాక దాన్ని 24 శాతానికి తగ్గించేసింది. జిల్లా కేంద్రాల్లో గతంలో 20శాతం హెచ్​ఆర్​ఏ ఉండగా 16 శాతానికి తగ్గించింది. 2018 జూన్‌ నుంచి ఏప్రిల్‌ 2020లోపు పదవీ విరమణ చేసిన వారికి 12 లక్షల నుంచి 16 లక్షలకు పెరిగిన గ్రాట్యుటీని ఇంతవరకు పింఛన్‌దారులకు ఇవ్వలేదు.

పీఆర్​సీ అంటే పేస్కేల్స్‌లో మార్పు వస్తుంది. కానీ, ఉద్యోగులకు 11వ పీఆర్సీ పేస్కేల్స్‌ పట్టించుకోకుండా ప్రభుత్వం కరస్పాండింగ్‌ స్కేల్స్‌ ఇచ్చేసింది. 10వ పీఆర్సీ బేసిక్‌కు 23 శాతం ఫిట్‌మెంట్‌, డీఏ కలిపి స్కేల్స్‌గా నిర్ణయించేసింది. ఇలాంటప్పుడు పీఆర్సీ ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని కేడర్‌లకు పేస్కేల్స్‌ పెరుగుతాయి. పెరిగిన స్కేల్స్‌ నిర్ణయించకపోతే ఉద్యోగుల పదోన్నతులు, కొత్త నియామకాల్లో ఏ స్కేల్స్‌ నిర్ణయిస్తారని అడుగుతున్నారు. 11వ పీఆర్సీ అమలు పేరుతో 10వ పీఆర్సీ బేసిక్‌నే తీసుకున్నారు. పైగా 11వ పీఆర్సీ అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉండగా వాటిని పరిష్కరించకుండానే.. ఇప్పుడు ప్రభుత్వం 12వ పీఆర్సీ వేసింది.

ఉద్యోగులకు 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు చెల్లించకుండానే జీతాల నుంచి ఆదాయపు పన్ను మినహాయించేసింది. రాని ఆదాయానికి ఉద్యోగులు పన్ను కట్టారంటే.. జగన్‌ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ట్రెజరీలో డీఏ బిల్లులు అయినా ఇంతవరకు చాలామందికి చెల్లించలేదు. పీఆర్సీతో జీతం పెరిగిందని చూపించేందుకు అందులో కలిపిన జనవరి, జులై 2020, జనవరి, జులై 2021 డీఏ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. డీఏ బకాయిలను పింఛన్‌దారులు, సీపీఎస్‌ ఉద్యోగులకు నగదు రూపంలో ఇవ్వాలి. దీన్ని ఈ ఏడాది సెప్టెంబరులోపు ఇస్తామని హామీ ఇచ్చారు. మొత్తం డీఏ బకాయిలే 2 వేల కోట్ల వరకు ఉన్నాయి. పీఆర్సీ, డీఏ బకాయిలను నాలుగేళ్లల్లో 16 విడతల్లో చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వ బకాయిల భారాన్ని వచ్చే ప్రభుత్వాలపై మోపుతోంది. డీఏ విడుదల ఉత్తర్వులు వచ్చిన నెల నుంచే అమల్లోకి వస్తుంది. 2022 జనవరి డీఏకు మే నెలలో ఉత్తర్వులు ఇచ్చి.. జులై నుంచి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా చేయడం ఏపీ చరిత్రలో మొదటిసారి. వీటిని నాలుగు విడతల్లో ఇస్తామని ప్రకటించింది. 2022 జులై, 2023 జనవరి డీఏలు ఇంతవరకు మంజూరు చేయలేదు.

ఆర్జిత సెలవుల కింద ఉద్యోగులకు చెల్లించాల్సినవి 1,200 కోట్ల వరకు ఉన్నాయి. లక్షకుపైగా చెల్లించాల్సిన వాటిని పెండింగ్‌లో పెట్టారు. ఉపాధ్యాయులకు సంబంధించి ఐదారుగురివి కలిపి బిల్లు చేస్తుండటంతో.. అది లక్ష దాటిపోతుంది. దీంతో వీరికి దాదాపు ఏడాదిన్నరగా ఆర్జిత సెలవులు మొత్తాలు రాని పరిస్థితి. మేనిఫెస్టోలో ఓట్ల కోసం ఏదో చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయకూడదని చెబుతున్నారు మన సీఎం సారు. మోసం చేస్తే.. రాజీనామా చేయాలని కూడా సెలవిచ్చారు. మరి ఉద్యోగులను ఇన్ని విధాలుగా మోసం చేసిన మన సీఎం జగన్‌ సారు ఏం చేస్తారో.

Last Updated :Jul 18, 2023, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.