ETV Bharat / state

అనుమతిస్తే యువగళం.. అడ్డుతగిలితే దండయాత్ర.. జగన్​కు లోకేశ్ హెచ్చరిక

author img

By

Published : Feb 9, 2023, 12:27 PM IST

Updated : Feb 9, 2023, 10:48 PM IST

LOKESH YUVAGALAM : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పాదయాత్రకు ముందు అనుమతుల పేరిట ఇబ్బందులకు గురిచేయగా.. తాజాగా చిత్తూరు జిల్లా సంసిరెడ్డిపల్లెలో మాట్లాడేందుకు అనుమతి లేదంటూ లోకేశ్​పై కేసు నమోదు చేశారు. పోలీసులపై జనం తిరగబడడం కొసమెరుపు.

నారా లోకేశ్‍ 14వ రోజు పాదయాత్ర
నారా లోకేశ్‍ 14వ రోజు పాదయాత్ర

జగన్​కు లోకేశ్ హెచ్చరిక

LOKESH YUVAGALAM : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ 14వ రోజు పాదయాత్ర జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 14 కిలోమీటర్లు సాగింది. ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి మూర్తినాయకనపల్లి, కడపగుంట, మహదేవ మంగళం, సంసిరెడ్డిపల్లె, అవలకొండ, రంగాపురం కూడలి నుంచి రేణుకాపురం విడిది కేంద్రం వరకు లోకేశ్‍ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న లోకేశ్‍ కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేశ్‍ కు తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రభుత్వం వేధిస్తోందంటూ... పాదయాత్రలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు లోకేశ్​ను కలిశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతుల పునరుద్ధరణ 10 ఏళ్లకు ఒకసారి జరిగేదని.. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్లకు ఒకసారి అనుమతులు రెన్యువల్ చేయాలన్న నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లోకేశ్‍ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని లోకేశ్‍ ఆరోపించారు. జే-ట్యాక్స్ కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను వేధింపులకు గురి చేస్తోందని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్లకోసారి రెన్యువల్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

సామాన్యుడిపై జులుం.. మైక్ లాక్కొని... జీడీ నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లెకు పాదయాత్ర చేరుకోగానే ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ప్రయత్నించిన లోకేశ్​ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. లోకేశ్​కు మైక్ అందించేందుకు వస్తున్న బాషాపై పోలీసులు దాడి చేసి గాయపరిచి మైక్ లాక్కున్నారు. లోకేశ్​ నిలుచున్న స్టూల్ సైతం లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, తెదేపా నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్టూల్ మీదే నిలబడి లోకేశ్‍ నిరసన తెలిపారు. తమ గ్రామం వచ్చినప్పుడు మాట్లాడవద్దు.. అనడానికి పోలీసులకు ఏమి హక్కు ఉందంటూ జనం తిరగబడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు హరించడానికి మీరు ఎవరు అంటూ పోలీసుల్ని లోకేశ్‍ నిలదీశారు.

పాదయాత్రలో భాగంగా రంగాపురం కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేశ్‍ జగన్‍ పై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు. పరదాలు అడ్డుపెట్టుకునే జగన్... నా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

నేను మైక్ లో మాట్లాడకపోయినా ఇక్కడి డీఎస్పీ నా మైక్ లాక్కెళ్లిపోయారు. జగన్ సహకరిస్తే పాదయాత్ర... సహకరించకుంటే దండయాత్రే.. జగన్ దమ్ముంటే నేరుగా రా... ఎంతమందినైనా తెచ్చుకో.. పోరాడేందుకు పసుపు సేన సిద్ధంగా ఉంది. అమరావతిలో పోలీసు ఉన్నతాధికారి రఘరామరెడ్డి నా పాదయాత్రపై నిఘా పెట్టి చూస్తున్నాడు. ప్రతి అంశాన్నీ లైవ్ ఇస్తున్నా.. చూసుకో.. అధికారంలోకి వచ్చాక మీ అంతు చూసేది నేనే. ఐపీఎస్ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. జగన్ ను నమ్ముకున్న అధికారులంతా గతంలో జైళ్లకు వెళ్లారు. కానిస్టేబుళ్లు, ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు ప్రభుత్వం బాకీ ఉంది.. మీ మెడికల్ రీయింబర్స్ మెంట్ కూడా నిలిపేసిందని గుర్తుంచుకోండి.. జగన్ మాట విని మీరు మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. జగన్ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.. చంద్రబాబు వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం.. కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలనుకోవడం జగన్‍ అవివేకం. - నారా లోకేశ్‍, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

పాదయాత్ర రేణుకాపురం విడిది కేంద్రానికి చేరుకోగానే రాత్రికి లోకేశ్‍ అక్కడే బస చేశారు.

పలువురు నాయకులపై కేసు... యువగళంపై పోలీస్ కేసుల పరంపర కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా నరసింగరాయినిపేట ఎన్టీఆర్ సర్కిల్​లో అనుమతి లేకుండా మీటింగ్ పెట్టారంటూ పోలీసులు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సహా తెలుగుదేశం నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లోకేశ్​, పులవర్తి నాని, అమర్నాథ్ రెడ్డి, దొరబాబు, చంద్రప్రకాశ్​పై పోలీసులు 188, 341, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

యువగళం పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పాదయాత్రలో లోకేశ్​కు మైకు తీసుకెళుతున్న వ్యక్తిపై పోలీసులు దాడి చేసి లాక్కెళ్లారు. వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్ పై పోలీసులు దాడులు చేశారు. ఇంటెలిజెన్స్ డీఐజీ రఘురామరెడ్డి అదేశాలకు అనుగుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పాదయాత్ర అడ్డుకోవడానికి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. పాదయాత్రను చూసి జగన్ మోహన్ రెడ్డికి లోకేష్ జ్వరం పట్టుకొంది. పోలీసులు తమ తీరు మార్చుకోకపోతే ప్రజలు తిరగబడి కొట్టేరోజు వస్తుంది. - అమరనాథ రెడ్డి, మాజీ మంత్రి

ఇవీ చదవండి :

Last Updated : Feb 9, 2023, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.