ETV Bharat / jagte-raho

ఫోన్ ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారు

author img

By

Published : Feb 10, 2020, 4:41 PM IST

Updated : Feb 10, 2020, 5:29 PM IST

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన ‘దిశ’ యాప్... ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై అందుబాటులోకి వచ్చింది. ఆ యాప్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

Disha App
Disha App

ఆపదలో ఉన్న మహిళలకు అత్యవసర సహాయం అందించేందుకు, రక్షణ కల్పించేందుకు పోలీసుశాఖ ‘దిశ’ పేరుతో మొబైల్‌ యాప్‌ రూపొందించింది. దీన్ని ముఖ్యమంత్రి జగన్‌ శనివారం ఆవిష్కరించారు. ఆపదలో ఉన్నవారు యాప్‌ను ఓపెన్‌ చేసి అత్యవసర సహాయ (ఎస్‌ఓఎస్‌) బటన్‌ను నొక్కి పోలీసుల సహాయం కోరే సమయం కూడా లేనప్పుడు, ఫోన్‌ని అటూ ఇటూ గట్టిగా ఊపినా (షేక్‌ ట్రిగర్‌) కంట్రోల్‌ రూంకి క్షణాల్లో సమాచారం వెళ్లేలా దీన్ని రూపొందించారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై ఇటీవలే అందుబాటులో వచ్చిన ‘దిశ’ యాప్‌లోని ముఖ్యాంశాలు ఇవి.

  1. ఇంటర్నెట్‌ ఉన్నా.. లేకపోయినా యాప్‌ పనిచేస్తుంది.
  2. ఫోన్‌లో యాప్‌ని తెరిచి ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే ఆ ఫోన్‌ లొకేషన్‌ వివరాలు, ఆ ఫోన్‌ నెంబరు ఎవరి పేరు మీద ఉంది, చిరునామా వంటి వివరాలన్నీ పోలీసు కంట్రోల్‌ రూంకి వెళతాయి.
  3. ఫోన్‌ లొకేషన్‌, 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో కూడా కంట్రోల్‌ రూంకి చేరతాయి. బాధితురాలు ఎక్కడున్నారో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు వీడియో, ఆడియో ఉపయోగపడతాయి.
  4. ఈ యాప్‌లో ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ అని ఒక ఆప్షన్‌ ఉంది. ఉదాహరణకు ఒక మహిళ విజయవాడలో బెంజ్‌సర్కిల్‌ నుంచి బస్టాండ్‌కి ఆటో లేదా క్యాబ్‌లో వెళుతుంటే.. ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌లో బయల్దేరిన ప్రాంతం, గమ్యం నమోదుచేయాలి. ఆ మహిళ వెళుతున్న మార్గాన్ని కంట్రోల్‌ రూం నుంచి గమనిస్తారు. నమోదుచేసిన మార్గంలో కాకుండా, ఆటో మరో మార్గంలోకి వెళ్తే వెంటనే పోలీసు కంట్రోల్‌ రూంని, స్థానికంగా ఉన్న పోలీసుస్టేషన్‌ను అప్రమత్తం చేస్తూ సందేశం వెళుతుంది.
  5. ఆపదలో ఉన్నప్పుడు అత్యవసర సమాచారం పంపేందుకు కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఫోన్‌ నంబర్లను యాప్‌లో నమోదు చేయవచ్చు. ఐదు నంబర్లు నమోదు చేసేందుకు వీలుంటుంది. ఎస్‌ఓఎస్‌ సందేశం పంపినా, ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ వినియోగించినప్పుడు వాహనం దారితప్పి వెళుతున్నా.. పోలీసులతో పాటు, ఈ ఐదు నంబర్లకూ సందేశం వెళుతుంది.
  6. ఆపదలో ఉన్నవారు యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కగానే.. ఆ సమాచారాన్ని వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌కి, అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీసు రక్షక వాహనాలకు కంట్రోల్‌ రూం నుంచి ఆటోమేటిక్‌ కాల్‌ డిస్పాచ్‌ విధానంలో పంపిస్తారు.
  7. జీపీఎస్‌ అమర్చిన పోలీసు రక్షణ వాహనాల్లో ‘మొబైల్‌ డాటా టెర్మినల్‌’ ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి ఆ సందేశం వచ్చిన ప్రాంతం వరకు రూట్‌ మ్యాప్‌ అందులో కనిపిస్తుంది. దాన్ని అనుసరించి ఆ వాహనం ఆ ప్రదేశానికి చేరుకోవచ్చు.
  8. ఈ యాప్‌ ద్వారా 100/112 నంబర్లకూ సహాయం కోసం ఫోన్‌ చేయవచ్చు.
  9. యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీసుస్టేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి.
  10. ఈ యాప్‌ని ప్రధానంగా మహిళల కోసమే ఉద్దేశించినా, ఆపదలో ఉన్న వృద్ధులూ దీన్ని ఉపయోగించవచ్చు.
  11. వైద్యసేవలు అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా దగ్గర్లోని మెటర్నిటీ, ట్రామా కేర్‌ సెంటర్లు, ఇతర ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీలు వంటి వాటి వివరాలు తెలుసుకోవచ్చు.
  12. ఇంకా ఈ యాప్‌లో సమీపంలోని సురక్షిత ప్రదేశాల వివరాలు, బాధితులు ఉన్న ప్రదేశం నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్లకు, సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు మార్గసూచి (నావిగేషన్‌)లు, పోలీసు డైరెక్టరీ, అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేయాల్సిన నంబర్లు, సామాజిక మాధ్యమాలు, రోడ్డు భద్రత వంటి ఆప్షన్లు పొందుపరిచారు.
Last Updated : Feb 10, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.