ETV Bharat / opinion

పర్యావరణ విధ్వంసానికేనా అనుమతులు?

author img

By

Published : Sep 23, 2020, 7:21 AM IST

అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను నాశనం చేస్తూ పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్నారు మానవులు. దీంతో ప్రకృతి విపత్తులు యావత్​ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో పర్యావరణ అనుమతుల మంజూరు ప్రక్రియను తక్షణమే పటిష్ఠపరచాల్సిన అవసరం ఉంది. అయితే.. కేంద్రం ఇటీవల ప్రకటించిన పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) నోటిఫికేషన్‌ ముసాయిదాలోని పలు ప్రతిపాదనలు లోపభూయిష్ఠంగా ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే పరిశ్రమలు, ప్రాజెక్టులు స్థాపించడానికి వీలు కల్పించేలా ఉండటం చర్చనీయాంశమైంది.

MANY OF ERRORS IN ENVIRONMENTAL IMPACT ASSESSMENT NOTIFICATION PROPOSALS
విధ్వంసానికా అనుమతులు?

మానవులు అభివృద్ధి పేరిట జీవావరణ వ్యవస్థలో భాగమైన ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్నారు. ఫలితంగా విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. సంక్షోభం ఉరుముతున్న తరుణంలో పారిశ్రామిక, అభివృద్ధి మౌలిక వసతుల ప్రాజెక్టుల స్థాపనలో పర్యావరణ అనుమతుల మంజూరు ప్రక్రియను మరింత పటిష్ఠపరచడం తక్షణావసరం. కానీ, కేంద్రం ఇటీవల ప్రకటించిన పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) నోటిఫికేషన్‌ ముసాయిదాలోని పలు ప్రతిపాదనలు లోపభూయిష్ఠంగా ఉన్నాయి. ముందస్తు పర్యావరణ అనుమతులు పొందకుండానే పరిశ్రమలు, ప్రాజెక్టులు స్థాపించడానికి వీలు కల్పించేలా ఉండటం చర్చనీయాంశంగా మారింది. పారిశ్రామిక సంస్థలు, ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరును వేగిరపరచేందుకు ఉద్దేశించిన అత్యంత పారదర్శక ప్రక్రియగా కేంద్రం దీన్ని ప్రకటించింది.

ముందస్తుగా పర్యావరణ అనుమతులు పొందకుండా కార్యకలాపాలు నిర్వహించుకునే వీలు కల్పించే ప్రతిపాదనలు ముసాయిదాలో ఉండటం ప్రమాదకర పరిణామం. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు, పరిశ్రమలు అధికారిక పర్యావరణ అనుమతులు పొందకుండానే యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2020 మే 7న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన ఎల్‌జీ పాలిమర్స్‌ ఉదంతమే దీనికి ఉదాహరణ. స్టెరైన్‌ వాయువు లీకైన ప్రమాద ఘటనపై విచారణలో వెలుగుచూసిన కఠోర వాస్తవాలు నివ్వెరపరచేలా విధ్వంసానికా అనుమతులు?ఉన్నాయి. 20 ఏళ్లుగా ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ పర్యావరణ అనుమతి లేకుండానే ప్లాంటును నిర్వహిస్తుండటం దారుణం. మే 27న తూర్పు అసోమ్‌లోని టిన్‌సూకియా జిల్లాలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఖనిజ క్షేత్రంలో సహజవాయువు బ్లో-అవుట్‌ వల్ల మంటలు చెలరేగి, జీవవైవిధ్యానికి ప్రసిద్ధిగాంచిన ఆ ప్రాంత జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లింది.

అదే ప్రతికూలం..

ప్రభుత్వ రంగ సంస్థ అయినా 15 ఏళ్లకు పైబడి పర్యావరణ అనుమతులు లేకుండా సహజవాయు నిక్షేపాలను ఆ సంస్థ వెలికితీస్తున్నట్లు వెల్లడైంది. పర్యావరణ ప్రభావ మదింపు అనేది పర్యావరణ సంరక్షణ చట్టం(1986) ప్రకారం నిర్వహించే ప్రక్రియ. పలు పారిశ్రామిక సంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకున్నదే తడవుగా అనుమతులు మంజూరుచేయడాన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన ఏర్పాటు ఇది. ఎప్పటికప్పుడు నిబంధనలు సవరిస్తూ, ఒక్కో రకమైన ప్రాజెక్టును పర్యావరణ మదింపు ప్రక్రియ దశ నుంచి మినహాయిస్తుండటం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పర్యావరణ ప్రభావ మదింపులో ప్రభుత్వానికి విచక్షణాయుత అధికారాలు, పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని పరిమితం చేయడం ముసాయిదాలో ప్రధాన ప్రతిపాదన. సాధారణంగా జాతీయ భద్రత, రక్షణకు సంబంధించిన ప్రాజెక్టులను ‘వ్యూహాత్మక’ విభాగం కింద పరిగణిస్తారు.

విచక్షణ ముఖ్యం

ముసాయిదా ప్రకారం ప్రాజెక్టుల సమాచారాన్ని ప్రజాక్షేత్రంలో వెల్లడించాల్సిన అవసరం లేదు. ఫలితంగా ఏ ప్రాజెక్టు అయినా ‘వ్యూహాత్మక’ విభాగం కోవకు చెందుతుందన్న ముసుగులో పర్యావరణ అనుమతులు పొందడానికి వీలు కల్పించినట్లవుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు కల్పించిన వివిధ రకాల ప్రాజెక్టులతో కూడిన సుదీర్ఘ జాబితాను నోటిఫికేషన్‌లో పొందుపరచారు. ఉదాహరణకు దేశ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, పైపులైన్ల నిర్మాణ ప్రాజెక్టులకు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే పర్యావరణ అనుమతులు మంజూరుచేస్తారు. ఫలితంగా ఎన్నో వైవిధ్యభరితమైన వృక్ష, జీవజాతుల ఉనికికి ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. అంతర్గత జల రవాణా, జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను సైతం మినహాయించారు. లక్షా యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవన నిర్మాణాలకూ ఇదే మినహాయింపు ఇవ్వాలన్నది ప్రతిపాదన. 2016లో ఇదే విషయాన్ని కేంద్రం ప్రకటించగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో పర్యావరణ ప్రభావం మదింపు, ప్రభావిత ప్రాంతాల ప్రజల అభిప్రాయాన్ని సేకరించడమన్నవి అత్యంత కీలక అంశాలు. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. విచక్షణాయుతంగా పరిసరాలను, సహజ వనరులను నిర్దేశించిన పరిధుల్లో వినియోగించుకుంటూ ముందుకెళ్తేనే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది!

-డాక్టర్​ జీవీఎల్​ విజయ్​ కుమార్​, రచయిత- భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు

ఇదీ చదవండి: 'పెట్టుబడిదారీ మిత్రుల కోసమే వ్యవసాయ బిల్లులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.