ETV Bharat / sports

సూర్య భాయ్​.. ఎంత టాలెంట్​ ఉన్నా ఇలా చేయడం సరికాదేమో!

author img

By

Published : Jan 4, 2023, 7:50 PM IST

Updated : Jan 4, 2023, 8:26 PM IST

గత కొద్ది కాలంగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న స్టార్ బ్యాటర్​ సూర్య కుమార్.. ​ శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో నిరాశపరిచాడు. అయితే అందుకు గల కారణాలను తెలుసుకుందాం..

Surya kumar yadav
సూర్య భాయ్​.. ఎంత టాలెంట్​ ఉన్నా ఇలా చేయడం సరికాదేమో!

సూర్య.. సూర్య.. సూర్య.. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో వినిపించిన పేరు ఇది. స్టేడియం మొత్తం అభిమానులు ఈ పేరుతో హోరెత్తించారు. ఎందుకంటే గత కొద్ది కాలంగా అతడి అద్భుత ప్రదర్శన.. యావత్​ క్రికెట్​ ప్రపంచం ఫిదా అయిపోయింది. దీంతో ఈ సిరీస్​లో వైస్ కెప్టెన్‌ బాధ్యతలను అప్పగించింది బీసీసీఐ. కానీ అతడు అంచనాలను తలకిందులు చేస్తూ తొలి మ్యాచ్‌లోనే విఫలమై నిరాశపరిచాడు.

ఓ పట్టాన అర్థం కాదు.. గత టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ భారత్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. లీగ్‌ స్టేజ్‌లో ఎలా ఆడినా ఫర్వాలేదు.. కానీ సెమీస్‌లో సూర్య విఫలం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సూర్యకుమార్‌ ఆట ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే ప్రదర్శనలో అతడు రెండు అడుగులు ముందుకేస్తే.. ఒకడుగు వెనక్కి వేయడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడింది. కివీస్‌పై టీ20ల్లో సెంచరీ (51 బంతుల్లోనే 111 పరుగులు) సాధించినా.. ఆ తర్వాత ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచాడు. క్లిష్ట సమయాల్లో రాణించి జట్టుకు అండగా నిలబడితేనే 'స్టార్‌ బ్యాటర్‌' బిరుదుకు అర్థం ఉంటుంది.

టాలెంట్‌ ఎంత ఉన్నా అది అవసరం.. మిషన్- 2024లో భాగంగా సూర్యకుమార్‌ కీలక బ్యాటర్‌గా మారతాడని అందరి అంచనా. ఇలాంటి సూర్యకుమార్‌లో టాలెంట్‌కు కొదవేం లేదు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం భయపడకుండా హడలెత్తిస్తాడు. అయితే ఒక్కోసారి తొందరపాటుతో పెవిలియన్‌కు చేరుతున్నాడు. తాజాగా శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌నే తీసుకొంటే.. కీలకమైన వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్‌కు ఇరుసులాంటి స్థానం. త్వరగా బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాడు చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఎంత బాగా రాణిస్తే జట్టు మీద ఒత్తిడి అంత తగ్గిపోతుంది. కానీ సూర్యకుమార్‌ మాత్రం మూడో ఓవర్‌లోనే క్రీజ్‌లోకి వచ్చినప్పటికీ.. ఎప్పటిలాగే తన షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. అదీనూ 10 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేశాడు. నిన్నటి వరకు ఇదే స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగేవాడు. క్రీజ్‌లో పాతుకుపోయి జట్టుకు అవసరమైన పరుగులను రాబట్టేవాడు. దాంతో నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్ స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాడు. సూర్యకుమార్‌ సెకండ్‌ డౌన్‌లో ఇలా వచ్చి ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఇప్పుడు మూడో స్థానంలో రావడంతో ఆచితూచి ఆడాల్సిన పరిస్థితిలోనూ తన పాత అలవాటునే కొనసాగించి బోల్తా పడ్డాడు.

చటక్కున క్యాచ్​ ఇచ్చేస్తాడుగా.. న్యూజిలాండ్‌తో గత వన్డే సిరీస్‌ సందర్భంగా జరిగిన ఓ సంఘటన నుంచి సూర్యకుమార్‌ చాలా నేర్చుకోవాల్సి అవసరం ఉంది. 30వ ఓవర్‌ తర్వాత దాదాపు స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టడానికి ఏ జట్టూ సాహసం చేయదు. కానీ సూర్యకుమార్‌ కోసం స్లిప్‌ పెట్టి మరీ వికెట్‌ను సాధించింది న్యూజిలాండ్‌ టీమ్‌. ఆ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ కామెంట్‌ చక్కర్లు కొట్టింది. 'టీ20 టాప్‌ బ్యాటర్‌గా మారిన సూర్యకుమార్‌కు స్లిప్‌లో ఫీల్డర్‌ను పెడితే చటక్కున క్యాచ్‌ ఇచ్చేస్తాడు' అనే వ్యాఖ్యలు వినిపించాయి.

మళ్లీ మళ్లీ అదే పొరపాటు.. విభిన్న షాట్లు కొట్టడం తప్పేలేదు. అలా కొడితే బౌలర్లు అయోమయానికి గురై సరైన లెంగ్త్‌లో బంతిని సంధించడానికి ఇబ్బంది పడతారు. కానీ షార్ట్‌ ఫైన్‌లెగ్‌ వైపు తరచూ కొట్టి వికెట్‌ను చేజార్చుకొంటున్న సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం తన తీరును మార్చుకోలేకపోతున్నాడు. అయితే అన్నిసార్లూ ఇది వర్కౌట్‌ కాదు. తాజాగా వచ్చీ రాగానే దూకుడు ఆడకుండా పరిస్థితులను బట్టి పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు డిప్యూటీగా సూర్యకుమార్‌ ఉన్నాడు. ఇలాంటి తరుణంలో మరింత బాధ్యత తీసుకొని ఆడాల్సిన అవసరం ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచుల్లోనైనా సూర్యకుమార్‌ రాణించాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: IND VS SL: లంకతో రెండో టీ20కు రెడీ.. టీమ్​ఇండియాలో ఆ ఇద్దరు ప్లేయర్సే సమస్య

Last Updated : Jan 4, 2023, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.