ETV Bharat / international

రిషికి ఇక కష్టమే.. 10శాతానికి పడిపోయిన విజయావకాశాలు

author img

By

Published : Jul 30, 2022, 5:43 PM IST

UK PRESIDENT SURVEY: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్ విజయావకాశాలు 10శాతానికి పడిపోయాయి. ఆయనతో పాటు పోటీలో ఉన్న మరో అభ్యర్థి లిజ్ ట్రస్​కు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

UK PREZ SURVEY
UK PREZ SURVEY

UK NEW PRESIDENT: బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ల మధ్య పోరు దాదాపు తుది దశకు చేరుకుంది. వచ్చేవారం నుంచి పార్టీ ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు పంపిణీ కానున్నాయి. అయితే తదుపరి ప్రధానిగా సునాక్‌ కంటే లిజ్‌ ట్రస్‌కు అవకాశాలు గణనీయంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పోటీలో గెలుపు 90శాతం ఆమెనే వరించే అవకాశాలున్నాయని స్థానిక బెట్టింగ్ ఎక్స్ఛేంజ్‌ సంస్థ స్మార్కెట్స్‌ అంచనా వేసింది.

RISHI SUNAK UK PM RACE: "ప్రధాని రేసులో ఫైనల్‌గా వీరిద్దరూ(సునాక్, ట్రస్) మిగిలినప్పుడు ట్రస్‌కు విజయావకాశాలు 60-40గా ఉన్నాయి. అయితే ఆ తర్వాత పరిణామాలు ఆమెకు అనుకూలంగా మారుతూ వచ్చాయి. పోటీ మొదలైనప్పటి నుంచి రిషి సునాక్‌ గెలుస్తారని చాలా మంది అంచనా వేశారు. అయితే డిబేట్లలో ట్రస్‌ ప్రసంగాలు ఈ అంచనాలను అధిగమించాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ట్రస్‌కు 90శాతం విజయావకాశాలు ఉండగా.. సునాక్‌ గెలుపు అవకాశాలు 10శాతానికి తగ్గాయి" అని స్మార్కెట్స్‌ పొలిటికల్‌ మార్కెట్స్‌ హెడ్‌ మాథ్యూ షాడిక్‌ తెలిపారు.

పలు వివాదాల్లో కూరుకుపోయిన బోరిస్‌ జాన్సన్‌ ఈ నెల 7వ తేదీని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ప్రక్రియ చేపట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి, తద్వారా ప్రధాని పదవికి ఎన్నిక మొదలవ్వగా.. ఇందుకోసం తొలుత 11 మంది పోటీ పడ్డారు. అనేక రౌండ్ల అనంతరం తుది రేసులో మాజీ ఆర్థిక మంత్రి సునాక్‌, మాజీ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ నిలిచారు.

కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలతోపాటు సభ్యుల మద్దతునూ చూరగొన్నవారే పార్టీ అధ్యక్షులుగా, ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ఈ క్రమంలోనే టోరీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వీరిద్దరు ఆరువారాల దేశ పర్యటన ప్రారంభించారు. ఇప్పటికే పలు నగరాల్లో సునాక్‌, ట్రస్‌లు టోరీ ఓటర్లతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. వచ్చేవారం నుంచి టోరీ సభ్యులకు బ్యాలెట్ పేపర్లు పంపిణీ కానున్నాయి. సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 5న ఫలితాలు వెలువడుతాయి.

ప్రస్తుతం అర్హులైన కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల సంఖ్య దాదాపు 1,75,000గా ఉంది. పార్టీలో ఎంపీల మద్దతు సునాక్‌కు ఉన్నప్పటికీ.. సభ్యుల్లో ఎక్కువ మంది లిజ్‌ ట్రస్‌వైపు మొగ్గుచూపుతున్నట్లు పలు అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ, ఈ పోటీలో రిషీ సునాక్‌ విజయం సాధిస్తే యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి భారత సంతతి వ్యక్తిగా అరుదైన ఘనత సాధిస్తారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.