ETV Bharat / international

పుతిన్ ఆక్రమణ యత్నాలకు గండి.. రష్యాపై గెరిల్లా దళాల పోరు!

author img

By

Published : Aug 10, 2022, 7:36 AM IST

Russia Ukraine guerilla warfare: ఉక్రెయిన్​లోని తూర్పు ప్రాంతాన్ని తమలో కలిపేసుకోవాలన్న రష్యా ప్రయత్నాలు ఫలించడం లేదు. గెరిల్లా దళాలు రష్యాను ముప్పతిప్పలు పెడుతున్నాయి. రష్యా అనుకూల అధికారులను హత్య చేస్తున్నాయి. అదేసమయంలో ఉక్రెయిన్ సైన్యానికి కీలక సమాచారం అందించి.. గురి తప్పకుండా దాడి చేసేలా పురిగొల్పుతున్నాయి.

RUSSIA UKRAINE WAR
RUSSIA UKRAINE WAR

Russia Ukraine guerilla warfare: తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాన్ని కలిపేసుకోవాలన్న రష్యా ప్రయత్నాలకు గెరిల్లా దళాలు గండికొడుతున్నాయి. రష్యాలో ఆ ప్రాంత విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని పుతిన్‌ సర్కారు సన్నాహాలు చేస్తుండగా.. ఉక్రెయిన్‌ గెరిల్లా దళాలు ఆక్రమిత ప్రాంతాల్లోని రష్యా అనుకూల అధికారులను హతమారుస్తున్నాయి. వంతెనలు, రైళ్లను పేల్చేస్తున్నాయి. రష్యన్ల విలీనయత్నాలను భగ్నం చేయడమే తమ లక్ష్యమని యెల్లో రిబ్బన్‌ గెరిల్లా గ్రూపునకు చెందిన 32 ఏళ్ల ఆంద్రీ చెప్పాడు.

RUSSIA UKRAINE WAR: ఉక్రెయిన్‌ జాతీయ పతాకంలోని పసుపు, నీలి రంగులతో రెండు గెరిల్లా గ్రూపులు అవతరించాయి. వాటిని యెల్లో, బ్లూ రిబ్బన్‌ గ్రూపులుగా వ్యవహరిస్తున్నారు. రష్యా ఆక్రమించిన ఖెర్సన్‌ నగరంలోని 5 లక్షల మంది ప్రజలకు యెల్లో రిబ్బన్‌ గెరిల్లా దళ సభ్యులు పంచిన కరపత్రాల్లో రష్యా అనుకూల అధికారులను హతమారుస్తామని హెచ్చరించారు. ఆక్రమిత భూభాగంలో రష్యన్‌ స్థావరాల గురించి కచ్చితమైన సమాచారాన్ని ఉక్రెయిన్‌ సైన్యానికి అందిస్తూ.. వాటిపై గురి తప్పకుండా దాడిచేసేలా పురిగొల్పుతున్నారు. ఈ సమాచారంతోనే ఉక్రెయిన్‌.. అమెరికన్‌ హైమార్స్‌ రాకెట్లను ప్రయోగించి ద్నీపర్‌ నది మీద ఒక వంతెనకు భారీ నష్టం కలిగించింది.

Guerrilla war in Ukraine: ఉక్రెయిన్‌ ప్రత్యేక దళాలకు సహకరిస్తూ గెరిల్లాలు రహస్య ఆయుధ డిపోలు, ఆశ్రయ స్థలాలను ఏర్పరుస్తున్నాయి. రష్యన్లపై ఎలా దాడులు చేయాలో నేర్పే వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. ఆక్రమిత ప్రాంతాల్లో పోలీసు వాహనాలపై దాడులు చేస్తున్నాయి. ఖెర్సన్‌ ప్రాంతంలో తాత్కాలిక పాలనాధికారి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్లాదిమిర్‌ సాల్డోను చంపడానికి పలుమార్లు ఈ దళాలు ప్రయత్నించాయి. అతన్ని హతమారిస్తే 25,000 డాలర్ల నగదు బహుమానం ఇస్తామని కూడా ప్రకటించాయి. సాల్డో సహాయకుడిని కూడా గెరిల్లాలు హతమార్చాయి.

వీరిని అణచివేయడానికి రష్యా గెరిల్లా వ్యతిరేక దళాలను పంపిందని సాల్డో తెలిపారు. ఆ దళాలు రోజుకు రెండు మూడు అక్రమ ఆయుధ భాండారాలను కనుగొంటున్నాయని చెప్పారు. ఆయుధాలు పట్టుబడుతున్న కొద్దీ గెరిల్లా కార్యకలాపాలు తగ్గిపోతాయన్నారు. మరోవైపు ఆక్రమిత ప్రాంతాల్లోని ఉక్రెయిన్‌ ప్రజలు రష్యా పౌరసత్వం పొందితే లక్ష రూబుళ్లు ఇస్తామని రష్యన్లు ప్రకటిస్తున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా తన కరెన్సీ రూబుల్‌ను ప్రవేశపెట్టింది. స్థానిక సెల్యూలర్‌ నెట్‌వర్కుల స్థానంలో రష్యన్‌ నెట్‌వర్కులను ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌ టీవీ ఛానళ్లను బంద్‌ చేసి రష్యా టీవీ ప్రసారాలను అందిస్తోంది. కాగా గెరిల్లాల పనిపట్టడానికి రష్యన్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

క్రిమియాలో రష్యా వాయుసేన కేంద్రంపై దాడి
క్రిమియాలో రష్యా అధీనంలోని సాకీ వైమానిక స్థావరంపై మంగళవారం ఉక్రెయిన్‌ దాడి చేసింది. ఈ ఘటనలో అయిదుగురు గాయపడినట్లు సమాచారం. అయితే స్థావరానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, మందుగుండు డిపో మాత్రం పేలిపోయిందని రష్యన్‌ రక్షణ శాఖ తెలిపింది. రష్యన్‌ యుద్ద విమానాలు దక్షిణ ఉక్రెయిన్‌పై సాకీ స్థావరం నుంచే దాడులు చేస్తుంటాయి. ఈ స్థావరంపై ఉక్రెయిన్‌ క్షిపణులతో దాడి చేసిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు రాగా.. ఉక్రెయిన్‌ అధికారులు సాధికారికంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. క్రిమియాపై దాడిచేస్తే కీవ్‌ నగరంలోని అధికార కేంద్రాలపై తీవ్ర ఎదురుదాడి చేస్తామని రష్యా హెచ్చరిస్తూ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.