ETV Bharat / state

ఎన్నాళ్లీ డోలీ మోతలు.. అడవి బిడ్డల గోడు నాయకులకు పట్టదా

author img

By

Published : Feb 22, 2023, 4:44 PM IST

Anakapalli District: ఆధునీకతతో ప్రపంచం దోసుకుపోతున్నప్పటికీ.. ఆదివాసీలు గిరిజనుల జీవన విధానంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అనేక దుర్భర పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నప్పటికీ.. తాగునీరు, విద్య, వైద్యం లాంటి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేకపోతున్నారు. ఫలితంగా అనేక ఇబ్బందులతో తమ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిస్థితులే అందుకు నిదర్శనం.

Anakapalli District
Anakapalli District

ఎన్నాళ్లీ డోలీ మోతలు.. అడవి బిడ్డల గోడు నాయకులకు పట్టడం లేదా..!

Anakapalli District: రోజులు మారుతున్నాయి.. ఆధునికత పెరుగుతోంది.. ఎన్నో రంగాల్లో గ్రామీణ ప్రాంతాలు సైతం దూసుకుపోతున్నాయి. అయినప్పటికీ ఆదివాసీలు, గిరిజన ప్రాంతాల పురోగతిలో మాత్రం పాలకుల మాటలు నీటి మూటలే అవుతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని రోలుగుంట మండలంలో పాలు గిరిజన గ్రామాలకు నేటికీ రహదారి సదుపాయం లేక అక్కడి గిరిజనులు అనేక రకాల అవస్థలు పడుతున్నారు. కనీస రోడ్డు సదుపాయం ఉంటే విద్య, వైద్యం, తాగునీటి వంటి మౌలిక వసతులు అందుతాయని ఆ గిరిజన వాసులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు.

మన్యం ప్రాంతాల్లో తరతరాలుగా గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. అలాంటి పరిస్థితుల్లో.. తీరని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పెద్ద గరువు గ్రామానికి చెందిన ఓ మహిళకు.. గర్భశోకమే మిగిలింది. అప్పుడే పుట్టిన చిన్నారి, బాలింతకు సకాలంలో వైద్యం అందలేదు. దీంతో చిన్నారి మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలోని రావికమతం, రోలుగుంట మండలాల్లోని గిరిజనుల జీవితాల్లో ఇలాంటి విషాదాలు నిత్యకృత్యంగా మారాయి. కొద్దిరోజుల క్రితమే రావికమతం మండలానికి చెందిన పిల్లలు గుర్రాలపై పాఠశాలకు వెళ్లడం అందరినీ కలచివేసింది. రహదారి ఏర్పాటు చేస్తామన్న నాయకులు హామీలు నెరవేరడం లేదని.. గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నాళ్లీ డోలీ మోతలు..?: కిల్లో కమల అనే గర్భిణి నిన్న ఉదయం పండంటి పసిపాపకు జన్మనిచ్చింది. వీరంతా ఆదివాసులు గిరిజనులు కావడంతో మైదాన ప్రాంతాలకు దూరంగా కొండలు గుట్టల్లో జీవనం సాగిస్తున్నారు. కమల జన్మనిచ్చిన పసిపాప ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో సుమారు మూడున్నర కిలోమీటర్ల నడిచి.. అతికష్టం మీద వైద్య కేంద్రానికి చిన్నారిని, బాలింతను ఆమె బంధువులు డోలీపైనే తరలించారు. అయితే ఉదయం ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికి పసికందు కన్నుమూసింది. సకాలంలో సరైన వైద్యం అందకే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క నాయకులు ఇచ్చిన హామీలు నీటి మూటలే అవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.

అల్లూరి జిల్లాలోనూ..: మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందక కడుపులో బిడ్డ అడ్డం తిరిగి మృతి చెందింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తీగల వలస పంచాయతీ కొండలలో భాను అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అంబులెన్స్​కు ఫోన్ చేయగా.. 'అందుబాటులో లేదు.. వేచి ఉంటే పంపిస్తాం' అని సమాధానం వచ్చింది. వాహనం ఎంతకీ రాకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆటోలో హుకుంపేట తరలించగా ఆసుపత్రిలో మృత శిశువు డెలివరీ అయింది. అంబులెన్స్ సకాలంలో రాకపోవడం వలన ఇటువంటి ఘటన జరిగిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.