ETV Bharat / state

KUNAVARAM: విలీన మండల ప్రజల గో'దారి' కష్టాలు తీరేదెన్నడో..!!

author img

By

Published : May 20, 2022, 9:25 AM IST

KUNAVARAM: నడుముల్లోతు నీళ్లు.. అక్కడక్కడా ఇసుక తిన్నెలు.. ఎక్కడ ఏ గుంత ఉందో, ఎప్పుడేం జరుగుతుందో అంతు చిక్కదు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అడుగులు వేయాల్సిందే.. రెండున్నర కిలోమీటర్ల దూరం క్షణమొక యుగంలా ప్రయాణం సాగించాల్సిందే. ఈ కష్టాలు తీరేదెప్పుడో, ప్రయాణం సాఫీగా సాగేదెన్నడో అంటూ.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న విలీన మండలాల గిరిజన ప్రజల దీనస్థితిపై ఈటీవీ- ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

KUNAVARAM
విలీన మండల ప్రజల గో'దారి' కష్టాలు తీరెదెన్నడో

KUNAVARAM: ఇదీ... గోదావరి తీరం వెంట విస్తరించి ఉన్న 5 మండలాల ప్రజలు పడుతున్న నరకయాతన. నడుముల్లోతు నీళ్లున్న నదిని దాటుతూ... ఎప్పుడేం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించడం... అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, V.R.పురం, ఎటపాక, ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలకు నిత్యకృత్యంగా మారింది.

విలీన మండల ప్రజల గో'దారి' కష్టాలు తీరెదెన్నడో

ఈ 5 మండలాల పరిధిలోని శ్రీరాంగిరి-తాటికూరుగొమ్ము, వడ్డిగూడెం-రేపాకగొమ్ము, జీడిగుప్ప-కటుకూరు, కూనవరం-రుద్రంకోట, పోలిపాక-కొండపల్లి, సీతాపురం-దామరచర్ల రేవుల ప్రజలు నదిలో నడిచి వెళ్తుంటారు. కూనవరం నుంచి వేలేరుపాడు మండలం రుద్రంకోట రేవు మధ్య... సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం నడవక తప్పడం లేదు. రోజువారీ పనులు, ఆసుపత్రులకు వెళ్లే వారితోపాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేవారు... ఈ కష్టాలు తీరేదెప్పుడా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.

2019 సెప్టెంబర్లో కచ్చులూరు వద్ద పాపికొండల పర్యాటక బోటు గోదావరిలో మునిగినప్పుడు... నదిలో నాటు పడవల ప్రయాణంపై ఆంక్షలు విధించారు. అప్పటినుంచి గిరిజన ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నీటిమట్టం తగ్గినప్పుడు నానా తిప్పలు పడుతూ... నది మధ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. లేదంటే భద్రాచలం మీదుగా సుమారు 120 కిలోమీటర్లుపైగా ప్రయాణించి గమ్యస్థానం చేరుకోవాల్సి ఉంటుంది.

గతంలో కూనవరం ఫెర్రీ రేవు వద్ద అనధికారికంగా పడవలు నడిపేవారు. అందుకోసం ఒక్కొక్కరి నుంచి 40 నుంచి వంద రూపాయల వరకు వసూలు చేసేవారు. అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులతో పడవల్ని ఆపేశారు. ఆ తర్వాత పడవలకు వేలం నిర్వహిస్తామన్న అధికారులు... ఇప్పుడు ఆ మాటే మరిచిపోయారు. అధికార వైకాపా నేతల మధ్య వర్గపోరు కారణంగానే... పడవల వేలం నిర్వహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాలు కురిస్తే క్రమంగా నదిలో నీటి మట్టం పెరగుతుంది. ఈలోగా వేలం నిర్వహించి రాకపోకలు సాగించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని... విలీన మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.