ETV Bharat / state

గ్రామానికి ఆశాదీపమైన.. ఆశా కార్యకర్త.. సొంత డబ్బులతో రోడ్డు నిర్మాణం

author img

By

Published : Mar 26, 2023, 12:38 PM IST

Asha Worker Constructing the Road
రోడ్డు నిర్మిస్తున్న ఆశా కార్యకర్త

Asha Worker Constructing the Road: ఆమె మన్యం మహిళ.! పురిటి నొప్పులు, ప్రసవ వేదన తెలిసిన ఆశా కార్యకర్త.! కొండ కోనల్లో.. ముళ్ల దారుల్లో డోలీ కష్టాలు చూసి చలించారు. ఊరికి దారి చూపించాలని.. సంకల్పించారు. ఇల్లు కట్టుకోవాలని దాచుకున్న డబ్బుతో సొంతంగా రోడ్డు వేయిస్తున్నారు.

గ్రామానికి ఆశాదీపమైన.. ఆశా కార్యకర్త.. సొంత డబ్బులతో రోడ్డు నిర్మాణం

Asha Worker Constructing the Road: అల్లూరి సీతారామరాజు జిల్లా.. ముంచింగిపుట్టు మండలం.. తోటగోడిపుట్టు గ్రామం.! ఉన్నట్టుండి అక్కడో జేసీబీ రోడ్డు వేస్తోంది.! గిరిజనమంతా వింతగా చూశారు. హమ్మయ్య ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే ప్రభుత్వం.. ఇప్పటికి కనికరించిందా అనుకున్నారు. కానీ అక్కడ పనులను.. ఆశ కార్యకర్త జమ్మే పర్యవేక్షిస్తున్నారు. అదేంటి ప్రభుత్వం మీకు అప్పగించిన పని ఇది కాదు కదా అని అడిగారు గ్రామస్థులు! అప్పుడు తెలిసింది అసలు విషయం. ఈ రోడ్డువేయిస్తోంది.. ప్రభుత్వం కాదు, ప్రభుత్వ డబ్బుతో కాదని.! జమ్మే సొంత డబ్బుతో అని!

తోట గోడిపుట్టుకు వెళ్లాలన్నా.. రావాలన్నా రహదారి లేదు. మైదాన ప్రాంతానికి వెళ్లాలంటే దాదాపు 3 కిలోమీటర్లు రాళ్లురప్పల్లో నడవాలి. కాలిబాట కూడా సరిగాలేదు. ప్రైవేటు వాహనాలు కాదు కదా.. అత్యవసర సమయంలో అంబులెన్సులూ అటువైపు చూడవు. గర్భిణిలకు పురిటినొప్పులొచ్చినా, ఎవరికైనా జబ్బుచేసినా డోలీ కట్టాలి.! అర్థరాత్రైనా, అపరాత్రైనా కొండలు, గుట్టలు దాటాలి.!

కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లాలి. ఆస్పత్రి వెళ్లేలోపే ప్రసవమే జరుగుతుందో, ప్రాణమే పోతుందో తెలియని పరిస్థితి. ఈ బాధలు పడలేక ఊరి జనం వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ కష్టాలే జమ్మేను కదిలించాయి. సార్‌ మా ఊరికో దారి చూపండంటూ.. అవకాశం ఉన్న ప్రతీ అధికారినీ ఆమె వేడుకున్నారు.

అధికారులెవరూ జమ్మే మొర ఆలకించలేదు. ఊరికి తనే ఓ దారి చూపాలని సంకల్పించారు. ఊళ్లో పక్కా ఇల్లు కట్టుకోవాలన్నది జమ్మే కల. దాని కోసం ఆమె నాలుగేళ్లుగా వస్తున్న వేతనాన్ని కూడబెట్టారు. కానీ ఇల్లు కన్నా.. ఊరి సమస్య, దారి సమస్యే ఆమెకు పెద్దవిగా కనిపించాయి. కనీసం మట్టి రోడ్డు వేసినా.. కొంత సౌకర్యంగా ఉంటుందని భావించారు. తను దాచుకున్న డబ్బుతో రోడ్డు వేయిస్తున్నారు.

జమ్మే ఈ పనులను.. తన స్వహస్తాలతో టెంకాయకొట్టి ప్రారంభించారు. గంటకు 1350 రూపాయలు ఇచ్చి జెసీబీతో.. పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే నాలుగు రోజుల పని పూర్తైంది. రోడ్డు ఓ రూపు దాలుస్తోంది. కాలిబాట.. కూడా కనిపించని గ్రామస్థులకు.. ఇప్పుడో దారి కనిపిస్తోంది. జమ్మేను ఆ ఊరే కాదు సమీప గిరిజన గ్రామాల వారూ అభినందిస్తున్నారు. లంచాల కోసం ప్రజల్ని పీడించే ప్రభుత్వ ఉద్యోగులన్న ఈ రోజుల్లో.. చిన్న జీతాన్ని కూడా ప్రజల కోసం ఖర్చు చేస్తున్న జమ్మే అందరికీ ఆదర్శం.

"ఊరిలో జనాభా చాలా మంది ఉండేవారు. రోడ్డు లేదు.. మంచి నీరు లేదు. బియ్యం తెచ్చుకోవాలన్నా.. మార్కెట్​కు వెళ్లాలన్నా.. నడకదారి కాబట్టి ఇబ్బంది అవుతుందని కొంతమంది ఊరు వదిలి వేరే దగ్గరకి వెళ్లిపోయారు. చాలా మందికి ఫిర్యాదు చేశాం.. కానీ రెస్పాన్స్ లేదు. అందువలన నేను.. నా సొంత డబ్బులతో చేయిస్తున్నాను. రోడ్డు లేదు కాబట్టి.. హాస్పిటల్​కి వెళ్లాలంటే కొంచం సమస్యగా ఉంటుంది. నాలుగు సంవత్సరాల నుంచి నేను రెండు లక్షల రూపాయలు దాచుకున్నాను. ఇల్లు కట్టుకుందామని డబ్బులు దాచుకున్నాను. ఊరు వాళ్లు వేరే దగ్గరకి వెళ్లిపోకుండా ఉండాలని.. అదే విధంగా నా ఉద్యోగం నేను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాను". - జమ్మే, ఆశ కార్యకర్త, తోటగొడిపుట్టు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.