ETV Bharat / jagte-raho

ఖాతాలో ఎంతున్నా.. చేసేస్తారు సున్నా!

author img

By

Published : Dec 29, 2020, 2:22 PM IST

SRA1
SRA1

తలుపులు బద్దలు కొట్టాల్సిన పనిలేదు.. తాళాలు పగలగొట్టాల్సిన అవసరమే రాదు. అసలు కాలు బయట పెట్టకుండానే కావాల్సినంత దోచుకునే వెసులుబాటు. అందుకే సైబర్‌ నేరగాళ్లు చెలరేగుతున్నారు. కాస్త కంప్యూటర్‌ జ్ఞానంతో... నాలుగు మాయమాటలు చెప్పగలిగే నేర్పుతో... సరిహద్దులతో సంబంధం లేకుండా బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టేస్తున్నారు. 2020లో దేశంలో రూ.లక్ష కోట్లకుపైగా సైబర్‌ మోసగాళ్లు దోచుకున్నట్లు అంచనా. బ్యాంకులు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని జనమూ సైబర్‌ నేరాల బారిన పడుతున్నారు. అంతర్జాల వాడకంతో పాటు కేటుగాళ్ల పరిధీ పెరుగుతోంది. వారికి చిక్కకుండా మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందామా...

క్రెడిట్‌కార్డు, సిమ్‌కార్డుల క్లోనింగ్‌ దశలను దాటిపోయిన నేరగాళ్లు వాయిస్‌ క్లోనింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల ఇంగ్లండులో ప్రముఖ సంస్థకు చెందిన సీఈవో గొంతు క్లోనింగ్‌ చేశారు. అచ్చం ఆయనలా మాట్లాడి ఫలానా సంస్థకు బకాయిలు చెల్లించాలని చెబుతూ అకౌంట్‌్్స విభాగాధిపతిని బురిడీ కొట్టించి, రూ.కోట్లు కొల్లగొట్టారు. డబ్బు బదిలీ చేసిన సిబ్బంది ఆ తర్వాత విషయం తెలిసి నివ్వెరపోయారు. వ్యాపార సంస్థలే లక్ష్యంగా ఈ తరహా మోసాలు సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో కుమారుడు మాట్లాడుతున్నట్లు తండ్రికి ఫోన్‌ చేసి డబ్బు పంపాలని అడగొచ్చు. ఇప్పటికే ప్రముఖుల పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి పెద్దమొత్తంలో అప్పులు వసూలు చేస్తున్న ఉదంతాలు నమోదవుతున్నాయి...

అడగ్గానే చేయొద్దు

  • కుటుంబసభ్యులైనా, కార్యాలయ సిబ్బంది అయినా ఫోన్లో డబ్బు అడగ్గానే బదిలీ చేయవద్దు. మళ్లీ ఒకసారి వారి నంబర్లకు ఫోన్‌ చేసి నిర్ధారించుకోవాలి.
  • ఫోన్‌లో వచ్చిన ఆదేశాలు, విజ్ఞప్తుల ఆధారంగా పెద్దమొత్తంలో నిధులు అసలే పంపొద్దు.

బహుమతి వచ్చిందంటూ...

బహుమతి వచ్చిందంటూ...

హుమతి వచ్చిందని ఈమెయిల్‌ ద్వారా చేసే మోసం పిషింగ్‌. ఇదే తరహాలో ఫోన్‌ చేసి మోసగిస్తే విషింగ్‌. ఇప్పుడు కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది.. అదే స్మిషింగ్‌. ఈ పద్ధతిలో క్రెడిట్‌కార్డు రివార్డు పాయింట్లు పొందాలంటే ఈ దిగువ లింక్‌ను క్లిక్‌ చేయాలని సంక్షిప్త సందేశం వస్తుంది. ఆశతో దాన్ని క్లిక్‌ చేస్తే... తెరపై చిన్న పట్టిక కనిపిస్తుంది. క్రెడిట్‌కార్డు నంబరు, వినియోగదారుడి పేరు, కార్డు గడువు ముగిసే తేదీ, సీవీవీ నంబరు పేర్కొనాలని, అప్పుడే పాయింట్లు వస్తాయని సందేశం కనిపిస్తుంది. అన్నీ నమోదు చేశాక మీకు ఒక పిన్‌ నంబరు వస్తుందని, దాన్ని కస్టమర్‌కేర్‌ నుంచి ఫోన్‌ చేసే వారికి చెప్పాలని అప్పుడే పాయింట్లు వస్తాయని సందేశం కనిపిస్తుంది. రివార్డు పాయింట్ల ఆశతో ఉచ్చులో పడితే మీ క్రెడిట్‌కార్డు ఖాళీ అవుతుంది.

వివరాలు నింపొద్దు

  • రివార్డు పాయింట్ల కోసం ఏ బ్యాంకూ లింకులు పంపదు.
  • ఒకవేళ ఎవరైనా లింకులు పంపినా ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్‌, డెబిట్‌కార్డు వివరాలు నింపొద్దు.
  • సీవీవీ నంబరును ఎవరితోనూ పంచుకోకూడదు.
  • పిన్‌ నంబర్‌ వినియోగదారుడి సొంతం. దాన్ని ఎవరికీ చెప్పకూడదు.

ఖాతా మార్చి... ఏమార్చి..

ఖాతా మార్చి... ఏమార్చి..

వ్యాపార సంస్థకు, దానికి సరకు సరఫరా చేసే డీలర్ల సమాచారాన్ని చౌర్యం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. తొలుత డీలర్‌ మెయిల్‌లోకి చొరబడి... సరకు కొనుగోలు చేసిన సంస్థకు ఈమెయిల్‌ పంపుతారు. అనివార్య కారణాల వల్ల బ్యాంకు ఖాతా మార్చుకున్నామని, తమకు రావాల్సిన బకాయిని కొత్త ఖాతాకు బదిలీ చేయాలని అందులో పేర్కొంటారు. తమకు తెలిసిన డీలర్‌ ఈమెయిల్‌ చిరునామా నుంచే మెయిల్‌ రావడంతో సంస్థ సిబ్బంది నిజమేనని నమ్మి.. ఆ మేరకు కొత్త ఖాతాకు నగదు బదిలీ చేసి మోసపోతున్నారు.

కంప్యూటర్లు జాగ్రత్త...

  • వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు తమ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు అత్యంత భద్రంగా చూసుకోవాలి.
  • సమాచార చౌర్యానికి పాల్పడే యాప్‌లు ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే కీలక సమాచారం దొంగలపాలైనట్లే.
  • నగదు లావాదేవీలను ఇరు వర్గాలూ ఫోన్‌లో సంప్రదించుకుని నిర్ధారణ చేసుకోవాలి.

కేవైసీ.. ఓ వరం

కేవైసీ.. ఓ వరం

ఖాతాదారుడి గురించి తెలుసుకునేందుకు బ్యాంకులు పాటిస్తున్న కేవైసీ నిబంధన సైబర్‌ నేరగాళ్లకు వరమైంది. వినియోగదారులకు ఫోన్‌ చేసి, కేవైసీ వివరాలు నమోదు చేయాలని, లేకపోతే వాలెట్‌ సేవలు నిలిపివేస్తామంటారు. వివరాలు నమోదుకు లింకు పంపుతారు. దాన్ని తెరవగానే టీంవ్యూయర్‌, ఎనీడెస్క్‌ వంటి సాఫ్ట్‌వేర్‌లు లోడ్‌ అవుతాయి. ఆ క్షణం నుంచి మీ ఫోన్‌ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లినట్లే. కేవైసీ అప్‌డేట్‌ పేరుతో డెబిట్‌/క్రెడిట్‌కార్డు నంబర్లతోపాటు సీవీవీ నంబర్‌నూ నమోదు చేయాలంటారు. అప్పటికే బాధితుల ఫోన్‌ నేరగాళ్ల ఆధీనంలో ఉంటుంది కాబట్టి దానికి వచ్చే ఓటీపీలు వారికి కనిపిస్తుంటాయి. వాటిద్వారా ఖాతాల్లోని డబ్బులను దోచేస్తారు.

చెప్పాల్సిన పనిలేదు

  • ఏ బ్యాంకూ ఆన్‌లైన్లో కేవైసీ వివరాలు అడగదు.
  • కేవైసీ వివరాల నమోదుకు డెబిట్‌/క్రెడిట్‌కార్డు వివరాలు అవసరం లేదు.

కొంటామంటూ కొట్టేస్తారు

కొంటామంటూ కొట్టేస్తారు

వాహనం అమ్ముతాం అని ఆన్‌లైన్‌లో ప్రకటన పెట్టగానే సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేస్తారు. తాము కొంటామంటారు. వాహనం ఆర్సీ, యజమాని ఆధార్‌కార్డు వంటివి పంపాలని కోరతాడు. ఆ తర్వాత ఓ రూ.10 వేలు అడ్వాన్సు ఇస్తున్నానంటూ నేరగాడు ఒక క్యూఆర్‌ కోడ్‌ పంపుతాడు. దాన్ని తెరిస్తే డబ్బు జమ అవుతుందంటాడు. అమ్మకందారు ఆ క్యూఆర్‌కోడ్‌ తెరవగానే ‘లావాదేవీ కొనసాగించాలా?’ అని అడుగుతుంది. డబ్బు జమ అవుతుంది కదా అని వాహనం యజమాని సరే అంటాడు. ఆ వెంటనే అతని ఫోన్‌లో ఉన్న యూపీఐ యాప్‌ ద్వారా రూ.10 వేలు సైబర్‌ నేరగాడి ఖాతాలో జమ అవుతాయి. ఆ విషయం సైబర్‌ నేరగాడికి చెబితే, పొరపాటు జరిగిందని, ఆ రూ.10 వేలకు మరో రూ.10 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇస్తానని చెబుతూ మరో క్యూఆర్‌కోడ్‌ పంపుతాడు. దాన్ని తెరిస్తే మరో రూ.20 వేలు గల్లంతయినట్లే. ఈ కథ అంతటితో ముగిసిపోదు. వాహనం ఆర్సీ, ఆధార్‌కార్డు వివరాలతో మరో మోసానికి తెరలేపుతాడు.

తొందర పడొద్దు

  • వాడిన వస్తువులు అమ్మే ప్రకటనలను ఆన్‌లైన్‌లో చూసి తొందరపడొద్దు.
  • వస్తువు అమ్ముకునేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. డబ్బు చెల్లిస్తున్నామని చెబుతూ ఎవరైనా క్యూఆర్‌కోడ్‌ పంపితే తెరవొద్దు.

అప్రమత్తతతోనే అడ్డుకట్ట

- పెండ్యాల కృష్ణశాస్త్రి, సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడు

సైబర్‌ నేరగాళ్ల బారినపడి వ్యక్తులే కాదు పెద్దపెద్ద సంస్థలు, బ్యాంకులూ భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ ముఠాలూ తయారయ్యాయి. వీరి నుంచి తమను తాము కాపాడుకోవాలంటే ఎవరికివారు జాగ్రత్తగా ఉండాల్సిందే. సైబర్‌ భద్రతపై అవగాహన పెంచుకోవాలి. డబ్బు లావాదేవీలకు సంబంధించి ప్రతి విషయాన్నీ ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి. వ్యక్తులైతే తమ బ్యాంకు వివరాల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దు.

ఇదీ చూడండి: దేశంలో ఆరుగురికి కొత్త రకం వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.