ETV Bharat / state

Gang Rape: టైమ్ అడిగి భర్తతో వివాదం.. ఆపై భార్యపై అత్యాచారం: బాపట్ల ఎస్పీ

author img

By

Published : May 1, 2022, 2:51 PM IST

Updated : May 2, 2022, 4:58 AM IST

ఆపై భార్యపై అత్యాచారం
ఆపై భార్యపై అత్యాచారం

14:39 May 01

రేపల్లె అత్యాచార కేసును ఛేదించిన పోలీసులు

టైమ్ అడిగి భర్తతో వివాదం.. ఆపై భార్యపై అత్యాచారం

బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్​లో మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. విజయకృష్ణ, నిఖిల్ అనే యువకులతోపాటు...ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌ వెల్లడించారు. ఈ ఘటనలో రాజకీయ కోణం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. బాధిత కుటుంబం గుంటూరు నుంచి తెనాలి మీదుగా.. రేపల్లె రైల్వే స్టేషన్ చేరుకుని నాగాయలంక వెళ్లేందుకుగాను ఇవాళ అర్థరాత్రి ప్లాట్​ఫాం నిద్రించారన్నారు. ఆ సమయంలో టైమ్ అడిగి బాధితురాలి భర్తతో నిందితులు విజయకృష్ణ, నిఖిల్​తో పాటు మరో బాలుడు వివాదం పెట్టుకున్నారన్నారు. వాచీ లేదనటంతో ఆమె భర్తను కొట్టి డబ్బులు లాక్కొన్నారన్నారు. అనంతరం బాధితురాలిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారని వెల్లడించారు. బాధితురాలి భర్త పోలీస్‌స్టేషన్‌కు రాగానే.. పోలీసు సిబ్బంది రైల్వేస్టేషన్‌కు వెళ్లారన్నారు. నిందితుడు చొక్కా మార్చుకున్న ప్రదేశాన్ని బట్టి.. దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను గుర్తించామన్నారు.

"అర్ధరాత్రి ఒంటిగంటకు అత్యాచార ఘటన జరిగింది. టైమ్‌ అడిగి బాధితురాలి భర్తతో వివాదం పెట్టుకున్నారు. వాచీ లేదనడంతో ఆమె భర్తను కొట్టి రూ.750 లాక్కున్నారు. బాధితురాలిని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు. స్థానికుల సాయంతో ఆమె భర్త రేపల్లె పోలీసులను ఆశ్రయించారు. పోలీసు జాగిలం, ఇతర ఆధారాల ద్వారా నిందితులను గుర్తించాం. నిందితులపై సెక్షన్ 376(d), 394, 307, R/w 34 కింద కేసు నమోదు చేశాం. కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం." -ఎస్పీ వకుల్ జిందాల్

ఆ సెక్షన్లు పెట్టకుండానే ఎఫ్‌ఐఆర్‌

ఈనాడు, అమరావతి: ఎస్సీలపై అఘాయిత్యాలు జరిగితే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేస్తారు. రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఎస్సీ మహిళపై ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు అలా చేయలేదు. రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం నమోదు చేసిన క్రైమ్‌ నంబరు 123/2022లో ఐపీసీలోని 307, 376డీ, 394, 34 సెక్షన్లనే ప్రస్తావించారు. సామూహిక అత్యాచారం, దోపిడీ, హత్యాయత్నం తదితర అభియోగాలను మోపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లనూ వర్తింపజేస్తే కేసు తీవ్రత పెరగటంతోపాటు దోషులకు ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది.

అవసరమైతే ఆ సెక్షన్లూ జోడిస్తాం.. ఎస్పీ: ‘ముగ్గురు నిందితుల్లో ఇద్దరు ఎస్సీలే. అందుకే వారిపై అట్రాసిటీ కింద కేసు పెట్టలేదు. మరో నిందితుడు ఎస్సీ కాదు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసు పెడతాం’ అని బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్లు ఎందుకు వర్తింపజేయలేదని.. ‘ఈనాడు’ ప్రతినిధి ఫోన్‌లో ఆయనను వివరణ కోరగా...‘బాధితురాలు ఎస్సీ అని నిందితులకు తెలిసినప్పుడే అట్రాసిటీ నిరోధక చట్టం వర్తిస్తుంది. ఇక్కడ బాధితురాలి కులం నిందితులకు తెలియదు. కేసు దర్యాప్తు చేస్తున్నాం. అవసరమైతే ఆ చట్టం కింద సెక్షన్లూ జోడిస్తాం’ అని తెలిపారు.

ఏం జరిగిందంటే: నాలుగు నెలల గర్భిణి అయిన ఎస్సీ మహిళ.. భర్త, ముగ్గురు పసిబిడ్డలతో రైల్వే ఫ్లాట్‌ఫాంపై ఆదమరిచి నిద్రిస్తున్న వేళ.. కామాంధులు రెచ్చిపోయారు. భర్తతో కావాలని గొడవ పెట్టుకుని మరీ ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. భర్త, పిల్లలతో కలిసి ఉపాధి పనుల కోసం మరో ప్రాంతానికి వలస వెళ్తూ మార్గమధ్యలో రేపల్లె రైల్వేస్టేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆమెపై (25) భర్త కళ్లెదుటే ఈ పాశవిక చర్యకు పాల్పడ్డారు. ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడగా మరొకరు ఈ దారుణానికి సహకరించారు. తనను నిర్బంధించిన వ్యక్తి నుంచి తప్పించుకున్న భర్త అదే ప్లాట్‌ఫాంపై ఉన్న రైల్వే పోలీసు కార్యాలయం వద్దకు వెళ్లి ఎంతగా అరిచినా, అతని ఆక్రందన విని ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు.

నిస్సహాయ స్థితిలో ఆ భర్త రైల్వేస్టేషన్‌ బయటికి వెళ్లి కనిపించినవారినల్లా సాయం కోరినా ఎవరూ ముందుకు రాలేదు. ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లల్ని అక్కడే వదిలేసి ఓ బిడ్డను భుజాన ఎత్తుకుని ఆ అర్ధరాత్రి వేళ భార్యను రక్షించుకోవటానికి పరుగున పోలీసు స్టేషన్‌కు చేరుకున్న అతని దయనీయ స్థితి ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకునే వరకూ ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ హృదయవిదారకమైన ఘటన బాపట్ల జిల్లా రేపల్లె పోలీస్‌ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో, రేపల్లె రైల్వేస్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం చోటుచేసుకునేదే కాదు.

జుట్టు పట్టుకుని ప్లాట్‌ఫాంపై ఈడ్చుకెళ్లి..
కృష్ణా జిల్లా నాగాయలంకలో ఉపాధి పనుల నిమిత్తం బాధితురాలు.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి శనివారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి బయల్దేరారు. గుంటూరు, తెనాలి మీదుగా రేపల్లె రైల్వేస్టేషన్‌కు శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకున్నారు.అప్పుడు నాగాయలంక వెళ్లేందుకు బస్సులు లేకపోవటంతో బాధిత కుటుంబం రైల్వేస్టేషన్‌లోనే నిద్రించింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు యువకులు వారి వద్దకు వచ్చారు. బాధితురాలి భర్తను నిద్రలేపి టైం ఎంతయిందని అడిగారు. తన వద్ద వాచీ లేదని అతను సమాధానమివ్వటంతో.. ఆ ముగ్గురూ అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు. అతని వద్దనున్న రూ.750 లాక్కున్నారు. బాధితురాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిలో ఇద్దరు ఆమెను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మరొకరు ఆమె భర్తను నిర్బంధించారు. బాధితురాలిని ప్లాట్‌ఫాం చివరి వరకూ ఈడ్చుకుంటూ వెళ్లి భర్త కళ్లెదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. రైల్వేస్టేషన్‌లోనే ఈ ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఆమెను చిత్రహింసలు పెట్టారు.

గొంతెండిపోయేలా అరిచినా లేవని రైల్వే పోలీసులు
నిర్బంధం నుంచి తప్పించుకుని బాధితురాలి భర్త అదే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైల్వే పోలీసు కార్యాలయానికి పరిగెత్తారు. తన భార్యను కాపాడాలని తలుపులు కొట్టి గట్టిగా అరిచారు. కానీ లోపలున్న వారెవరూ నిద్ర నుంచి లేవలేదు. కామాంధుల చెర నుంచి భార్యను కాపాడాలంటూ రైల్వేస్టేషన్‌ బయట ఉన్న తోటి ప్రయాణికులను, రిక్షా కార్మికులను సాయం కోరినా ఎవరూ ముందుకు రాలేదు. దగ్గరలోనే పోలీసు స్టేషన్‌ ఉందని వారు చెప్పటంతో పరుగుపరుగున అక్కడికి వెళ్లి పోలీసుల సాయం కోరాడు. వారు వెంటనే అతనితోపాటు వాహనంలో రైల్వేస్టేషన్‌కు చేరుకోగా.. ఇద్దరు నిందితులు అప్పటికే పారిపోయారు. మరో నిందితుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ కనిపించాడు. పోలీసులు అతణ్ని, తర్వాత మిగిలిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఒంగోలు రిమ్స్‌కు తరలింపు: అత్యాచార బాధితురాలిని పోలీసులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్రత్యేక అంబులెన్స్, పోలీసు భద్రతతో సాయంత్రం ఒంగోలుకు తరలించారు. ఒంగోలు రిమ్స్‌కు వచ్చిన ఆర్డీవో, శిశుసంక్షేమశాఖ అధికారులు విచారణ చేపట్టారు. బాధితులను పరామర్శించేందుకు కొండపి ఎమ్మెల్యే, తెదేపా నేతలు యత్నించగా.. వారిని ప్రధాన గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు.

రేపల్లె ఘటన అత్యంత బాధాక‌రం: రేప‌ల్లెలో మ‌హిళ‌పై అత్యాచారం ఘటన అత్యంత బాధాక‌రమని.. మంత్రి రజని అన్నారు. ఘటనపై.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డేవ‌ర‌కు ప్రభుత్వం వ‌దిలిపెట్టదన్న మంత్రి.. ఇప్పటికే ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఘనటపై జిల్లా ఎస్పీ, ఆస్పత్రి అధికారుల‌తో మాట్లాడినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఘటన జరిగిన 5 నిమిషాల్లోనే పోలీసులు స్పందించారని మరో మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. అత్యాచార ఘటన బాధకరమన్న ఆయన..బాధితులకు ప్రభుత్వం రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసిందన్నారు. నిందితులను వదిలేది లేదని స్పష్టం చేసిన మంత్రి.. బాధితురాలికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

నిందితులను శిక్షించాలి: రేపల్లెలో జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైల్వేస్టేషన్‌లో మహిళల భద్రతకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బాధితురాలిని అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Harassment: 'నేను పోలీసు.. నీవు ఒంటరిదానివి'.. అదనపు కట్నం కోసం ఎస్సై వేధింపులు

Last Updated :May 2, 2022, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.