ETV Bharat / state

అభివృద్ధి చేసే ఆలోచన ఉంటే.. రెండు సంవత్సరాల క్రితమే చేసేవారు..

author img

By

Published : Feb 25, 2021, 11:05 AM IST

amaravathi farmers
ప్రభుత్వంపై అమరావతి రైతుల ఆగ్రహం

అమరావతిలో రైతులు ఏడాదికి పైగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా సర్కారు నుంచి సానుకూల స్పందన లేదు. పైగా అమరావతి రైతుల్ని కించపరిచేలా అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు... ఉద్యమం చేస్తున్న వారిపై పోలీసు కేసులు పెట్టి వేధించారు. కానీ కానీ మంగళవారం నాటి మంత్రి వర్గ సమావేశంలో మాత్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనపై నిర్ణయం తీసుకోవటం ఆశ్ఛర్యం కలిగిస్తోందంటున్నారు రైతులు. మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అధికార పార్టీకి లబ్ది కోసమే ప్రభుత్వం ఎత్తుగడ వేసిందని రాజధాని రైతుల మాట. పార్టీల గుర్తుతో జరిగే ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా వస్తే ఇబ్బందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా చేసిందని చెబుతున్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఆగియాయి. 40వేల కోట్ల రూపాయలతో చేపట్టిన భవనాలు వివిద దశల్లో నిలిచాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంటూ ప్రకటించి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టారు. గవర్నర్ తోనూ ఆమోదింపజేసుకున్నారు. అమరావతి ముంపు ప్రాంతమని, శ్మశానమని, ఒక వర్గానిదని అధికార పార్టీ నేతలు ప్రచారం చేశారు. లక్ష కోట్ల డబ్బు లేదు కాబట్టి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటని ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగటంతో పాటు న్యాయపోరాటం చేస్తున్నారు.

అందుకేనా ఈ మార్పు?

రైతులు పోరాటం ప్రారంభించి నేటికి 435 రోజులైంది. వారితో కనీసం చర్చించని పరిస్థితి. ఈ దశలో పురపాలక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఒక్కసారిగా ప్రభుత్వ వైఖరిలోనూ మార్పు కనిపించింది. కరకట్ట రహదారిని నాలుగు వరుసలుగా మార్చటం కోసం 150 కోట్లు కేటాయించటం.. తాజా మంత్రివర్గ సమావేశంలో అమరావతిలో ఆగిన నిర్మాణాలు పూర్తిచేస్తామని చెప్పటం మారిన వైఖరికి నిదర్శనాలు. అయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపాకి నష్టం జరక్కుండా ఉండేందుకు.. ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా రైతులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వంపై అమరావతి రైతుల ఆగ్రహం

ముఖ్యంగా రాజధాని సమీపంలోని గుంటూరు, విజయవాడ, తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయనే భయంతోనే ప్రభుత్వం ఇలా చేసిందంటున్నారు. అమరావతి అభివృద్ధి సంస్థకు రుణం తీసుకునేందుకు కేవలం గ్యారెంటీ మాత్రమే ఇస్తూ.. రాజధానిలో ఏదో చేసేస్తున్నట్లు భ్రమలు కల్పిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని లేని అభివృద్ధి ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మభ్యపెట్టేందుకేనా?

గతంలో అమరావతి నిర్మాణం కోసం రుణాలిచ్చేందుకు వచ్చిన ప్రపంచ బ్యాంకుని, సింగపూర్ కన్సార్షియం పట్ల వైకాపా ప్రభుత్వం సానుకూల ధోరణి కనపర్చలేదు. దీంతో వారు వెనక్కు వెళ్లిపోయారు. ఈ సమయంలో రాజధాని నిర్మాణాలకు 3వేల కోట్లు రుణం ఎవరు ఇస్తారు.. దానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వటం ఏమిటనే ప్రశ్నలు రాజధానివాసుల నుంచి వస్తున్నాయి. అమరావతిలో అభివృద్ధి జరగబోతోందన్న అభిప్రాయం కలిగించి.. ప్రజలను మభ్యపెట్టడానికే ఈ ప్రకటనలని రైతులు ఆరోపిస్తున్నారు.

తమ ఉద్యమాన్ని చల్లార్చి.. వీలైనంత త్వరగా విశాఖకు రాజధాని తరలించాలనే వ్యూహం ప్రభుత్వ పెద్దల్లో ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని తరలింపుపై రైతులు వేసిన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. అమరావతి ప్రాంతంలో భూముల అభివృద్ధి, మౌళిక వసతుల కల్పన, భవనాల నిర్మాణం పూర్తి వంటి అంశాలని ప్రభుత్వం కోర్టు ముందుంచే అవకాశం ఉంది. తద్వారా రైతుల వాదనల్ని వీగిపోయేలా చేసి లబ్ది పొందటం కూడా సర్కారు ఆలోచనలో భాగం కావొచ్చని అనుమానిస్తున్నారు రైతులు.

ఉద్యమాన్ని గౌరవించండి: రైతులు

ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని గౌరవించాలని కోరుతున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన తర్వాతే ఏదైనా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తెచ్చే అప్పులు రాజధాని కోసమేనా లేక.. వేరే పథకాల కోసమా అని అనుమానం వెలిబుచ్చారు. రాజధాని పరిధిలో జరుగుతున్న నిర్మాణాలకు గుత్తేదార్లకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకూ 75శాతం జరిగిన నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. వాటికి రెండున్నర వేల కోట్ల రూపాయలు పైగానే ఖర్చవుతుంది. ఇక ఆ భవనాలకు అనుసంధానంగా రహదారులు కూడా వేయాల్సి ఉంటుంది. వాటి ఖర్చెంత. రాజధాని ఇక్కడ ఉంచుతామని చెప్పకుండా ఈ పనులు చేస్తామనటమే రైతుల్లో అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి : రేపు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఉక్కు’ ఉద్యమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.