ETV Bharat / state

ప్రకృతి విధానం.. పెరటి సేద్యం.. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం

author img

By

Published : Nov 9, 2020, 9:19 AM IST

పౌష్టికాహారం అందించటమే లక్ష్యంగా ప్రభుత్వాలు పలు పథకాలు ప్రవేశపెట్టాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పండ్లు, కూరగాయల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో చిత్తూరు జిల్లాలో అంగన్​వాడీ కేంద్రాల్లో పెరటితోటల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్రీ, శిశు సంక్షేమ శాఖ సహకారంతో సాగుకు ప్రణాళికలు చేస్తున్నారు.

brinjal plants in anganwadi centres
అంగన్‌వాడీల్లో సాగుచేసిన వంగ

చిత్తూరు జిల్లాలో జడ్‌బీఎన్‌ఎఫ్‌(పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం) శాఖ, స్రీ, శిశు సంక్షేమ శాఖ సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరటి తోటల(కిచెన్‌ గార్డెన్లు) పెంపకానికి చర్యలు చేపట్టారు.. బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో పెరటి తోటల సాగుకు ఉపక్రమించారు.. ప్రకృతి సేద్యం విధానంలో ఆకుకూరలు, కూరగాయల పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

రెండు వేల అంగన్‌వాడీల్లో

జిల్లాలో 2,800 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కిచెన్‌ గార్డెన్లు పెంచడానికి సుమారు 2 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో స్థలం అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక సెంటు నుంచి 10 సెంట్ల వరకు ప్రకృతి సేద్యం విధానంలో సాగు చేస్తారు. 365 రోజులు కూరగాయల దిగుబడులు లభించే దిశగా చర్యలు తీసుకుంటారు. సాగు విధానం, అధిక దిగుబడుల సాధనకు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులను ప్రకృతి సేద్యం అధికారులు వివరిస్తారు.

త్వరలో విత్తన కిట్లు

అంగన్‌వాడీల్లో కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటుకు అవసరమైన విత్తన కిట్లను ప్రకృతి సేద్యం అధికారులు అందజేస్తారు. ఆకు కూరలు, టమోటా, వంగ, క్యారెట్‌, బీట్‌రూట్‌, తీగజాతి రకం కాకర, బీర, సొర విత్తనాలను పంపిణీ చేయనున్నామని జడ్‌బీఎన్‌ఎఫ్‌ జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజరు నవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 200 అంగన్‌వాడీల్లో కిచెన్‌గార్డెన్ల సాగును మొదలుపెట్టామన్నారు. కలెక్టర్‌ భరత్‌గుప్తా చొరవతో ఈ నెలాఖరు నాటికి గుర్తించిన అంగన్‌వాడీ కేంద్రాలలో కిచెన్‌ గార్డెన్ల విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

బిల్డ్ ఏపీ మిషన్‌.. పలు శాఖలకు చెందిన భూముల వేలం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.