ETV Bharat / state

దిల్లీ గణతంత్ర వేడుకల్లో లేపాక్షి శకటానికి చోటు.. నాటి వైభవానికి గుర్తింపు

author img

By

Published : Jan 24, 2021, 1:22 PM IST

Updated : Jan 24, 2021, 5:16 PM IST

Lepakshi
Lepakshi

విజయనగర రాజుల ప్రముఖ వాణిజ్య కేంద్రంగా.. చిత్ర, శిల్పకళా సౌందర్యానికి కాణాచిగా.. లేపాక్షి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈనెల 26న దిల్లీ రాజ్‌పథ్‌ వేదికగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మరోమారు విశ్వవ్యాప్తం కానుంది. మన రాష్ట్రం తరఫున ‘లేపాక్షి’ శకటాన్ని పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో లేపాక్షి ఆలయ చరిత్రపై ప్రత్యేక కథనం.

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయలు ఆస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపణ్ణ, వీరన్న అనే అన్నదమ్ములు 1522-1538 వరకు 16సంవత్సరాల పాటు నిర్మించారు. ఆలయం మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ఉన్న కొండపై పునాది లేకుండానే నిర్మించడం విశేషం. ఈ ఆలయం కట్టక ముందే ఇక్కడ సీతాదేవి మోపిన పాదం, రాముడు, ఆంజనేయుడు, చోళరాజు, అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన లింగాలతోపాటు వీరభద్రుడు స్వయంభువుగా వెలసిన లింగం ఉంది. ఇలా ఇక్కడ ఐదు లింగాలు, సీతమ్మపాదం ఒకేచోట ఉండటం చూసిన విరూపణ్ణ అచ్యుతదేవరాయలు అనుమతితో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఆలయం మొత్తం ఏడు ప్రాకారాల్లో నిర్మించగా, ప్రస్తుతం మూడు ప్రాకారాలు మాత్రమే కనబడతాయి.

దిల్లీ వీధుల్లో లేపాక్షి ఖ్యాతి..

ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దిల్లీలో నిర్వహించే పరేడ్‌లో లేపాక్షి శకటాన్ని ప్రదర్శించనున్నారు. విజయనగరరాజుల కాలంలో నిర్మించిన ఆలయం ప్రాభవాన్ని దిల్లీలో చాటనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి నంది విగ్రహం శకటానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆలయ అద్భుత నిర్మాణశైలి, ముఖ మంటపం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మంటప నమూనాను ప్రదర్శించనున్నారు. రాతితో చెక్కిన పెద్ద వినాయకుడు, ఏడుశిరస్సుల నాగేంద్రుని ప్రతిమ శకటంలో ఆకర్షణగా నిలవనుంది. దక్ష యజ్ఞంలో వీరభద్రుడి ఉగ్రరూపాన్ని చాటేలా శకటం ముందుకు సాగే సమయంలో వీరశైవుల సంప్రదాయ కళారూపం వీరగాసే నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు.

లేపాక్షి ఉత్సవాలతో వెలుగులోకి..

ఎంతో ఘన చరిత్ర కలిగిన లేపాక్షి ఆలయ ఘనకీర్తి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలతో విశ్వవ్యాప్తమైంది. మొదట 2012లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉత్సవాలు నిర్వహించగా, తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృత్వంలో రెండుసార్లు ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించి లేపాక్షికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

ప్రపంచంలోనే పెద్ద ఏకశిలా నంది..

విజయనగర రాజుల కాలంలో లేపాక్షిలో చెక్కిన ఏకశిలా రాతి నంది విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ నంది విగ్రహం 27అడుగుల పొడవు, 18అడుగుల వెడల్పు ఉంది. ఇది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం తంజావూరు, మైసూరు చాముండి హిల్స్‌, బెంగళూరు నంది విగ్రహాలు ఉన్నాయి.

నిర్మాణాలు.. శిల్పుల నైపుణ్యానికి తార్కాణాలు

lepakshi tableau in republic day parade
శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం ఏడుశిరస్సుల నాగేంద్రుడు

ఆలయంలోని నాట్యమంటపం, లతామంటపం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మంటపం, వేలాడే స్తంభం, ఏడుశిరస్సుల నాగేంద్రుడు, సీతమ్మ పాదం ఎటుచూసిన మనవైపే చూసే శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం ఇలా ఎన్నో చారిత్రక నేపథ్యమున్న ఇతిహాసాలు నాటి శిల్పుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఆలయంలో మొత్తం 876 స్తంభాలు ఉండగా ఒక్కో స్తంభం ఒక్కో చరిత్రను ప్రస్పుటించేలా శిల్పులు చెక్కారు. ఆలయం గర్భగుడి పైకప్పుపై సహజ రంగులతో 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో గీచిన వీరభద్రస్వామి తైలవర్ణచిత్రం ఆసియాలోనే అతి పెద్ద చిత్రంగా ప్రఖ్యాతి చెందింది. ఆలయంలో వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లు ప్రధాన దేవతలు.

ఇదీ చదవండి:

గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరం

Last Updated :Jan 24, 2021, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.