ETV Bharat / sitara

"ఆర్​ఆర్ఆర్' కథ లాంటిదే మా సినిమా!'

author img

By

Published : Aug 17, 2021, 6:57 AM IST

పాటల ప్రపంచంలో తనదైన గుర్తింపు సాధించిన గాయకుడు మనో.. ఇప్పుడు 'క్రేజీ అంకుల్స్​' అనే వినోదాత్మక చిత్రంలో నటించారు. ఆ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు ఆయన పంచుకున్నారు.

singer mano
సింగర్​ మనో

"కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రం మా 'క్రేజీ అంకుల్స్‌'. నవ్వులతో పాటు చక్కటి సందేశాన్ని అందిస్తుంది" అన్నారు గాయకుడు, నటుడు మనో. ఇప్పుడాయనతో పాటు శ్రీముఖి, రాజా రవీంద్ర, భరణిలతో కలిసి నటించిన చిత్రం 'క్రేజీ అంకుల్స్‌'. ఇ.సత్తిబాబు దర్శకుడు. గుడ్‌ సినిమా గ్రూప్స్‌, గ్రీన్‌ మెట్రో మూవీస్‌, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 19న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు మనో.

"50ఏళ్లు దాటిన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు స్నేహితుల కథ ఇది. ఒకరకంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' కథ అని చెప్పొచ్చు (నవ్వుతూ). వయసు రీత్యా తమ ఇంట్లో ప్రాధాన్యం తగ్గిన ఆ ముగ్గురు మిత్రులు మరోచోట వినోదం పొందాలనుకుంటారు. ఈ క్రమంలో స్వీటీ అనే ఓ గాయనికి ఆకర్షితులవుతారు. ఆమె పరిచయం తర్వాత వాళ్ల జీవితాల్లో ఎదురైన సమస్యలేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది మిగతా కథాంశం. ఇందులో రెడ్డి అనే బంగారు షాపు యజమాని పాత్రలో కనిపిస్తా".

యువతరం చూడాల్సిన చిత్రం..

"50ఏళ్ల మిత్రుల కథ అనగానే ఓ వర్గం ప్రేక్షకులకే చెందిన చిత్రం అనుకోకండి. ఇప్పటి తరం తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్లూ రేపటి రోజున యాభై ఏళ్లకు చేరుకోవాల్సిందే. కాబట్టి అప్పుడెలా ఉండాలి.. లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటే కుటుంబం ఎలా ఇబ్బందులు పడతుందనే విషయాలపై ఓ అవగాహన కలుగుతుంది. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి ఆశీర్వదిస్తారనే నమ్మకంతోనే.. ఇన్నాళు ఆగి సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం".

అందుకే కామెడీ పాత్రలంటే మక్కువ

"ఒకప్పటి కామెడీ చిత్రాల్ని.. ఇప్పటి కామెడీ సినిమాల్ని పోల్చి చూస్తే.. ఇప్పటి వారు ఇంకొంచెం బెటర్‌గా ఆలోచిస్తున్నారనిపిస్తుంది. స్వతహాగా నేను చాలా సరదా మనిషిని. అందుకే నాకు కామెడీ పాత్రలంటే చాలా ఇష్టం. వాస్తవానికి ప్రతి గాయకుడిలోనూ ఓ నటుడు ఉంటాడు. ఎందుకంటే పాట పాడేటప్పుడైనా.. డబ్బింగ్‌ చెప్పేటప్పుడైనా.. తెరపై నటుడిలా ఊహించుకుంటూనే స్వరంతో నవరసాలు పలికించాలి. నేను జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ లాంటి వారి నటనను ఎంతో ఇష్టపడతా. నాకూ వారిలా విభిన్నమైన పాత్రలు పోషించాలనుంది".

ఆ వినయం అక్కడి నుంచే..

"ఎంత ఎదిగినా ఒదిగుండాలనే లక్షణం మా ముందుతరం సంగీత దర్శకులు, గాయకుల నుంచే వచ్చింది. మహదేవన్‌, ఎమ్మెస్‌ విశ్వనాథన్‌, రాజేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం.. ఇలాంటి గొప్ప వ్యక్తుల స్కూల్‌లో పెరిగాం. వినయం.. విధేయత.. క్రమశిక్షణ.. ఆ బడిలో ఆటోమేటిక్‌గా అబ్బేస్తాయి. అందుకే నాకది ఓ అద్భుత ప్రయాణం. కానీ, ఇప్పుడా కల్చర్‌ కనిపించడం లేదు. ప్రస్తుతం వస్తున్న కొత్తతరం గాయకులు అద్భుతంగా పాడుతున్నారు. కాకపోతే నడవడిక.. వినయం.. సాధన చాలా ముఖ్యం. వాళ్లివన్నీ ముందు తరం సంగీత దర్శకులు, గాయకుల నుంచి నేర్చుకోవాలి".

ఆయన వల్లే నటుడిగా..

నాలో నటుడ్ని గుర్తించి.. ప్రోత్సహించింది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు. ఆయనే 'రంగూన్‌ రౌడీ' చిత్రంతో నన్ను బాల నటుడిగా పరిచయం చేశారు. తర్వాత 'ఓ ఆడది ఓ మగాడు', 'నీడ', 'కేటుగాడు' తదితర సినిమాల్లో నటించాను. ఇప్పటి వరకు 13 భాషల్లో.. 25వేల పాటలు పాడాను. ఇవి కాక ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లోనూ కొన్ని వేల పాటలు పాడా. అప్పట్లో ఇండస్ట్రీ అంతా దాదాపు ఒకే చోట కేంద్రీకృతమై ఉండటం వల్ల అందరికీ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడలా లేదు. ట్రెండ్‌ మారడం వల్ల గతంతో పోల్చితే ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. అయితే నాలుగైదు భాషల్లో పాడటం వల్ల ఇప్పటికీ నాకు పాటలొస్తున్నాయి".

ఇదీ చదవండి: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. శ్రీముఖి క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.