ETV Bharat / state

Protest: అధికారుల తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన.. రాత్రంతా కార్యాలయంలోనే బస

author img

By

Published : Aug 3, 2021, 9:35 AM IST

jc prabhakar reddy protest at tadipatri municipal office
మున్సిపల్‌ సిబ్బందికి ఒంగి నమస్కరిస్తున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి

మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో అధికారులు, సిబ్బందితో తాను సమావేశం ఏర్పాటు చేస్తే మూకుమ్మడిగా అంతా గైర్హాజరు కావడంపై.. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలోనే రాత్రంతా బస చేసి నిరసన తెలిపారు.

మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో అధికారులు, సిబ్బందితో తాను సమావేశం ఏర్పాటు చేస్తే మూకుమ్మడిగా అంతా గైర్హాజరు కావడంపై.. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సిబ్బందితో సమీక్షా సమావేశం ఉంటుందని కమిషనర్‌తో సహా అందరికీ శనివారమే ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలపడం, అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్‌ సిబ్బందితో కలిసి కరోనా వైరస్‌ మూడో దశపై అవగాహన ర్యాలీ, సమీక్షా సమావేశం నిర్వహించడంతో అధికారులకు సందిగ్ధ పరిస్థితి ఎదురైంది. ర్యాలీ అనంతరం కార్యాలయానికి వస్తారనే ఉద్దేశంతో 12.30 గంటలకు ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కమిషనర్‌ ఛాంబర్‌లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేతో సమీక్ష ముగిసిన అనంతరం అటు నుంచి అటే ఇళ్లకు వెళ్లిపోవడం, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళుతూ ఇతరులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలియడంతో ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్యాలయానికి వచ్చే వరకు కదిలేది లేదని కార్యాలయంలోనే భీష్మించుకు కూర్చున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కొందరు అధికారులు రాగానే వారి నిబద్ధతను మెచ్చుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రదర్శించిన హావాభావాలకు అధికారులు సమాధానం చెప్పలేని స్థితిలో పడిపోయారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా కమిషనర్‌ సెలవుపై ఎలా వెళతారని, ఛైర్మన్‌ ఆదేశాలను కాదని సిబ్బంది ఎలా గైర్హాజరవుతారని ప్రశ్నిస్తూ.. 26 మందికి తాఖీదులు జారీ చేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. కమిషనర్‌ వచ్చేదాకా రాత్రి కూడా కార్యాలయంలోనే బస ఏర్పాటు చేసుకుంటామని ఛైర్మన్‌ పేర్కొనడంతో పరిస్థితి రసవత్తరంగా మారింది. ఆ మేరకు ఆయన రాత్రి అక్కడే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.

పురపాలిక సిబ్బంది కనిపించడం లేదని ఫిర్యాదు

తాడిపత్రి పురపాలిక కార్యాలయ సిబ్బంది 26 మంది కనిపించడం లేదంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. సోమవారం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలిక కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డితో పాటు పురపాలిక ఉద్యోగి చాంద్‌బాషాకు శనివారం సమాచారం ఇచ్చాం. పురపాలిక వాట్సాప్‌ గ్రూప్‌లో సందేశాన్ని పంపాము. సోమవారం ఉదయం సమావేశ సమయానికి వచ్చి చూడగా 26 మంది ముఖ్యమైన అధికారులతో పాటు సిబ్బంది విధుల్లో కనిపించలేదు. హాజరు పట్టికలో వారి సంతకాలు లేవు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కమిషనర్‌ సెలవులో ఉన్నారని, ఆయన స్థానంలో రాజేశ్వరిబాయి ఇన్‌ఛార్జిగా ఉంటారనే సమాచారం వచ్చింది. ఇటీవల పురపాలిక అధికారులు టెంకాయలు విక్రయించే వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో పురపాలిక అధికారులకు, ఉద్యోగులకు ఎవరైనా హాని తలపెట్టి ఉంటారేమోనని ఆందోళన చెందుతున్నాం. వారి ఆచూకీ కనుగొని రక్షించాలని జేసీ ప్రభాకరరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్‌ చేయండి: హోంశాఖకు ఏపీ లేఖ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.