ETV Bharat / international

ఆ దేశాల సంగతి చూద్దాం అంటూ పుతిన్, కిమ్​ ప్రేమ లేఖలు

author img

By

Published : Aug 16, 2022, 7:34 AM IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పరస్పరం లేఖలు రాసుకున్నారు. శత్రు దేశాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొందామని తీర్మానించారు.

putin kim jong un
ఆ దేశాల సంగతి చూద్దాం అంటూ పుతిన్, కిమ్​ ప్రేమ లేఖలు

Russia North Korea relations 2022 : ఉమ్మడి ప్రయత్నాలతో రష్యా, ఉత్తర కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు ఆయన లేఖ రాశారు. కొరియా విమోచన దినోత్సవం సందర్భంగా రాసిన ఈ లేఖలో.. 'ఇరు దేశాల ప్రయోజనాలు కోరి సన్నిహిత సంబంధాలు కొనసాగిద్దాం. కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియా ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో ఇవి సహాయపడతాయి' అని పేర్కొన్నారు.

Kim Jong Un Putin news : ఈ క్రమంలోనే కిమ్‌ సైతం లేఖ రూపంలో స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిన జపాన్‌పై విజయంతో రష్యా- ఉత్తర కొరియా మధ్య స్నేహం ఏర్పడిందని గుర్తుచేశారు. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. శత్రు దేశాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా ప్రకటించిన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ స్వతంత్ర రాష్ట్రాలను ఉత్తర కొరియా గుర్తించిన విషయం తెలిసిందే.

ఆధునిక ఆయుధాల ఎగుమతులకు సై..
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో మాస్కో తన సంబంధాలకు విలువనిస్తుందని పుతిన్‌ పేర్కొన్నారు. మిత్రదేశాలకు ఆధునిక ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మాస్కో సమీపంలో 'ఆర్మీ-2022' పేరిట ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శనను పుతిన్‌ ప్రారంభించి ప్రసంగించారు. రష్యా అధునాతన ఆయుధ సామర్థ్యాలను ప్రస్తావిస్తూ.. వాటి సాంకేతికతను పంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. 'మా మిత్రదేశాలకు చిన్నపాటి ఆయుధాల నుంచి ఫిరంగులు, యుద్ధ విమానాల వరకు అత్యంత అధునాతన ఆయుధాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం' అని అన్నారు. అయితే.. ఉక్రెయిన్‌లో రష్యన్‌ ఆయుధాల పేలవ ప్రదర్శన దాని ఆయుధ ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పాశ్చాత్య సైనికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.