ETV Bharat / state

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి.. నేతల నివాళి

author img

By

Published : May 22, 2022, 1:44 PM IST

Updated : May 22, 2022, 7:38 PM IST

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో నిర్వహించారు. సుబ్రహ్మణ్యం భార్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించి..అండగా ఉంటామన్నారు. హైకోర్టు ఈ ఘటనపై జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించాలని...మాజీ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు.

Funeral
పూర్తైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

పూర్తైన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

Funeral: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు.. ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో నిర్వహించారు. డ్రైవర్‌ మృతికి ఎమ్మెల్సీనే కారణమంటూ.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు శనివారం ఆందోళనకు దిగారు. ఉదయ్‌భాస్కర్‌ని అరెస్టు చేసే వరకూ శవపరీక్ష నిర్వహించడానికి వీల్లేదంటూ నిరసన చేపట్టారు. పలు దఫాల చర్చల అనంతరం శనివారం అర్థరాత్రి సుబ్రహ్మణ్యం మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన పోలీసులు.. ఆదివారం ఉదయం అతని స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడకు తరలించారు. మృతదేహానికి కులవివక్ష పోరాట సంఘాల నేతలు, స్థానికులు నివాళులు అర్పించారు. తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. డ్రైవర్‌ మృతికి ఎమ్మెల్సీనే కారణమన్న కులవివక్ష పోరాట సంఘాల నేతలు.. అతడ్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

సీఎం జగన్‌, మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి.. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ బినామీ అని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆరోపించారు. అందుకే కళ్లముందే తిరుగుతున్నా పోలీసులు అతడిని పట్టుకోవడానికి సాహసించడం లేదన్నారు.

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం భార్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గర్భవతిగా ఉన్న సుబ్రమణ్యం భార్య అపర్ణకు పెద్ద కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశంతో పాటు ఎస్సీ సంఘాలు చేసిన పోరాటం వల్లే.. సుబ్రహ్మణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారని తెలిపారు. పెళ్లిళ్లు, పేరంటాళ్ల పేరుతో నిందితుడు కళ్లముందే తిరుగుతున్నా అరెస్ట్ చెయ్యకపోవడాన్ని తప్పుపట్టారు. పోలీసుల చర్యలు బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉన్నాయని విమర్శించారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

సుబ్రహ్మణ్యం మృతదేహానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు మాల్యాద్రి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మధు, సీపీఎం రాష్ట్ర నాయకుడు సుబ్బారావు నివాళులు అర్పించారు. వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 22, 2022, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.