ETV Bharat / state

కోనసీమ సంక్రాంతి సంబరాలు..పరదేశీయులు ఫిదా..

author img

By

Published : Jan 16, 2020, 4:19 PM IST

Foreigners in sankranti celebrations in East godawari
సంక్రాంతి సంబరాలకు పరదేశీయులు సైతం ఫిదా

సంక్రాంతి పండుగంటే...సాధారణంగా బంధువులు, కొత్త అల్లుళ్లు వస్తుంటారు. కానీ, ఆ గ్రామానికి మాత్రం విదేశీ అతిథులు విచ్చేశారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో కలిసి వారి మిత్రులు వచ్చారు. గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని... ఉత్సాహంగా గడిపారు.

కోనసీమ సంక్రాంతి సంబరాలు..పరదేశీయులు ఫిదా..
భోగిమంటలు.. పిండివంటలు.. కోళ్ల పందేలు.. చలువ పందిళ్లు.. హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దుల విన్యాసాలతో ఊరంతా.. సంక్రాంతి సంబరాలు. ఆ సంబరాలను పాల్గొనేందుకు ప్రవాస భారతీయులతో కలిసి వారి మిత్రులు తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని పొట్టిలంక గ్రామానికి విచ్చేశారు. గ్రామంలో రాష్ట్ర యువజన సేవావిభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రవాస భారతీయులకు గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. చిన్నారులు..పల్లె జనంతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేస్తూ.. ప్రవాస భారతీయులు సందడిగా గడిపారు. మయన్మార్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, గయానా, ఫీజీ, దేశాల నుంచి 40 మంది విదేశీయులు ఈ గ్రామానికి వచ్చారు. వారంతా భోగి మంటలు వెలిగించి ఆనందంగా గిరిజనులతో నృత్యం చేశారు. విదేశీ ప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొనడం.. భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు తెలిసేలా ఈ వేడుకలు నిర్వహించటం సంతోషకరమని ఎంపీ భరత్ అన్నారు.

కోలాటాలు.. కోడిపందేలను విదేశీయులు ఆసక్తిగా తిలకించారు. తమ మిత్రులతో కలిసి సంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. ఆటపాటలతో ప్రవాస భారతీయులు, విదేశీయులు ఉల్లాసంగా గడిపారు. ఎంపీ భరత్.. విదేశీ ప్రతినిధులకు కోనసీమ పిండివంటలను రుచిచూపించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తీ భోజనాలు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని విదేశీ ప్రతినిధులు అన్నారు. తమ మిత్రులతో కలిసి ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకోవడం మరపురాని అనుభూతి అని తెలిపారు.

సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిన విదేశీయులు.. పొట్టిలంక గ్రామ ప్రజల ఆతిథ్యానికి మంత్రముగ్థులయ్యారు. కోనసీమ అందాలు తిలకిస్తూ... సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు.

ఇదీ చదవండి :

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.