ETV Bharat / state

ఉపాధి మార్గం.. తితిదే శిల్ప కళాశాల

author img

By

Published : Dec 1, 2020, 3:06 PM IST

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆధారమైన శిల్ప, వాస్తు నైపుణ్యాలను భావితరాలకు అందించే లక్ష్యంతో.. తితిదే ఏర్పాటు చేసిన శిల్పకళాశాల యువతకు ఉపాధి కేంద్రంగా మారింది. నాలుగు సంవత్సరాల పాటు శిల్పకళాశాలలో అభ్యాసం పూర్తిచేసుకున్న విద్యార్థులు స్వయం ఉపాధి పొందగలుగుతున్నారు. శిల్పకళను అభ్యసించే విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో తితిదే తీసుకొంటున్న చర్యలు ఆధునిక యువతనూ ఆకర్షిస్తోంది. తమిళనాడులోని మహాబలిపురం తర్వాత దేశంలో రెండో శిల్పకళాశాలగా తిరుపతి శిల్పకళాశాలకు గుర్తింపు ఉంది. తిరుపతి కళాశాలలో కోర్సులు.. అభ్యాసం పూర్తిచేసుకున్న విద్యార్థుల ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం

tdd College of Sculpture interesting story
తితిదే శిల్ప కళాశాల

సాధారణ పట్టభద్రులతో పాటు, ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉపాధి కోసం వెతుక్కుంటున్న ఈ రోజుల్లో.. తితిదే నిర్వహిస్తున్న శిల్పకళాశాల విద్యార్థులు మాత్రం కోర్సు పూర్తయ్యాక స్వయం ఉపాధిపొందుతున్నారు. 1960 సంవత్సరంలో సర్టిఫికెట్‌ కోర్సుతో ప్రారంభమైన తిరుపతి శిల్పకళాశాల.. రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థ గుర్తింపు పొందింది. గత యాబై సంవత్సరాల్లో వందల మంది విద్యార్థులకు శిల్ప, వాస్తు నైపుణ్యాలను అందించడంతో పాటు స్వయం ఉపాధి పొందేలా తీర్చిదిద్దుతోంది.

ఆలయ నిర్మాణం, శిలాశిల్పం, సుధాశిల్పం, ధారు శిల్పం, లోహ శిల్పం, సంప్రదాయ చిత్రలేఖనం, కళంకారీ విభాగాల్లో తిరుపతి శిల్పకళాశాల విద్యాబోధన చేస్తోంది. కళంకారీపై రెండు సంవత్సరాల డిప్లమో కోర్సు.. మిగిలిన విభాగాల్లో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు బోధిస్తున్నారు. నాలుగు సంవత్సరాల పాటు కళాశాలలో చదివిన విద్యార్థులకు రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ వంటి కోర్సుల ప్రవేశాలకు ఆర్హత సాధిస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్న విశ్వాసం కళాశాల విద్యార్థుల్లో వ్యక్తమవుతుండగా.. శిక్షణ పూర్తిచేసుకున్న పూర్వ విద్యార్థులు తితిదే నిర్వహిస్తున్న శిల్ప తయారీ కేంద్రంలో ఉపాధి పొందుతున్నారు.

నాలుగు సంవత్సరాల పాటు శిల్పకళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ప్రోత్సాహకంగా తితిదే లక్షరూపాయల పారితోషికం అందజేస్తోంది. కోర్సులో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థి పేరిట లక్ష రూపాయలు బ్యాంకులో జమచేస్తారని.. కోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా విద్యార్థికి చెల్లిస్తారని కళాశాల ప్రధాన అచార్యులు వెంకటరెడ్డి తెలిపారు.

ఒక్కో విభాగంలో పది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. గడచిన ఆరవై సంవత్సరాలుగా ఆరు విభాగాల్లో శిక్షణ ఇస్తున్న శిల్పకళాశాల.. రెండు సంవత్సరాల క్రితం నుంచి కళంకారి కోర్సు ప్రవేశ పెట్టింది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం శిల్పకళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు శిల్పకళాశాలలో విద్యాబోధనకు మక్కువ చూపుతున్నారు.

ఇదీ చదవండి: వినియోగదారులకు స్వల్ప ఊరట...తప్పిన విద్యుత్ ఛార్జీల భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.