ETV Bharat / state

ముగిసిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. మూడు బిల్లులకు ఆమోద ముద్ర

author img

By

Published : Feb 13, 2023, 11:17 AM IST

telangana
telangana

Telangana Budget Sessions 2023-24: తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు 12వ తేదీన (ఆదివారం) ముగిశాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే నిర్దేశిత ఎజెండా మొత్తం పూర్తయ్యింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ఆమోదం పొందడంతో పాటు మరో మూడు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. తొలిసారిగా ఫిబ్రవరి రెండో వారంలోనే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.

Telangana Budget Sessions 2023-24: తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు స్వల్ప కాలంలోనే పూర్తయ్యాయి. రాజ్‌భవన్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదంతో ప్రారంభమైన.. ఆ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు సాఫీగా ముగిశాయి. ఈ నెల మూడో తేదీన గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఉభయ సభల సమావేశాలు.. నిన్నటితో ముగిశాయి. కేవలం 8 పని దినాల్లోనే ఎజెండా మొత్తాన్ని పూర్తి చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం, 2023-24 బడ్జెట్, సాధారణ చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ప్రక్రియలు పూర్తయ్యాయి.

56.25 గంటలు సాగిన సమావేశాలు: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు తొలిసారిగా ముఖ్యమంత్రి కాకుండా ఆయన తరఫున మంత్రి కేటీఆర్​ సమాధానం ఇచ్చారు. రోజుకు 12, 13 చొప్పున మూడు రోజుల్లో 37 డిమాండ్లపై శాసనసభలో చర్చ పూర్తి చేశారు. ఇందుకోసం దాదాపు అర్ధరాత్రి వరకు సభను నడిపారు. అటు శాసన మండలి సమావేశాలు 5 రోజుల పాటు జరిగాయి. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్​ ఈ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడు రోజుల్లో అసెంబ్లీ 56 గంటల 25 నిమిషాల పాటు, ఐదు రోజుల్లో మండలి 15 గంటల పాటు సమావేశమయ్యాయి. రెండు సభల్లోనూ ఈ దఫా ఒక్క నిమిషం కూడా సమయం వృథా కాలేదని శాసనసభ సచివాలయం తెలిపింది.

ఐదు బిల్లులకు ఆమోదం: ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించిన రెండు బిల్లులతో పాటు మరో మూడు బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయ, పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణల బిల్లులకు ఆమోదం తెలిపాయి. గవర్నర్ వద్ద ఇప్పటికే ఏడు బిల్లులు పెండింగ్​లో ఉండగా.. మరో ఐదు బిల్లులు రాజ్‌భవన్ వెళ్లనున్నాయి. సాధారణంగా బడ్జెట్ సమావేశాల చివరి రోజు ప్రవేశపెట్టే కాగ్ నివేదికలను ఈ మారు ఉభయసభల ముందు ఉంచలేదు. సాధారణంగా మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు పూర్తవుతుంటాయి. కానీ.. ఈ సారి ఫిబ్రవరి రెండో వారంలోనే ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2019లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టారు. ఈ దఫా ఫిబ్రవరిలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏదేమైనప్పటికీ ఈసారి తొలిసారిగా ఫిబ్రవరి రెండో వారంలోనే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.