ETV Bharat / state

POLAVARAM: పోలవరం భూకుంభకోణంలో కదులుతున్న అక్రమాల డొంక..

author img

By

Published : Jul 6, 2022, 8:29 AM IST

POLAVARAM: పోలవరం ప్రాజెక్టు భూముల పరిహారం పంపిణీ అక్రమాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు రూ.50 కోట్ల వరకు ఇలాంటి అక్రమాలు జరిగి ఉంటాయని విశ్వసనీయ వర్గాల కథనం. దొంగ పట్టాలు సృష్టించి, కొండ పోరంబోకు భూముల సేకరణలో అనర్హులకు పరిహారం పంపిణీ చేసిన అంశాన్ని మే నెలలోనే ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. అనేక గ్రామాల గిరిజనులు తమకు ఇంకా పరిహారం అందలేదని చెప్పడం, ఇప్పటికే వారి భూములకు పరిహారం చెల్లించినట్లు రికార్డుల్లో నమోదై ఉన్న అంశాలు బయటపడుతూనే ఉన్నాయి.

POLAVARAM
POLAVARAM

POLAVARAM: పోలవరం ప్రాజెక్టు భూముల పరిహారం పంపిణీ అక్రమాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక గ్రామాల గిరిజనులు తమకు ఇంకా పరిహారం అందలేదని చెప్పడం, ఇప్పటికే వారి భూములకు పరిహారం చెల్లించినట్లు రికార్డుల్లో నమోదై ఉన్న అంశాలు బయటపడుతూనే ఉన్నాయి. దాదాపు రూ.50 కోట్ల వరకు ఇలాంటి అక్రమాలు జరిగి ఉంటాయని విశ్వసనీయ వర్గాల కథనం. దొంగ పట్టాలు సృష్టించి, కొండ పోరంబోకు భూముల సేకరణలో అనర్హులకు పరిహారం పంపిణీ చేసిన అంశాన్ని మే నెలలోనే ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఈ కుంభకోణంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు. పోలవరం ప్రత్యేకాధికారి ప్రవీణ్‌ ఆదిత్య విచారణ జరిపి జిల్లా కలెక్టరుకు నివేదిక సమర్పించారు. అనంతరం ఈ అక్రమాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మరో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం
ఈ అక్రమాలు జరిగిన సమయంలో దేవీపట్నం ఎమ్మార్వోగా పని చేసిన వీర్రాజును అధికారులు సస్పెండు చేయడంతోపాటు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్రమాల్లో మరో ఇద్దరు కీలక అధికారుల ప్రమేయం ఉందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో వీటికి కొన్ని ఆధారాలు దొరికినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో భూ సేకరణ ప్రత్యేక కలెక్టరుగా పని చేసిన ఇద్దరు రెవెన్యూ అధికారుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. అందులో ఒకరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. మరొకరు వేరే చోట విధుల్లో ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దళారులపై పోలీసుల కన్ను
అక్రమాల్లో నలుగురు దళారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు కీలకంగా వ్యవహరించారు. అధికారులను కలుపుకొని, పరిహారాన్ని పక్కదోవ పట్టించడంలో వారే కీలక పాత్ర పోషించారు. పోలీసులు దళారులపైనా కన్నేశారు. ఒక ప్రధాన దళారి నుంచి సమాచారం రాబడుతున్నారని తెలిసింది. ఎమ్మార్వో, దళారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇద్దరు ఉన్నతాధికారుల ప్రమేయాన్ని ఇందులో ఆధార సహితంగా గుర్తించినట్లు తెలిసింది.

కొండమొదలుది మరో కథ
దేవీపట్నం మండలం కొండమొదలు భూములకు సంబంధించి అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అక్కడ భూముల పరిహారానికి నిజమైన హక్కుదారులు ఎవరో తేలకపోవడంతో గతంలో ఉన్న ఒక అధికారి రూ.25 కోట్లను కోరుకొండలోని ఒక బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు తెలిసింది. తర్వాత కొందరు దళారులు అప్పట్లో ఒక ఉన్నతాధికారిని సంప్రదించారు. అసలు హక్కుదారులు తేలక ముందే దాదాపు రూ.18 కోట్ల వరకు మొత్తం వేరేవారి పేరున చెక్కులు ఇచ్చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో పెద్ద మొత్తంలో కమీషన్‌ చేతులు మారిందన్న ఆరోపణలున్నాయి. తాజా విచారణలో ఈ అంశమూ వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.