ETV Bharat / state

సహజ పద్దతిలో కూరగాయల సాగు

author img

By

Published : Jan 8, 2021, 6:28 AM IST

nature farming
సహజ పద్దతిలో కూరగాయల సాగు

రసాయనిక ఎరువులు ఉపయోగించి పండించిన కూరగాయతో విసిగి పోయారు ప్రజలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న తీరుగా.. కాస్త ధర ఎక్కువైన సహజ సిద్ధంగా పండించిన కూరగాయల వైపే మెగ్గు చూపుతున్నారు. దీనినే వ్యాపార మార్గంగా మలుచుకున్నాడు ఓ రైతు. ప్రకృతి సేద్య పద్ధతిలో పంటను సాగు చేస్తూ... పొలంలోనే వినియోగదారుడికి కావల్సిన కూరగాయలు అందిస్తున్నారు . సుదూర ప్రాంతాల నుంచి కూడా కొందరు వ్యక్తులు ఇక్కడికి చేరుకొని కొనుగోళ్లు జరుపుతున్నారు.

విభిన్న ఆలోచనకు శ్రమతో కూడిన ఆచరణ తోడైతే విజయపుబాటలో పయనించవచ్చు అనటానికి నిదర్శనం ఈ రైతు. పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ముందడగు వేస్తే ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతం అవుతుందనే సూత్రాన్ని ఆయన బాగా విశ్వసించారు. అందుకే తన క్షేత్రంలో కాయగూరలు, ఆకుకూరలు, పండ్ల సాగుతో సుక్షేత్రంగా మార్చుకుని వ్యవసాయంలో ఓ దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరిలా ఏదో ఒక మూస పద్ధతిలో కాకుండా... నూతన సాగు పద్ధతులు అవలంభిస్తూ.. సృజనాత్మకతతో మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు. జీవితం ఒక ప్రవాహం అయితే ఆ ప్రవాహంలో తారసడే అనుభవాలు.. అనుభూతుల నుంచి లోటుపాట్లు సరిచేసుకుంటూ- నేలతల్లిని కన్నతల్లిగా భావించి సహజ వ్యవసాయ బాటలో సాగుతున్నారు.

నూతన విధానానికి శ్రీకారం...

గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన ఆరుమాళ్ల సాంబిరెడ్డి అనే రైతు... విజయవాడ- గుంటూరు జాతీయ రహదారిపై కుంచనపల్లి గ్రామంలో సుమారు పన్నెండు ఎకరాల పొలంలో విభిన్న పంటలు సాగు చేస్తున్నారు. ఏడేళ్లుగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రకృతి వ్యవసాయదారుల్లో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు. గతంలో తాను పండించిన పంటను ఇతర రైతుల మాదిరిగానే ఆర్గానిక్‌ ఉత్పత్తుల విక్రయ దుకాణాలు, రైతు బజార్లు, మాల్స్‌కు పంపించే వారు. ఇప్పుడు తానే నేరుగా వినియోగదారులకు విక్రయిస్తే కొనుగోలుదారులకు, సాగుదారునికి లాభసాటిగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. తన పొలంలోనే ఒక ఔట్‌లెట్‌ ఏర్పాటు చేశారు. ఆధునిక పద్ధతిలో... కొనుగోలుదారులను ఆకర్షించే రీతిలో ఈ విక్రయ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.

సహజ పద్దతిలో కూరగాయల సాగు

అభిరుచులకు అనుగుణంగా...

ఎలాంటి రసాయ మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. దీంతో వినియోగదారులు నేరుగా పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేసుకుంటున్నారు. అలాగే ఆసక్తి ఉన్నవారికి పొలంలో తిప్పి చూపుతూ... సహజ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి వద్ద కుండీలు, మిద్దెలపై ఉద్యాన పంటలు పండించుకునేందుకు అవసరమైన చిట్కాలు వారికి తెలియజేస్తున్నారు. వారికి అవసరమైన విత్తనాలు అందిస్తున్నారు. తాజా కూరలు, పండ్లను వినియోగదారులు స్వయంగా కోసుకుని తీసుకెళ్లే వెసులుబాటు ఇవ్వడంతో... వారాంతాల్లో అనేక మంది ఈ పొలం వద్దకు వచ్చి తమకు కావల్సిన కూరగాయలు తీసుకెళ్తున్నారు. వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా వారికి అవసరమైన పంటల సాగుపైనా సాంబిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

సాగుతో పాటు.. సలహలు కూడా...

ఆవు మన సంస్కృతిలో భాగమని... అది మన సేద్యానికి ప్రతీకని విశ్వసిస్తూ ప్రకృతిబాటలో సాంబిరెడ్డి సాగిస్తోన్న సేద్యం- రైతుగా అతని అనుభవం ఇతరులకు స్ఫూర్తిదాయకం. అందుకే తాను ఒంటరి పోరు సాగిస్తున్నా- తనలా మరికొందరిని తయారు చేసేందుకు అనునిత్యం పరితపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, వివిధ రంగాల ప్రముఖులు సాంబిరెడ్డిని తమ పొలాల వద్దకు తీసుకెళ్లి- అతని సలహాలతో వ్యవసాయం చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని వ్యక్తులు సైతం సాంబిరెడ్డి పొలం నుంచే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తెప్పించుకుంటున్నారు. తన ఏడేళ్ల శ్రమలోని ఆటుపోట్లు ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపునకు బాటలు వేశాయని సంతోషిస్తోన్న సాంబిరెడ్డి- ప్రకృతి పద్ధతిలో పండిస్తోన్న ఇతర రైతుల ఉత్పత్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని తన ఔట్‌లెట్‌లో ఉంచి విక్రయిస్తున్నారు.

సహజ పద్దతిలో కూరగాయల సాగు

ఇదీ చదవండీ...అలసిన వయస్సుకు ఆధారమేది...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.