ETV Bharat / state

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన సాయం జమ

author img

By

Published : Aug 11, 2022, 9:53 AM IST

Updated : Aug 12, 2022, 3:50 AM IST

vidya deevena
జగనన్న విద్యా దీవెన

CM jagan: చదువుల కోసం ఏ ఒక్క కుటుంబం అప్పులపాలు కాకూడదన్నదే తమ అభిమతమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బాపట్లలో విద్యాదీవెనపథకం నిధులను ఆయన విడుదల చేశారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ విడతగా... 694 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు.

విద్యా దీవెన సాయం జమ

కళాశాలల్లో చేరే వారి సంఖ్యను గణనీయంగా పెంచటానికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు దోహదపడతాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జగనన్న విద్యాదీవెనకు సంబంధించి ఏప్రిల్‌, మే, జూన్‌ త్రైమాసికానికి ఫీజులు రూ.694 కోట్లను సీఎం గురువారం బాపట్లలో బటన్‌ నొక్కి తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడారు. ‘2018-19తో పోలిస్తే 2019-20లో కళాశాలల్లో చేరిన వారి సంఖ్య రాష్ట్రంలో 8.64 శాతం పెరగగా, జాతీయస్థాయిలో ఇది కేవలం 3.04 శాతమే. అమ్మాయిల విషయంలో రాష్ట్రంలో 11.03 శాతం వృద్ధి ఉండగా, దేశంలో కేవలం 2.28 శాతమే. బ్రిక్స్‌ దేశాల విద్యా ప్రమాణాలతోనూ పోటీ పడుతున్నాం. విద్యాలయాల ఫీజు రూ.30 వేలు, రూ.40 వేలు, రూ.లక్ష.. ఆపైన ఉన్నా మీరు వెళ్లి చదువుకోండి. మీ ఇంటిమనిషిగా తెలియజేస్తున్నా. కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అందరినీ చదివిస్తా. రేషన్‌ విధించి ఒక్కరికే ఇస్తామని చెప్పడం లేదు’ అని సీఎం వివరించారు. ‘ప్రాథమిక విద్య నుంచి పెద్ద చదువులను ప్రోత్సహిస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం. గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లను మన పిల్లల భవిష్యత్తు కోసం చెల్లించాం. ఈ మూడేళ్లలో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు రూ.11,715 కోట్లు ఖర్చు చేశాం. పిల్లలను చదివించుకునే కార్యక్రమంలో అక్కాచెల్లెమ్మల కుటుంబాలు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. చదువు హక్కుగా మారాలి. వారి బతుకులు మారాలనే ఉద్దేశంతో ఈ మూడేళ్లలో ఒక్క విద్యారంగంపైనే రూ.53వేల కోట్ల పైచిలుకు వెచ్చించాం. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుని 1.60 లక్షల మందికి శిక్షణతోపాటు ధ్రువపత్రాలు ఇప్పిస్తున్నాం’ అని సీఎం వివరించారు.

గిట్టని వాళ్లు హేళన చేస్తున్నా..: ‘అమ్మఒడి పథకాన్ని హేళన చేస్తూ గిట్టనివారు మాట్లాడుతున్నారు. అక్కాచెల్లెమ్మలకు ఉదారంగా ఇచ్చేస్తున్నాడని అంటున్నారు. జగన్‌ మాదిరి పాలిస్తే రాష్ట్రం శ్రీలంక మాదిరి అవుతుందని వెటకారంగా మాట్లాడుతున్నారు. 2018లో కేంద్రం ప్రాథమిక విద్య గణాంకాలను విడుదల చేసింది. అందులో దేశం సరాసరి జీఈఆర్‌ 99 శాతముంటే రాష్ట్రంలో 84.48 శాతముంది. శ్రీలంక అవుతుందన్న పెద్ద మనుషులకు తెలియజేస్తున్నా. మీరంతా ఒక్కటి ఆలోచించండి. అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. గత పాలనలో అప్పుల వృద్ధి రేటు 19శాతం కాగా, ఇప్పుడు 15 శాతం. గతంలో వారెందుకు చేయలేకపోయారు? నలుగురి కోసం దోచుకో. పంచుకో.. తినుకో (డీపీటీ) పథకం వారు తెచ్చారు. ప్రస్తుత పారదర్శక పాలన వీరికి కడుపుమంట పుట్టిస్తోంది’ అని విమర్శించారు. సీఎం ముందుగా కొంతమంది విద్యార్థులు, వారి తల్లులతో మాట్లాడారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పలువురు మహిళలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో దారి పొడవునా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను నిల్చోబెట్టారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 12, 2022, 3:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.