ETV Bharat / state

స్మార్ట్‌గా ఆలోచించి.. అన్నదాతకు అండగా నిలిచి..!

author img

By

Published : May 3, 2021, 8:39 PM IST

Updated : May 3, 2021, 9:55 PM IST

Smart technolgy
Smart technolgy

పంటలను కాపాడుకోవటానికి అన్నదాతలు పడే శ్రమ అంత, ఇంతా కాదు. దిగుబడి, గిట్టుబాటు ధర, వర్షాల ప్రభావంతో పంట ఇంటికి చేరే వరకు వారికి కంటి మీద కునుకు కూడా కరువే. వాటితో పాటు.. వేల ఎకరాల్లో పంటలను అడవిపందులు, ఏనుగులు, జింకలు, ఇతర అడవి జంతువులు నాశనం చేస్తున్నట్లు అటవీశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. చిత్తూరు జిల్లాలోని కుప్పం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎల్‌డబ్ల్యూడీ పరికరాన్ని తయారు చేశారు. దీని ద్వారా రైతులు.. పంటలను కాపాడుకోవచ్చని వారి తెలిపారు.

ఆరుగాలం శ్రమించిన రైతన్నకు దిగుబడి, గిట్టుబాటు ధరలు, వర్షపాతాల ప్రభావంతోపాటు పంటను ఇంటికి చేరే వరకు సంరక్షించుకోవడం కూడా కీలకమే. ఏటా వేల ఏకరాల్లో పంటలను అడవిపందులు, ఏనుగులు, జింకలు, ఇతర అడవి జంతువులు నాశనం చేస్తున్నట్లు అటవీశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అప్పులు చేసి సాగు చేసిన అన్నదాతకు చివరికి నష్టమే మిగులుతోంది. మరోవైపు పొలాల్లో అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి రైతులు, అమాయకులు మృత్యువాత పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారం చూపాలనుకున్నారు కొందరు విద్యార్థులు. రైతన్నకు అండగా నిలవాలని తలిచారు. పంటను జంతువుల నుంచి కాపాడుకునేందుకు పరికరాలను తయారు చేశారు..చిత్తూరు జిల్లాలోని కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఆఖరి సంవత్సరం ఎలక్రికల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు.

ఇంజినీరింగ్ విద్యార్థులు
ఇంజినీరింగ్ విద్యార్థులు

విద్యుత్‌ తీగల నుంచి కాపాడుతుంది

వ్యవసాయ పొలాల సంరక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు తగిలి అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అటవీ సంరక్షణలో భాగంగా ఏడాదిలో దాదాపు మన దేశంలో 15 మంది అటవీ సిబ్బంది చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి పరిష్కారం చూపుతూ ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థులు పి.శాంతి, ఆర్‌.మంజునాథ్‌ ‘లైవ్‌ వైర్‌ డిటెక్టర్‌’(ఎల్‌డబ్ల్యూడీ) పరికరాన్ని తయారు చేశారు. దీనిని ‘డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌-ఇండియా, ఏఐసీ-ఎస్‌కేయూ’ నిర్వహించిన హాకథాన్‌ కార్యక్రమంలో ప్రదర్శించి మొదటి బహుమతి అందుకున్నట్లు విద్యార్థులు చెప్పారు. ఎల్‌డబ్ల్యూడీ పరికరం మానవుని అరచేతిలో సులువుగా ఉపయోగించవచ్చని, తేలికైందని తెలిపారు. విద్యుత్‌ తీగలను 7-10 మీటర్ల నుంచి కనుగొని మనకు శబ్దం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుందని, విద్యుత్‌ సరఫరా అయ్యే తీగలకు దగ్గరగా పోయే కొద్దీ శబ్దం పెరగుతుందని చెప్పారు. దీని వల్ల మన చుట్టూ ఉన్న విద్యుత్‌ తీగలను గుర్తించి జాగ్రత్త పడటంతో విద్యుత్‌ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని విద్యార్థులు వివరించారు.

పొలంలోకి పక్షులు, జంతువులు రావు

రైతులు పండించిన పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంటను పక్షులు, అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు రైతులు అవస్థలు పడుతుంటారు. అలాకాకుండా రైతుకు ఉపయోగపడేలా ‘స్మార్ట్‌ సైరన్‌’ పరికరాన్ని భరత్‌, గుణశేఖర్‌, జైగణేష్‌, సతీష్‌ తయారు చేశారు. ఈ పరికరం చేసే శబ్దం కారణంగా ఆ ప్రాంతంలోకి పక్షులు, జంతువులు రాకుండా ఉంటాయి. ఆరు రకాల శబ్దాలను ఉత్పత్తి చేయడమే కాకుండా కిలో మీటరు వరకు దీని శబ్దం ఉంటుంది. ఈ పరికరానికి 16 సార్లు టైమర్‌ను సెట్‌ చేసుకోవచ్ఛు పరికరాన్ని సోలార్‌, విద్యుత్‌ను ఉపయోగించి ఛార్జ్‌ చేసుకోవచ్చని విద్యార్థులు వివరించారు. ఈ పరికరాన్ని పొలంలో ఎక్కడైనా పెట్టవచ్చని విద్యార్థులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ఎల్లుండి నుంచి.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ..!

Last Updated :May 3, 2021, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.