ETV Bharat / state

కాంగ్రెస్​లో విభేదాల తంటా.. బీజేపీకి కలిసొచ్చెనంటా..!

author img

By

Published : Dec 20, 2022, 11:31 AM IST

BJP Operation Akarsh on Congress leaders
BJP Operation Akarsh on Congress leaders

BJP Operation Akarsh on Congress leaders: కాంగ్రెస్‌ పార్టీ నేతల వివాదంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జరుగుతున్న పరిణామాలను అనుకూలంగా మార్చుకునే పనిలో కమల దళం తలమునకలైంది. హస్తం పార్టీలో సీనియర్లు వర్సెస్ రేవంత్ వర్గంలో రేగిన చిచ్చుతో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది. చేరికల వ్యవహారం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వద్దకు చేరింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు తాము బీజేపీలో చేరుతామని కాషాయపార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో ఇప్పటికే మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం.

BJP Operation Akarsh on Congress leaders: కాంగ్రెస్ అసంతృప్త నేతలతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రహస్యంగా భేటీ అయి ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చర్చలు సఫలమైతే బీజేపీలో చేరబోయే కాంగ్రెస్ నేతలను వెంటనే పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని కాషాయ పార్టీ చూస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీనం చేస్తే బీఆర్​ఎస్​ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపించాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడంపై దృష్టిసారిస్తున్న భాజపా రాష్ట్ర నాయకత్వం.. హస్తం పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు అప్పగించింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలతో బీజేపీ సీనియర్ నాయకురాలు ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసిన కాషాయదళానికి కాంగ్రెస్ అంతర్గత కలహాలు అస్త్రంగా మారాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని నిజం చేస్తూ కమలనాథులు చేరికలపై యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గమంతా ఇప్పటికే ఏకతాటిపైకి వచ్చింది. తిరుగుబాటుకు సిద్ధమైన 9 మంది నేతల్లో పలువురు బీజేపీ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంతనాలు జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ మంతనాలు ఎంత వరకు ఫలిస్తాయి: మరో ఇద్దరు నేతలతో పార్టీ సీనియర్ నాయకురాలు సైతం చర్చలు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లంతా బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి బీజేపీ నేతలు చేపడుతున్న మంతనాలు కొలిక్కి వస్తే చేరికలు లాంఛనంగా జరగనున్నాయి. కాంగ్రెస్ బలహీనమవుతోందనే సంకేతాలు వస్తే మరికొందరు నేతలు కూడా చేరుతారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మరి కాషాయ నేతలు జరుపుతున్న చర్చలు సఫలమవుతాయా? హస్తం పార్టీలో అలకబూనిన నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అనేది వేచి చూడాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.