ETV Bharat / state

ఇతర రాష్ట్రాలకు బియ్యం అక్రమ రవాణా.. తనిఖీల్లో గుట్టు రట్టు

author img

By

Published : Dec 10, 2020, 10:19 AM IST

Rice smuggling
Rice smuggling

పేదల బియ్యం పెద్దలకు వరంగా మారింది. సరిహద్దు ప్రాంతాలే కేంద్రాలుగా బియ్యం తరలిపోతోంది. విజిలెన్స్‌, పోలీసు అధికారుల తనిఖీలతో అక్రమ రవాణా వెలుగు చూస్తోంది. ప్రజా పంపిణీ బియ్యం అక్రమాలపై జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ముగ్గురు ఒప్పంద ఉద్యోగులపై వేటు వేశారు. జీడీనెల్లూరు గోదాం డీటీని సస్పెండ్‌ చేశారు. ఇందులో భాగస్వామ్యం ఉన్న శ్రీకాళహస్తికి చెందిన రైస్‌మిల్‌ యజమానితో కలిసి నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోతుగా విచారణ చేస్తే మరింత మంది అక్రమార్కులు వెలుగులోకి రానున్నారు.

ప్రజా పంపిణీ బియ్యం చిత్తూరు జిల్లా నుంచి హద్దులు దాటుతోంది. టన్నుల కొద్దీ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు పంపి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 11,83,553 కార్డుదారులకు పంపిణీ నిమిత్తం 2945 చౌకదుకాణాలకు గత నెలలో 1.84 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ పోస్‌ యంత్రాల్లో వేలిముద్రలు నమోదు కాలేదని, సర్వర్‌ సక్రమంగా పనిచేయలేదన్న కారణంగా చాలా మంది పేదలకు బియ్యం అందలేదు. భారీగా మిగిలిపోయిన వాటిని సివిల్‌ సప్లైస్‌ గిడ్డంగుల పర్యవేక్షకులు, రేషన్‌షాపు డీలర్లు ఆయా ప్రాంతాల్లోని మిల్లర్ల సహకారంతో పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

భారీగా స్వాధీనం

నెలన్నర క్రితం అక్రమంగా తరలిపోతున్న రెండు లారీల బియ్యాన్ని శ్రీకాళహస్తి రెండో పట్టణ, తొట్టంబేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారం కిందట వరదయ్యపాళెం సంతవేలూరులో అక్రమంగా తరలుతున్న 98 బస్తాల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి సత్యవేడుకు సమీపంలోని నెల్లూరు జిల్లా తడ మండల కేంద్రంలోని రెండు గోదాములో రూ.24 లక్షల విలువ చేసే 110 టన్నుల తమిళనాడు రేషన్‌బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

అక్రమాలు ఇలా..

జిల్లాలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాలు అక్రమాలకు అనుకూలంగా మారాయి. పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు పట్టుకునే వరకు ఈ అక్రమాలు వెలుగు చూడకపోవడం గమనార్హం. శ్రీకాళహస్తి కేంద్రంగా తొట్టంబేడు, బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం, సత్యవేడు నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి కేవీబీపురం, పిచ్చాటూరు, నాగలాపురం మీదుగా మరో మార్గంలో బియ్యం గుట్టుగా తరలిపోతున్నాయి.

నగరి అడ్డా

నగరి, సత్యవేడు, జీడీ నెల్లూరు నియోజక వర్గాల్లోని ప్రతి మండలంలోనూ అక్రమార్కులు బియ్యం తరలింపునకు కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని ఒకచోట చేర్చి అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇటీవల జీడీ నెల్లూరు గిడ్డంగి నుంచి నగరి గిడ్డంగికి అనధికారికంగా తీసుకొచ్చిన నాలుగు టన్నుల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.

పలమనేరు కేంద్రంగా..

జిల్లాలో బైరెడ్డిపల్లి, పలమనేరు వి.కోట, కుప్పం, గంగవరం మండలాలు అక్రమ రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. జిల్లా నుంచి కాకుండా తమిళనాడు నుంచి బియ్యం కర్ణాటకు రావడం.. అక్కడ పాలిష్‌ అయ్యాక మళ్లీ సాధారణ బియ్యం రకం మళ్లీ జిల్లాతో పాటు తమిళనాడుకు తీసుకెెళ్లడం గమనార్హం. తమిళనాడుకు సరిహద్దులో ఉన్న గుడియాత్తం నుంచి బియ్యం అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది.

కలిసొచ్చిన కరోనా..

కరోనా నేపథ్యంలో గత ఆరునెలలుగా ప్రజా పంపిణీ బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు బియ్యాన్ని పక్కరాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్నెళ్ల వ్యవధిలో కోట్ల రూపాయల విలువజేసే బియ్యం హద్దులు దాటినట్లు సమాచారం.

కఠిన చర్యలు తీసుకుంటాం

ప్రజాపంపిణీ బియ్యం పక్కదారి పట్టడంపై ఇప్పటికే గిడ్డంగుల పర్యవేక్షకులను హెచ్చరించాం. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదు. అవినీతి, అక్రమాలపై విమర్శలు ఎదుర్కొంటున్న నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. - మార్కండేయులు, జేసీ, చిత్తూరు

ఇదీ చదవండి:

ఆర్గానో క్లోరిన్‌ వల్లే ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.