ETV Bharat / international

చైనా దాడులను తిప్పికొట్టేందుకు తైవాన్​ నయా ప్లాన్​!.. రంగంలోకి కొత్త జలాంతర్గామి!

author img

By

Published : Apr 23, 2023, 3:36 PM IST

పక్కలో బల్లెంలా తయారైన చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్‌ అధునాతన ఆయుధాల తయారీ, నూతన రక్షణ మార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా మానవ రహిత జలంతర్గామి నిర్మాణం చేపట్టింది. ఇది చైనా దాడుల నుంచి తైవాన్‌ను కాపాడగలదని నిపుణులు అంటున్నారు. ప్రత్యర్థుల జలాంతర్గాముల కంటే దీని నిర్మాణ వ్యయం చాలా తక్కువని మానవరహిత జలంతర్గామి తయారీ కంపెనీ థండర్‌ టైగర్‌ గ్రూప్‌ ప్రకటించింది.

taiwan new submarine Seawolf 400 against china
చైనా కుయుక్తులను తిప్పికొట్టేందుకు తైవాన్ కొత్త సీవోల్ఫ్‌ 400 జలాంతర్గామి

పొరుగుదేశం చైనా నుంచి రోజురోజుకు దాడుల ముప్పు పెరుగుతుండటం వల్ల తైవాన్‌ కొత్తరక్షణ మార్గాలపై దృష్టి సారించింది. ఈనెల ఆరంభంలో తైవాన్‌ జలసంధిలో డ్రాగన్‌ విస్తృత స్థాయి వైమానిక, నౌకా దళ విన్యాసాలు నిర్వహించింది. ఈనెల 5న తైవాన్ అధ్యక్షురాలు త్సాయి-ఇంగ్‌ వెన్‌ కాలిఫోర్నియాలో అమెరికా ప్రతినిధులసభ స్పీకర్‌తో భేటీకి ప్రతీకారచర్యగా డ్రాగన్‌ సైనిక విన్యాసాలు చేపట్టింది. తైవాన్‌ పాలకులు, వారి విదేశీ మద్దతుదారులకు తీవ్ర హెచ్చరిక చేసేందుకే ఈ విన్యాసాలు నిర్వహించినట్లు చైనా బహిరంగంగా ఓ ప్రకటన చేసింది.

భవిష్యత్తులో చైనా నుంచి తీవ్రమైన సంఘర్షణ ఎదురయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన తైవాన్‌ నూతన ఆయుధాల తయారీ, కొత్త రక్షణ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తైచుంగ్‌ నగరానికి చెందిన థండర్‌ టైగర్‌ గ్రూప్‌ మానవరహిత జలాంతర్గామిని తయారుచేస్తోంది. సైనిక సంఘర్షణ సమయాల్లో అది ఆత్మాహుతి జలాంతర్గామిగా మారనుంది. ఈ జలాంతర్గామికి సీవోల్ఫ్‌-400 అంటే సముద్రతోడేలుగా నామకరణం చేశారు. రేడియే నియంత్రిత యుద్ధ విమానాలను తయారుచేసిన థండర్‌ టైగర్‌ గ్రూప్‌ ఈ జలాంతర్గామిని నిర్మిస్తోంది. సుమారు దశాబ్దం క్రితం నుంచి సబ్‌మెర్సిబుల్‌ను అభివృద్ధి చేసేందుకు వనరుల సమీకరణలో నిమగ్నమైంది.

తైవాన్‌ జలసంధి ఉద్రిక్తతల నేపథ్యంలో సీవోల్ఫ్-400 ప్రోటోటైప్ జలాంతర్గామిని తయారు చేస్తున్న థండర్‌ టైగర్‌ గ్రూప్‌ క్రమంగా రక్షణ విపణిలోకి ప్రవేశించింది. ప్రపంచ రాజకీయాల్లో వర్తమాన పరిస్థితులు, క్రాస్‌ స్ట్రెయిట్‌ సంబంధాల అవసరాలకోసం తయారు చేస్తున్నట్లు థండర్‌ టైగర్‌ గ్రూప్‌ పరిశోధన, అభివృద్ధి విభాగం తెలిపింది. బలమైన మిలిటరీ అవసరాల కోసం ఈ జలాంతర్గామిని తయారుచేస్తున్నట్లు పేర్కొంది. పౌరుల వినియోగానికి కూడా ఉపయోగపడేలా ప్రణాళిక చేస్తున్నట్లు థండర్‌ టైగర్‌ గ్రూప్‌ ప్రకటించింది.

ఖర్చు తక్కువ.. ప్రభావం ఎక్కువ..!
కొన్నిసంవత్సరాలుగా చైనా నుంచి తైవాన్‌పై సైనిక ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. ద్వీప దేశంవైపు యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను పంపుతోంది. గత ఆగస్టులో అమెరికా ప్రతినిధుల సభ అప్పటి స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించటం వల్ల దశాబ్దాల నుంచి అనధికారిక సరిహద్దుగా ఆమోదం పొందిన తైవాన్‌ జలసంధి మధ్యరేఖపైకి చైనా భారీగా యుద్ధ నౌకలను పంపింది. ఈ జలాంతర్గామి తయారీకి తైవాన్‌ ప్రభుత్వంతోపాటు భావసారూప్యం కలిగిన దేశాలు సాయం అందిస్తునట్లు థండర్‌ టైగర్‌ గ్రూప్‌ తెలిపింది. ప్రత్యర్థుల జలాంతర్గాముల తయారీకి వందల కోట్ల డాలర్లు వ్యయం కానుండగా తాము తయారు చేస్తున్న ఈ చిన్న జలాంతర్గామి ఖర్చు చాలా తక్కువని పేర్కొంది. కానీ శత్రువును సమర్థంగా నియంత్రించగలదని థండర్‌ టైగర్‌ గ్రూప్‌ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.