ETV Bharat / state

Royality Problems: నష్టాల్లో గ్రానైట్‌ పరిశ్రమ... మూసివేత దిశగా యూనిట్లు

author img

By

Published : Jan 2, 2022, 11:01 AM IST

Royality Problems: సిరులు కురిపించిన రాయికి ఇప్పుడు కష్టమొచ్చింది.. అంతర్జాతీయ మార్కెట్లో జిల్లా గ్రానైట్‌కు ఎంతో డిమాండ్‌ ఉండేది. చిత్తూరు జిల్లాలోని ప్రధాన వ్యాపారాల్లో గ్రానైట్‌దే సింహ భాగం.. కోట్లకు పడగలెత్తిన గ్రానైట్‌ వ్యాపారులు జిల్లాలో ఉన్నారు.. అలాంటిది ఇప్పుడు గ్రానైట్‌ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరవుతోంది.. అనేక ఆటుపోట్లతో పలు యూనిట్లు మూసివేత దిశగా పయనిస్తున్నాయి.. ఈ పరిస్థితుల్లో ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం, మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే విధానాలు అమలు చేస్తుండటం గ్రానైట్‌ వర్గాలను కలవరపెడుతోంది.

నష్టాల్లో గ్రానైట్‌ పరిశ్రమ
నష్టాల్లో గ్రానైట్‌ పరిశ్రమ

Royality Problems:చిత్తూరు జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడాది పాటు జిల్లాలోని క్వారీల్లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, గనులశాఖ అధికారులు వరుస సోదాలు నిర్వహించారు. 70కి పైగా క్వారీలకు రూ.వెయ్యి కోట్లకు పైగా జరిమానా విధిస్తూ గతేడాది ఫిబ్రవరిలో నోటీసులు జారీచేశారు. ఆపై కొవిడ్‌ కష్టాలు చుట్టుముట్టడం, ఇంధన ధరల పెరుగుదల, రహదారి, సముద్ర రవాణా ఛార్జీలు రెట్టింపవడం తదితర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వులతో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని గ్రానైట్‌ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది వ్యవధిలో కన్సిడరేషన్‌ మొత్తం పేరుతో రాయల్టీ మొత్తాన్ని 50 శాతం పెంచారు. డెడ్‌ రెంట్‌ మొత్తాన్ని భారీగా పెంచారు. పర్యావరణ అనుమతుల జారీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాల కాలపరిమితి కుదించి, వ్యయం మాత్రం వంద రెట్లు ఎక్కువ చేశారు. నిబంధనల అమలు పేరుతో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత ఇబ్బందిగా మారిందని గ్రానైట్‌ వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

అమలు కాని హామీలు..

ఈ గడ్డు పరిస్థితుల్లో గ్రానైట్‌ కోత యంత్రాల పరిశ్రమలు నిర్వహించడం సాధ్యం కాదని పలువురు యజమానులు అంటున్నారు. పరిశ్రమలు మూసివేయాలని కొందరు, ఉద్యమించాలని మరికొందరు యోచిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహ కాలతో ఆదుకోవాలని, గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు సంబంధించి తెలంగాణ, రాజస్థాన్‌లలో అమలవుతున్న శ్లాబ్‌ విధానాన్ని తీసుకురావాలని యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకువిద్యుత్‌ రాయితీ ఇవ్వాలని, గనుల శాఖ జారీ చేసే అనుమతి పత్రాలకు సంబంధించి క్యూబిక్‌ మీటరుకు 350 అడుగులకు బదులు 400 అడుగులకు పెంచాలని కోరుతున్నారు. వీటి అమలు దిశగా ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన చర్యలు శూన్యం.

ఇదీ చదవండి: దేశంలో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 27,553 మందికి వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.