ETV Bharat / sports

సచిన్​@50.. మాస్టర్​కు వీరాభిమాని స్పెషల్ గిఫ్ట్​.. ఆస్తులు సైతం అమ్మి!

author img

By

Published : Apr 24, 2023, 11:19 AM IST

Updated : Apr 24, 2023, 12:28 PM IST

క్రికెట్‌ దేవుడు సచిన్‌ తెందుల్కర్​ 50వ పడిలోకి అడుగుపెట్టారు. వంద శతకాలు సహా ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్న సచిన్‌ 50వ జన్మదినం సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సచిన్‌కు కోట్ల మంది అభిమానులున్నా.. ఓ అభిమాని మాత్రం చాలా ప్రత్యేకం. ఒళ్లంతా త్రివర్ణ రంగులను పూసుకుని చేతిలో జెండా పట్టుకుని సందడి చేసే వ్యక్తే సుధీర్‌ కుమార్‌ చౌదరీ. సచిన్‌ 50వ జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక అభిమాని గురించి తెలుసుకుందాం.

sachin fan
sachin fan

సచిన్‌ ప్రపంచ క్రికెట్‌ లోకానికి దేవుడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్​కు ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో ఒక అభిమాని మాత్రం చాలా ప్రత్యేకం. సచిన్‌ ఆడుతుంటే చూసేందుకు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసిన ఆ వీరాభిమానే సుధీర్‌కుమార్‌ చౌదరీ. సుధీర్‌ అంటే తెలియని వాళ్లు బహుశా భారత క్రికెట్‌ అభిమానుల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు.

సచిన్​ మ్యాచ్​లు చూసేందుకు ఆస్తులు సైతం..
సచిన్‌ రిటైర్మెంట్‌ వరకు టీమ్ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో సుధీర్‌ స్టాండ్స్‌లో దర్శనమిచ్చే వాడు. సచిన్‌ ఆడిన ప్రతి మ్యాచ్‌ను చూసేందుకు ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. శరీరాన్ని మొత్తం భారతీయ జెండాలోని త్రివర్ణ రంగులతో నింపుకొని ఛాతీపై సచిన్‌ తెందుల్కర్​ జెర్సీ నెంబర్‌ ముద్రించుకొని చేతిలో జాతీయ జెండాను పూని టీమ్​ఇండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడితే అక్కడికి ఒక సైకిల్‌పైనే వెళ్లి మ్యాచ్‌లను చూసేవాడు.

సుధీర్‌కుమార్‌ చౌదరీ
సచిన్​తో సుధీర్‌కుమార్‌ చౌదరీ

ఆరేళ్ల వయసులోనే..
ఆరేళ్ల వయసులోనే సచిన్‌కు వీరాభిమానిగా మారిపోయిన సుధీర్‌ కుమార్‌ చౌదరీ.. 14 ఏళ్ల వయసులో చదువు వదిలేశాడు. కొన్నాళ్లు టీచర్‌గా పనిచేశాడు. తన జీవితం క్రికెట్‌ మ్యాచ్‌లకే అంకితమని తీర్మానం చేసుకున్న సుధీర్‌.. పబ్లిక్‌ సపోర్ట్‌తో వచ్చిన డబ్బులతో స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌లను చూసేవాడు. చాలాసార్లు వందల కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి సచిన్‌ మ్యాచ్‌లను చూసేవాడు.

sachin fan
సుధీర్‌కుమార్‌ చౌదరీ

పాకిస్థాన్​లో మ్యాచ్​ జరిగినా సైకిల్​పై..
పాకిస్థాన్​, బంగ్లాదేశ్‌ల్లో భారత్‌ ఆడిన సిరీస్‌లకు సైకిల్‌పైనే వెళ్లడం సచిన్‌పై అతడికున్న అభిమానానికి నిదర్శనం. 2011, ఏప్రిల్‌ 2న.. టీమ్​ఇండియా వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన రోజు భారత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలకు సచిన్‌ సుధీర్‌ చౌదరీని ఆహ్వానించి గౌరవించాడు.

సుధీర్‌కుమార్‌ చౌదరీ
వరల్డ్​ కప్​తో సుధీర్‌కుమార్‌ చౌదరీ

సచిన్‌ను మెప్పించిన అభిమాని.. పోలీసుల క్షమాపణ
2010లో కాన్పూర్‌ వేదికగా టీమ్​ఇండియా మ్యాచ్‌ ఆడేందుకు వచ్చింది. అయితే ప్రాక్టీస్‌సెషన్‌ సమయంలో సచిన్‌తో కరచాలనం చేయడానికి సుధీర్‌ కుమార్‌ ప్రయత్నించాడు. కానీ పోలీసులు సుధీర్‌ పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు. ఇది గమనించిన సచిన్‌ నేరుగా పోలీసుల వద్దకు చేరుకొని.. అతడు నా వీరాభిమాని.. అతడు నాకు ఫ్యాన్‌ కాదు.. నేనే అతడి ఫ్యాన్‌ను అని చెప్పాడు.

సుధీర్‌కుమార్‌ చౌదరీ
ధోనీతో సుధీర్‌కుమార్‌ చౌదరీ

సచిన్​ తర్వాత ధోనీ..
సచిన్‌ రిటైర్మెంట్‌ తర్వాత కొన్నాళ్ల పాటు ధోనీ అభిమానిగా మారిన సుధీర్‌.. పలు మ్యాచ్‌లకు అతడి జెర్సీ నెంబర్‌ ముద్రించుకొని వచ్చాడు. కానీ ఇటీవల భారత్‌ ఆడే మ్యాచ్‌ల్లో సుధీర్ పూర్తిగా కనిపించడం లేదు. సచిన్‌ 50వ జన్మదినం సందర్భంగా సచిన్‌కు ప్రత్యేక బహుమతి ఇచ్చి మరీ సుధీర్‌ మరోసారి తనకున్న అపరిమితమైన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఆసీస్​లో అరుదైన ఘనత..
సచిన్​ తెందుల్కర్​కు ఆస్ట్రేలియా గడ్డపై ఓ అరుదైన గౌరవం దక్కింది. సోమవారం తన 50వ బర్త్​డే జరుపుకుంటున్న సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ).. స్టేడియంలో తెందుల్కర్​ పేరు మీద గేట్లను ఆవిష్కరించింది. తెందుల్కర్​తో పాటు వెస్టిండీస్​ లెజెండ్ బ్రెయిన్​ లారా పేర్లతో గేట్లను ఆవిష్కరిస్తున్నట్లు ఎస్‌సీజీ ప్రకటించింది. "బ్రెయిన్​ లారా - సచిన్​ తెందుల్కర్​ గేట్స్​" అంటూ నామకరణం చేసింది. ఇకపై ఈ గ్రౌండ్స్​లో జరిగే మ్యాచ్​లకు హాజరయ్యే ఆటగాళ్లందరూ ఈ గేట్ల నుంచే ప్రవేశించనునున్నట్లు ఎస్​సీజీ పేర్కొంది.

sachin fan
ఆసీస్​లో అరుదైన గౌరవం
Last Updated : Apr 24, 2023, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.