ETV Bharat / state

DRC meeting: రసాభాసగా అనంతపురం డీఆర్సీ సమావేశం

author img

By

Published : Aug 11, 2021, 10:34 PM IST

అనంతపురంలో నిర్వహించిన డీఆర్సీ సమావేశం(ananthapuram DRC meeting)లో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ బీమా విధానం ద్వారా రైతులకు మేలు జరగడం లేదని, దిగుబడి ఆధారంగా పరిహారం ఇచ్చే పద్దతిని తీసుకురావాలని మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa sathyanarayana)ను కోరారు. ఖరీఫ్ విస్తీర్ణం విషయంలో వ్యవసాయశాఖ అధికారులు కాకిలెక్కలు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రసాభాసాగా అనంతపురం డీఆర్సీ సమావేశం
రసాభాసాగా అనంతపురం డీఆర్సీ సమావేశం

అనంతపురం జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించారు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ... లక్ష హెక్టార్లకు పైగా భూమిలో ఎందుకు విత్తనాలు వేయలేదో చెప్పాలని వ్యవసాయ అధికారులను తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి జోక్యం చేసుకుంటూ వ్యవసాయశాఖ అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాతావరణ బీమా నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దిగుబడి ఆధారిత బీమా అమలుకు సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు.

హెచ్చెల్సీ, హంద్రీనీవా కాలువల ద్వారా నీరు విడుదల చేసినప్పటికీ... చెరువులకు అందిస్తున్న నీటిపై లెక్కలు లేవని ఎమ్మెల్యేలు తెలిపారు. మడకశిర, ఉరవకొండ నియోజకవర్గాల్లో తాగునీటికి తీవ్ర సమస్య ఉందని అక్కడి ఎమ్మెల్యేలు అధికారుల తీరును బహిర్గతం చేశారు. శ్రీరాంరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకాల కార్మికుల 20 రోజుల సమ్మెతో తాగునీరు నిలిచిపోయినా పట్టించుకోలేదని మంత్రిని నిలదీశారు. గ్రామ సచివాలయాలకు నిర్వహణ నిధిని కేటాయించాలని కోరారు. అదనంగా ఉన్న వాలంటీర్లను, తక్కువ వాలంటీర్లు ఉన్న ప్రాంతాల్లో నియమించాలని మంత్రికి వివరించారు. ఎమ్మెల్యేల ఫిర్యాదులపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. వారం రోజుల్లో ఇసుక కొరతకు పరిష్కారం చూపుతామన్నారు. ప్రతి పట్టణానికి సమీపంలో ఇసుక డిపోలు ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.

ఇదీచదవండి.

TDP: వైకాపా ప్రభుత్వం వైఖరిపై తెదేపా నేతల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.