ETV Bharat / jagte-raho

మాదకద్రవ్యాల వినియోగంలో యువతే అధికం

author img

By

Published : Dec 7, 2020, 1:27 PM IST

DRUGS
DRUGS

హైదరాబాద్​లో విద్యార్థులు, సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ పరిశీలనలో తేలింది. ఇటీవల కాలంలో గంజాయి, హాసిస్‌ ఆయిల్‌, ఎల్‌ఎస్‌డీ లాంటి ఇతర మాదకద్రవ్యాలకు బానిసలైన పది మందిని ఇటీవలే అరెస్ట్​ చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్​ వెల్లడించింది. స్నేహితులతో కలిసి పొగ పీల్చడం నుంచి ప్రారంభమయ్యే అలవాటు క్రమంగా మాదక ద్రవ్యాలకు బానిసలను చేస్తోంది.

హైదరాబాద్​లో యువత మాదక ద్రవ్యాల్లో మునిగి తేలుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్న వారి జాబితాలో విద్యార్థులు, సాఫ్ట్​వేర్​ ఉద్యోగులే సింహబాగం ఉంటున్నారు. కరోనా లాక్​డౌన్​ సమయంలో వీటి వాడకం మరింత పెరిగినట్లు అబ్కారీ శాఖ గుర్తించింది.

పార్టీలు, పబ్‌లకు వెళ్లడం, స్నేహితులతో పార్టీలు చేసుకోవడం వల్లనే మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడుతున్నారని అధికారులు గుర్తించారు. చదువుకొనేందుకు నగరానికి వచ్చిన విద్యార్థులు, వసతి గృహాల్లో ఉంటున్నవారు, తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడిని వారు.. మత్తుమందులకు బానినలవుతున్నారని అబ్కారీ శాఖ అధ్యయనంలో తేలింది.

జాబితాలో మహిళలు ..

రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించే సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు, భార్యలకు దూరంగా ఉంటున్న యువ ఇంజినీర్లు, పని ఒత్తిడి పేరుతో మత్తు మందుల వైపు దారిమళ్లుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ గుర్తించింది. ఈ జాబితాలో మహిళలు కూడా ఉన్నట్లు తేల్చారు.

ఇటీవల కాలంలో పది మందిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్​ అధికారులు అరెస్టు చేశారు. స్నేహితుల మధ్య జరిగే చిన్న చిన్న పార్టీల్లోనూ మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. స్నేహితులతో కలిసి ఒకటి, రెండు సార్లు గంజాయి తాగుతున్నారు. మత్తు కలిగించి.. గాలిలో తేలినట్లు ఉండడం.. మరింత ఉత్సాహాన్ని ఇవ్వడం.. ఏదో తెలియని ఆనందాన్ని పొందడం లాంటివి.. మాదకద్రవ్యాలకు బానిసలను చేస్తున్నాయన్నారు.

గమ్మత్తు పేర్లు..

ఆరోగ్యం చెడుపోతుందని.. ఆర్థిక సమస్యలు ఎదరవుతాయని.. చట్టవ్యతిరేకమని.. చాలా మంది విద్యార్థులకు తెలియడం లేదని అధికారులు తెలిపారు. సరదాకు మొదలయ్యే అలవాటు బానిసలుగా మారుస్తోందన్నారు. మత్తు పదార్థాల పేర్లూ గమ్మత్తుగా ఉంటున్నాయన్నారు. వీడ్‌, గ్రాస్‌, పాట్‌, స్టాష్‌, స్టోన్‌, జాయింట్‌, హాస్‌, హషీస్‌, గంజా, చరస్‌ వంటి ముద్దు పేర్లతో పిలుస్తున్నారని... చాటింగ్​ సందర్భంగా కుటుంబ సభ్యులు చూసినా గుర్తుపట్టలేనట్లు ఉంటున్నాయని తెలిపారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారే.. సరఫరాదారులుగా మారుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

తమ పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనిస్తుండాలని.. మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు అనుమానం వస్తే కౌన్సిలింగ్​ ఇప్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవీచూడండి: ఏలూరు: ప్రజలకు అస్వస్థతపై సీఎం సమీక్ష.. సమస్యపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.