ETV Bharat / sports

సూర్య భాయ్​.. వందేళ్లకు ఓసారి మాత్రమే ఇలాంటోడు వస్తాడు

author img

By

Published : Jan 9, 2023, 8:09 PM IST

ఎవరేస్తే ఏంటి.. ఎక్కడేస్తే ఏంటి? స్పిన్నైతే ఏంటి.. ఫాస్ట్‌ అయితే ఏంటి? బంతి పడిందా గోవిందా! ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ ఆకాశ విహారమే చేస్తాడు స్టార్ బ్యాటర్ సూర్య. అతడిపై యావత్​ క్రికెట్​ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. ఆ సంగతులు..

Kapil Dev praises Surya kumar yadav
సూర్య భాయ్​.. వందేళ్లకు ఓసారి మాత్రమే ఇలాంటోడు వస్తాడు

సూర్యకుమార్​ యాదవ్​.. ఇప్పుడీ పేరు ప్రశంసింకుండా ఎవరూ ఉండలేరు. ఎందుకంటే గత కొంత కాలంగా మైదానంలో బ్యాట్ పడితే చాలు విభిన్న షాట్లు బాదేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. దీంతో అతడిపై అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారత దిగ్గజ ప్లేయర్​ కపిల్‌ దేవ్‌ కూడా సూర్యపై ప్రశంసలు కురిపించాడు. అతడు సచిన్‌ తెందూల్కర్‌, విరాట్‌ కోహ్లీ, వివ్‌ రిచర్డ్స్‌ సరసన నిలిచే బ్యాటర్‌గా పోల్చాడు. అతడి లాంటి ఆటగాళ్లు వందేళ్లకు ఓసారి మాత్రమే వస్తారని ప్రశంసించాడు.

"సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ను వర్ణించాలంటే ఒక్కోసారి నాకు మాటలు రావు. సచిన్‌ తెందూల్కర్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలను చూసినప్పుడు ఏదో ఒక రోజు సూర్య కుమార్‌ కూడా వారి సరసన చేరుతాడేమోనని అనిపిస్తోంది. సూర్యకుమార్‌ ఫైన్‌ లెగ్‌ మీదుగా ఆడే ల్యాప్‌షాట్‌ బౌలర్‌ను భయపెడుతుంది. అతడు నిలబడి మిడ్ ఆన్, మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టగలడు. బౌలర్‌ ఎటువంటి బంతి వేస్తాడో కచ్చితంగా అంచనా వేస్తాడు. డివిలియర్స్‌, వివియన్‌ రిచర్డ్స్‌, సచిన్‌, విరాట్‌, రికీ పాంటింగ్‌ వంటి గొప్ప గొప్ప బ్యాటర్లను చూశాను. కానీ కొందరు మాత్రమే అతడిలా బంతిని క్లీన్‌గా కొట్టగలరు. హ్యాట్సాఫ్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. ఇలాంటి ఆటగాళ్లను వందేళ్లకు ఒకసారి మాత్రమే చూస్తాం" అని కపిల్‌దేవ్ అన్నాడు. కాగా, టీ20 ఫార్మాట్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో కేవలం 51 బంతుల్లో 112 పరుగులు సాధించి పొట్టి ఫార్మాట్‌లో మూడో శతకాన్ని సూర్య తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదీ చూడండి: టీ20 ఫార్మాట్​కు బై.. క్లారిటీ ఇచ్చిన రోహిత్​.. ఏం అన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.