ETV Bharat / state

జిల్లాలో కరోనా విజృంభణ... కంటైన్మెంట్‌ వ్యూహం అమలుకు సన్నాహాలు

author img

By

Published : Jun 29, 2020, 5:56 AM IST

Updated : Jun 29, 2020, 6:02 AM IST

కరోనా కేసులు అధికంగా పెరుగుతోన్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు అనంతపురం జిల్లా యంత్రాంగం కంటైన్మెంట్‌ వ్యూహాన్ని అమలుచేయనుంది. కేసులు తగ్గించేందుకు కంటైన్మెంట్‌ అమలు, నిర్దిష్ట స్థాయిలో పరీక్షల నిర్వహణ విధానాలను చేపట్టడంతో పాటు... వైరస్‌ బాధితులకు చికిత్స అందించే విధానంలోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. మొత్తం 25 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి... ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో నోడల్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది

covid virus ananthapuram
జిల్లాలో పెరుగుతున్న కేసులు... కంటైన్మెంట్‌ వ్యూహం అమలుకు సన్నాహాలు

అనంతపురం జిల్లాలో కొవిడ్‌ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ప్రత్యేకించి లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇచ్చిన నాటి నుంచి వైరస్‌ వ్యాప్తి మరీ ఎక్కువైంది. మార్చి 29 నుంచి కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత నుంచి వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందులోనూ గత 9 రోజుల్లో నమోదైన 679 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే సుమారు 48శాతం మందికి వైరస్‌ సోకింది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,371గా ఉంది. ఇందులో 662మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా... 702 మంది డిశ్చార్జి అయ్యారు. రానున్న రోజుల్లో మరింత విజృంభించే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు... వైరస్‌ కట్టడికి ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనిపై జిల్లా నోడల్‌ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్‌ గంధం చంద్రుడు... కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా కంటైన్మెంట్‌ అమలు, నమూనాలు సేకరణతో పాటు పరీక్షల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.

ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో నోడల్‌ బృందం...

జిల్లాలో అనంతపురం, హిందూపురం పట్టణాల్లో 80 శాతం మేర కేసులు నమోదయ్యాయి. అంటే 80 శాతం కేసుల్లో అనంతపురం రూరల్‌, అర్బన్‌ తర్వాత ధర్మవరం, యాకిడి ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. కేసులు ఎక్కువగా వస్తున్న 25 ప్రాంతాలను గుర్తించి అక్కడ కంటైన్మెంట్‌ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ 25 ప్రాంతాల్లో ఆంక్షలను పక్కాగా అమలు చేసేందుకు ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో నోడల్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో నోడల్‌ అధికారితో పాటు వైద్య, పోలీస్, మునిసిపల్‌ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. కేసులు పెరుగుతోన్న ప్రాంతాల్లో ప్రజల కదలికలపై పూర్తిస్థాయి ఆంక్షల అమలుతో పాటు... నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఇంటింటి సర్వే చేసి శాంపిల్స్‌ సేకరణ, హైరిస్క్‌ ఉన్న ప్రాంతాల్లో, జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో శాంపుల్‌ కలెక్షన్స్ చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు.

బహుముఖ వ్యూహాంతో వైరస్‌ కట్టడికి జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఇతర జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లాలో ఆసుపత్రుల సామర్థ్యం, మౌలిక వసతుల కల్పన, సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఆసుపత్రులకు వెళ్లకుండానే రోగులకు చికిత్స అందించేందుకు ప్రాధాన్యతనిచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు.

ఇవీ చూడండి-కలహాల కాపురం.. తీసింది ముగ్గురి ప్రాణం

Last Updated : Jun 29, 2020, 6:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.