చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు.... సరిహద్దుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులకు భారీఎత్తున చేరుకుని అధినేతకు స్వాగతం పలికారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం కార్యకర్తల ర్యాలీతో రహదారులు పసుపుమయం అయ్యాయి. రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు... ఇవాళ, రేపు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం కుప్పం బస్టాండ్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. స్థానికసంస్థల ఎన్నికల తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబు... పలువురు తెలుగుదేశం నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరించనున్నారు. రెండో రోజు పర్యటనలో కుప్పం వ్యాపార సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
చంద్రబాబు పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. వి.కోట నుంచి భారీగా ర్యాలీగా తరలివెళుతున్న వారిని... ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన కార్యకర్తలు రహదారిపై బైఠాయించారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. తెలుగుదేశం కార్యకర్తల నిరసనతో చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో... పోలీసులు పట్టు సడలించారు. తెలుగుదేశం కార్యకర్తలకు నచ్చజెప్పి, ద్విచక్ర వాహన ర్యాలీని ముందుకు పంపారు.
ఇదీ చూడండి: కన్నడ పవర్‌స్టార్‌కు అనారోగ్యం- హుటాహుటిన ఆస్పత్రిలో చేరిక