ETV Bharat / state

లోకేశ్​ పాదయాత్రకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 11.03 గంటలకు తొలి అడుగు

author img

By

Published : Jan 26, 2023, 6:00 PM IST

nara lokesh
నారా లోకేష్

lokesh yuvagalam Arrangements : యువత భవిత కోసం, దగా పడ్డ వివిధ వర్గాలకు తోడు కోసం అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం నుంచి చేపట్టనున్న యువగళం మహాపాదయాత్రకు అన్ని ఏర్పాట్లూ చకచకా పూర్తయ్యాయి. రాష్ట్ర అభివృద్ధికి వారధిగా తాను నిలుస్తానంటూ 400రోజుల పాటు 4వేల కిలోమీటర్లకుపైగా నడిచేందుకు ఆయన సిద్ధమయ్యారు.

lokesh yuvagalam Arrangements : నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే వేదిక యువగళం అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ శుక్రవారం నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా దాదాపు 125కు పైగా నియోజకవర్గాల్లో లోకేశ్​ పాదయాత్ర సాగనుంది. ఈనెల 27న ఉదయం 11గంటల మూడు నిమిషాలకు కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయాన్నే ఆలయానికి చేరుకోనున్న లోకేశ్‌ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్దేశించుకున్న ముహూర్తానికి తొలి అడుగు వేయనున్నారు. సాయంత్రం కుప్పంలో జరిగే భారీ బహిరంగసభలో లోకేశ్‌ పాల్గొంటారు.

పార్టీ శ్రేణులు సిద్ధం : లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి ఈ బహిరంగసభకు హాజరయ్యేందుకు తెలుగుదేశం శ్రేణులు సిద్ధమయ్యాయి. దాదాపు 50వేల మందికి పైగా కార్యకర్తలు బహిరంగసభకు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణతోపాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా దాదాపు 400మంది పార్టీ సీనియర్‌ నేతలు బహిరంగా సభ వేదికపై ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 50వేలమంది వరకూ భోజన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు రామానాయుడు, కళా వెంకట్రావు , ఎమ్మెల్సీలు సత్యనారాయణ రాజు, అంగర రామ్మోహన్, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులవర్తి నాని తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తొలి రోజూ ఇలా : కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నారా లోకేశ్‌ అక్కడ నుంచి ఓల్డ్‌పేట్‌ వెళ్లనున్నారు. స్థానిక మసీదులో ప్రార్థనలు చేసి ముస్లిం మైనారిటీ నేతలతో సమావేశమవుతారు. కుప్పం బస్టాండ్‌, పార్టీ కార్యాలయం, ట్రాఫిక్‌ ఐల్యాండ్‌ జంక్షన్‌, కుప్పం ప్రభుత్వాస్పత్రి క్రాస్‌, శెట్టిపల్లి క్రాస్‌ల మీదుగా పీఈఎస్‌ కళాశాల వరకు తొలిరోజు పాదయాత్ర సాగనుంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెల రోజులు : ఈనెల 28న పీఈఎస్‌ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు సాగనుంది. ఈనెల 29న శాంతిపురం మండలంలోని అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు జరుగనుంది. కుప్పంలో 29కిలోమీటర్ల మేర మూడు రోజులపాటు లోకేశ్​ పాదయాత్ర జరుగనుంది. కుప్పం తర్వాత పలమనేరు నియోజకవర్గంలోకి వెళ్లనున్న యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తంగా నెలరోజుల పాటు సాగనుంది. చిత్తూరు జిల్లా నుంచి అనంతపురంలోకి ప్రవేశించనున్న లోకేశ్​ పాదయాత్ర అక్కడినుంచి కర్నూలు జిల్లా మీదుగా కడప జిల్లాలోకి వెళ్లి రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకోనుంది. కడప నుంచి తిరిగి చిత్తూరు జిల్లా మీదుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించి అక్కడనుంచి కోస్తా జిల్లాల్లోకి లోకేశ్‌ పాదయాత్ర రానుంది. లోకేష్ 400రోజుల పాదయాత్ర అనుమతులపై డీజీపీ కార్యాలయం ఇప్పటివరకు స్పందించక పోగా.., జిల్లా యంత్రాంగం మాత్రం తొలి మూడు రోజులకు మొత్తం 29 షరతులు విధించింది. లోకేష్ పాదయాత్రను అడ్డుకునే కుట్రను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలుగుదేశం నేతలు తేల్చి చెప్తున్నారు.

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు : కుప్పం నుంచి ప్రారంభం కానున్న మహాపాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగనుంది. ప్రతి నియోజకవర్గంలో 3రోజుల పాటు లోకేశ్​ పాదయాత్ర ఉండేలా కార్యాచరణ సిద్ధమయ్యింది. ఒక్కో నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెట్టనున్నారు. ఏడాదికి పైగా సాగే ఈ పాదయాత్రలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలను చుట్టున్నారు. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా సాగే పాదయాత్రలో మహిళలు, రైతులు, వివిధ వర్గాల సమస్యలను చర్చించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయనున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున వచ్చిన యువత సమస్యలు తెలుగుదేశం అధ్యయనం చేసింది. యువగళం వేదికను రాష్ట్ర యువతకు పరిచయం చేసి నడిపించే బాధ్యతను అధిష్టానం లోకేశ్​కు అప్పగించింది.

యువగళంలో పాల్గొనాలంటే..: రాష్ట్రంలో కోటీ 50 లక్షల మందిపైగా నిరుద్యోగులున్నారని అంచనా వేశారు. నిరుద్యోగ సమస్యతో ప్రతి నాలుగు రోజులు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఏపీలో ప్రతి 8 గంటలకు ఒక మహిళ అఘాయిత్యానికి గురవుతోందనే అభిప్రాయమూ వ్యక్తమయ్యింది. రాష్ట్రంలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువగళం వినిపించాలని లోకేశ్​ నిర్ణయించారు. 9686296862 కి మిస్డ్ కాల్ ఇచ్చి యువగళంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ప్రచారాస్త్రం : రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకూ సాగే ఈ మహా పాదయాత్రలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను లోకేశ్​ ఎండగట్టనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా.., ఆ స్థాయిలో ఇంకొన్ని చోట్ల పార్టీ కార్యకలాపాలు లేవనేది తెదేపా నేతల అంతర్మథనం. లోకేశ్​ పాదయాత్ర ఈ లోటును భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి లోకేశ్​ పాదయాత్ర వేదికగా నిలుస్తుందని నేతలు చెబుతున్నారు. మహిళల్లో ధైర్యాన్ని నింపేదే యువగళమని వారు స్పష్టం చేశారు. జగన్ చేతుల్లో ఎక్కువగా మోసపోయిన వర్గాల్లో మహిళలే ముందు వరుసలో ఉన్నందున వారి సమస్యల పరిష్కారానికి లోకేష్‌ కృషి చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సరిగ్గా పదేళ్ల క్రితం: 2012 అక్టోబర్ 2వ తేదీన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో వస్తున్నా మీకోసం పేరిట మహా పాదయాత్ర నిర్వహించారు. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అది ప్రభావం చూపి 2014లో తెదేపా అధికారంలోకి వచ్చింది. వివిధ అంశాలపై పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దూరమైన వర్గాలను దరి చేర్చుకోవడానికి.. ప్రజా వ్యతిరేక పాలనను తూర్పారబట్టి ప్రభుత్వ వ్యతిరేకతను ఇంకా పెంచేందుకు లోకేష్ యాత్ర సరైన సాధనమని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.