ETV Bharat / state

ఏపీలో ఆర్​బీఐ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడా..? కేంద్రమే రంగంలోకి దిగాలా..!

author img

By

Published : Feb 10, 2023, 9:41 AM IST

rbi
ఆర్​బీఐ

RBI Ap Regional Office : అమరావతిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు వ్యవహారంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడుగుమూతలు ఆడుతున్నాయి. విశాఖలో ఆర్బీఐ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు కోసం ఇటీవల అధికారులు పర్యటించడం.. అమరావతి రైతుల్లో అనుమానాలు పెంచుతోంది. కేంద్రం ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

RBI Ap Regional Office : భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు అంశం గందరగోళానికి గురిచేస్తోంది. ఏపీ కన్నా చిన్న రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటుచేసిన ఆర్బీఐ.. మన దగ్గరకు వచ్చేసరికి మీనమేషాలు లెక్కిస్తోంది. 2018లోనే అప్పటి ప్రభుత్వం కార్యాలయం కోసం అమరావతిలో 11 ఎకరాల భూమి కేటాయించినా.. ఆర్బీఐ పనులు ప్రారంభించలేదు. దీనిపై అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు.. కేంద్ర ఆర్థిక శాఖకు 2021 అక్టోబర్‌లో లేఖ రాశారు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ముంబయిలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి లేఖ వెళ్లింది. ఏపీ రాజధాని ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని.. అప్పుడే కార్యాలయం ఏర్పాటుచేస్తామని.. 2022 జనవరి 31న ఆర్బీఐ సమాధానమిచ్చింది. అప్పటికి రాజధాని అంశంపై కోర్టులో విచారణ జరుగుతుండగా 2022 మార్చి 3న అమరావతే ఏపీ రాజధాని అంటూ హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని జాస్తి వీరాంజనేయులు.. మళ్లీ ఆర్బీఐకి విన్నవించారు.

రాజధాని విషయంలో స్పష్టత వచ్చింది కాబట్టి.. అమరావతిలో కార్యాలయం ఏర్పాటుచేయాలని కోరారు. దీనిపై ఆర్బీఐ నుంచి ఇప్పటివరకూ సమాధానం రాలేదు. ఇటీవల ఆర్బీఐ అధికారుల బృందం విశాఖలో పర్యటించి, అక్కడ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం భవనాల్ని పరిశీలించింది. త్వరలోనే కార్యాలయం ఏర్పాటుపై నిర్ణయం వెలువడనుందని.. సమాచారం. దీనిపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

"అర్బీఐ ఒక్కదానికే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు అమరావతిలో భూములు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి, వాటికి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే భాగుంటుంది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే ముఖ్యమంత్రి అనాలోచిత విధానానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. కేంద్ర సంస్థలు ఏర్పాటు చేసి వాటికి మౌలికి వసతులు కల్పించాలని కేంద్రం రాష్ట్రానికి సూచించాలని కోరుతున్నాము." -ప్రియాంక, రాజధాని రైతు

అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం గతంలో గెజిట్‌ ఇచ్చిన తర్వాత కూడా ఆర్బీఐకి సందేహాలు ఎందుకనిరైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిపై కేంద్రం వట్టి ప్రకటనలకు పోకుండా.. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేయాలని అమరావతి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

"రిజర్వు భ్యాంకు ప్రాంతీయ కార్యలయం అమరావతిలో పెట్టాలి. దిల్లీకి వెళ్లి ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు అమరావతిలోనే పెట్టాలని కోరాము. సంవత్సరం పైగా కాలం గడిచింది. ఒక్క కార్యాలయం ఏర్పాటు చేయలేదు. ఇక్కడ ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేస్తే నమ్మకం ఏర్పడుతుందని.. వాటిని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము."-సీతారామయ్య, రాజధాని రైతు

రాష్ట్రంలో ఆర్​బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుపై స్పష్టతనివ్వని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.