ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. రెండు ఆటోలు బోల్తా.. పది మంది కూలీలకు గాయాలు..

author img

By

Published : Mar 14, 2023, 12:21 PM IST

Etv Bharat
Etv Bharat

Road Accidents: రాష్ట్రంలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఒకరు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Road Accidents: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం పోలిరెడ్డి పాలెం ఆంజనేయస్వామి గుడి ఎదురుగా మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని కృష్ణారెడ్డి డొంక ప్రాంతానికి చెందిన కంభంపాటి సుధీర్ బాబు(39) ద్విచక్ర వాహనంపై నరసరావుపేట వైపు వెళ్తుండగా చిలకలూరిపేట వైపు వస్తున్న మినీ ట్రాన్స్ పోర్ట్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుధీర్​బాబు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా సుధీర్​బాబు అప్పటికే మృతి చెందాడు. అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కర్ణాటక వ్యక్తి మృతి : చిత్తూరు - పూతలపట్టు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతఘాత్రులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.

ఆటో- ఆర్టీసీ బస్ ఢీ : బాపట్ల జిల్లా రేపల్లె మండలంలో ఆటో - ఆర్టీసీ బస్ ఢీకొన్నాయి. కారూమూరు గ్రామ శివారులో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న నలుగురు మహిళలు, డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. బాధితులు భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కూలీ పనుల కోసం పల్లెకోన గ్రామం నుంచి కృష్ణ జిల్లా వైపు వెళ్తుండగా రేపల్లె నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

బెంగళూరు - బళ్లారి జాతీయ రహదారిపై అదుపు తప్పిన ఆటోలు..: అనంతపురం జిల్లా డి.హిరేహల్ మండలం ఓబులాపురం గ్రామ సమీపంలోని బెంగళూరు - బళ్లారి జాతీయ రహదారిపై సోమవారం రెండు ఆటోలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఆటోలు ఒవర్​టేక్​ చేసే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 10 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వ్యవసాయ పనుల కోసం కూలీలు బళ్లారి జిల్లా శంకర్ బండ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా కూల్​డ్రింక్స్​ తరలిస్తున్న ఆటో వేగంగా ఒవర్​టేక్​ చేసే క్రమంలో అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు ఆటోలు బోల్తాపడ్డాయి. గాయపడిన వారిలో కర్ణాటకలోని పైకాన్​ గ్రామానికి చెందిన కవిత, దేవమ్మ, అంజనమ్మ , మల్లాపుర, కోనాపురం గ్రామాలకు చెందిన కూలీలుగా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్​లో క్షతగాత్రులను బళ్లారికి తరలించారు. వారంతా ప్రస్తుతం బళ్లారి విమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. డి.హీరేహళ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బావిలో జారిపడిన ట్రాక్టర్‌ : ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో సోమవారం పొలం దున్నుతుండగా ట్రాక్టర్‌ జారిపడి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మాలవతు కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.