ETV Bharat / state

'ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాంగా.. అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా'

author img

By

Published : May 30, 2022, 5:32 AM IST

ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే మొత్తంపై.. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఒక లెక్క, మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో లెక్క చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన వైకాపా సామాజిక న్యాయభేరి సభలో జరిగిందీ వింత..! ఇక.. ఇక్కడ కూడా సభ ప్రారంభానికి ముందే సగం జనం వెళ్లిపోగా మంత్రులు ప్రసంగిస్తుండగా ప్రాంగణంలో 25 శాతంమంది మిగిలారు.

'ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాంగా.. అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా'
'ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాంగా.. అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా'

'ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాంగా.. అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా'

"ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూ కూడా అన్ని అవసరాలూ తీర్చాలంటే ఎలా" అని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఆదివారం "సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర" నంద్యాలలో ప్రారంభమై కర్నూలు, గుత్తి, పామిడి మీదుగా అనంతపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన వివిధ సభల్లో పలువురు మంత్రులు మాట్లాడారు.

బస్సు యాత్ర ముగింపు సందర్భంగా అనంతపురంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో మంత్రి ధర్మాన ప్రసంగించారు. "రాష్ట్రంలో బడుగుల అభ్యున్నతికి గొప్ప పనులు జరిగాయి. అయినా అక్కడక్కడా కొన్ని పనులు జరగలేదని వ్యాఖ్యానించవద్దు. ఎందుకు జరుగుతాయి ? మన అవసరాల కోసం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తూ ఉంటే.. అన్ని అవసరాలు తీర్చడానికి మరికొంత సమయం పడుతుంది. గడిచిన 75 సంవత్సరాల్లో వీటిని తీర్చి ఉంటే అవి ఇప్పుడు ఉండేవి కావు కదా ? మా ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యమిస్తోంది. అందుకే కొన్ని పనులు ఆలస్యమవుతాయి. బడుగులు గౌరవంగా బతికే స్థాయికి ఎదిగిన తర్వాత వాటిని వచ్చే కాలంలో చేద్దాం. తొందరేమీ లేదు." అని ధర్మాన పేర్కొన్నారు. గతంలో జగన్‌ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే అసలు ప్రజా ఉద్యమాలు వచ్చేవే కాదన్నారు. ఈ క్రమంలో సంక్షేమ కార్యక్రమాలకు లక్షా 48 వేలకోట్లు వ్యయం చేస‌్తున్నామంటూ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పుకొస్తే.. లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ధర్మాన ప్రసాదరావు సెలవిచ్చారు.

మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ ప్రసంగిస్తూ.. మహానాడులో ఓ నాయకురాలు తొడకొట్టారని, జనాలు త్వరలోనే ఓటు ద్వారా కొట్టి చంద్రబాబుకు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. "జగన్‌ది రామరాజ్యమని.. చంద్రబాబుది రాక్షస పాలన"అని పేర్కొన్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బడుగులకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని ప్రాంతాల ప్రజలు తమను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కోరుతున్నారని చెప్పారు.

కర్నూలులో జరిగిన సభలో ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం షెడ్యూలు కులాల్లో ఒక్కరికే మంత్రి పదవి ఇస్తే.. వైకాపా ప్రభుత్వంలో 4 పదవులిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ది అని పేర్కొన్నారు. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రసంగిస్తూ.. "చంద్రబాబు.. మీ పని అయిపోయింది. 2019లో 23 సీట్లు వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో మూడే వస్తాయి" అని పేర్కొన్నారు. నంద్యాలలో మంత్రి అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో తెదేపా ఓట్ల కోసం ఫరూక్‌కు మంత్రి పదవి ఇచ్చిందని, లేదంటే మైనారిటీలకు చోటే లేదని విమర్శించారు. ఆయా సభల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, విడదల రజిని, జోగి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

త్వరలో జైలుకు అచ్చెన్నాయుడు: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరంలో శనివారం అర్ధరాత్రి జరిగిన బస్సు యాత్రలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ... కార్మికుల ప్రాణాలంటే లెక్క లేకుండా వారికి రావాల్సిన మందులు, ఆరోగ్య పరికరాల్లో అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు త్వరలో జైలుకు వెళ్లి ఊచలు లెక్క పెట్టనున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందని, తాను హోమంత్రి పదవి చేపట్టి వైకాపా నాయకుల భరతం పడతానని అచ్చెన్నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

పాలిసెట్‌ విద్యార్థుల ‘నడక’యాతన: సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర సందర్భంగా పాలిసెట్‌ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సభను ఆదివారం నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో నిర్వహించారు. పట్టణంలోకి బస్సులు రాకుండా కట్టడి చేశారు. కీలకమైన దారులన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు. ఆత్మకూరు నుంచి వచ్చే బస్సులు పట్టణం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. కొందరు విద్యార్థులు ఆత్మకూరు బస్టాండులో దిగి ఒకటిన్నర కిలోమీటరు నడిచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి వచ్చింది. "నా కుమార్తెను పాలిసెట్‌ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు నంద్యాల పట్టణానికి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చాను. ఉదయం నుంచి అరగంట సేపు తిరిగాను. ఏ దారిలో వెళ్లినా అడ్డుగా బారికేడ్లు పెట్టారు. ఎటు వెళ్లినా పోలీసులు అడ్డుకున్నారు." అని బండి ఆత్మకూరు మండలానికి చెందిన బాషా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వెలవెలబోయిన సభలు: సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు సంబంధించి ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభలు వెలవెలబోయాయి. నంద్యాల, కర్నూలు సభల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. దాంతో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, గుమ్మనూరు జయరాం.. ఇద్దరు మంత్రులు పది నిమిషాల్లో ప్రసంగాలను ముగించేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన ముగింపు సభకు పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలను తరలించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల నుంచి ద్వాక్రా, మెప్మా సభ్యులను తరలించారు. ఉదయం 11 గంటలకు మినీ బస్సులు, ఆటోల్లో మహిళలను సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. మంత్రులు సాయంత్రం 4:30 రావాల్సి ఉండగా.. గంటసేపు ఆలస్యంగా సభాస్థలికి చేరుకున్నారు. అప్పటికే ఎండలో అవస్థలు పడిన మహిళలు మంత్రులు సభకు రాకముందే గుంపులుగా లేచి వెళ్లిపోయారు. మంత్రుల ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికి వేదిక ముందు ఉన్న 4 గ్యాలరీలు తప్ప మిగిలిన ప్రాంతం మొత్తం ఖాళీ అయింది. మంత్రి అంజాద్‌బాషా ప్రసంగం ప్రారంభించే సమయానికి డ్వాక్రా మహిళలందరూ సభ ప్రాంగణాన్ని వీడారు.

ఇవీ చూడండి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.