ETV Bharat / state

ఫిర్యాదులకు 'స్పందన' కరవు.. నిరాశలో బాధితులు

author img

By

Published : Nov 22, 2022, 7:31 PM IST

NO RESPONCE IN SPANDANA PROGRAM
NO RESPONCE IN SPANDANA PROGRAM

NO RESPONCE IN SPANDANA PROGRAM : ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. భూ వివాదం, ఇంటి సమస్య, దారి సమస్య, భూ సర్వే ఫిర్యాదు.. ఇలా చాలా మంది పరిష్కారం కోసం స్పందన మెట్లు ఎక్కుతున్నారు. తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతున్నాయే గానీ.. సమస్య పరిష్కరం కావడం లేదు.. పదుల సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. సమస్య తీరటం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

NO RESPONCE IN SPANDANA : ప్రతి సోమవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించే స్పందనకు అధికారుల నుంచి స్పందన కరవైంది. జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్‌కు చెబితే సమస్య పరిష్కారం అవుతుందనే గంపెడాశతో వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతోంది. స్పందనలో ఫిర్యాదులను పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత శాఖాధికారులకు, మండల స్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నారు. అయితే ఆదేశాలు అమలు చేస్తున్నారా లేదా ‌అని పరిశీలించే వ్యవస్థ లేకపోవడంతో.. బాధితులు పలు మార్లు స్పందన చుట్టూ తిరగడం తప్పడం లేదు.

ఒకే సమస్యపై ఏళ్ల తరబడి స్పందనలో.. పదుల సార్లు ఫిర్యాదులు చేస్తున్నవారు కొందరైతే, నెలల తరబడి తిరుగుతున్న బాధితులు అనేకమంది ఉన్నారు. స్పందనకు వస్తున్న బాధితులను ఎవరిని కదిలించినా.. తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఫిర్యాదు చేస్తున్న సమస్యలను పరిష్కరించినట్లు అధికారులు ఆన్‌లైన్​లో చూపిస్తున్నారు. మరోవైపు సగానికి పైగా అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా దాటవేస్తున్నారని.. మరికొంత మంది వాపోతున్నారు. కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులు జారీ చేసే అదేశాలు.. క్షేత్ర స్థాయిలో పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

"ఎనిమిది సార్లు ఆర్డీవోకి, నాలుగు సార్లు కలెక్టర్​కి ఫిర్యాదు ఇచ్చాను. స్పందనలో సమస్యల పరిష్కారం జిల్లా ఆఫీసులో 100 శాతం సఫలం అవుతుంది కానీ, మండలాల్లో మాత్రం విఫలం అవుతుంది. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కేవలం స్వీకరిస్తున్నారే కానీ దానిని పరిష్కరించడం లేదు. కేవలం కాగితాల్లోనే ఫిర్యాదులు తీసుకుంటున్నారు కానీ దానిని ఆచరణలో పెట్టటం లేదు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి మా వినతులు స్వీకరించి న్యాయం చేయాలని కోరుతున్నాం" -బాధితులు

స్పందనతో ఎలాంటి పరిష్కారం దొరకటం లేదని ఆవేదన చెందుతున్న బాధితులు.. ఇక చేసేదిలేక ఫిర్యాదు చేసేందుకు రావడం మానేస్తున్నారు. అధికారులు మాత్రం సమస్యలు పరిష్కరిస్తున్నందునే ఫిర్యాదుదారులు తగ్గుతున్నట్లు చెప్పుకొస్తున్నారు.

స్పందనలో "స్పందన" కరవు.. ఫిర్యాదు చేసేందుకు రావటం మానేస్తున్న ప్రజలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.