ETV Bharat / international

'రష్యా దళాల మందగమనం.. యుద్ధంలో ఉక్రెయిన్​దే విజయం!'

author img

By

Published : May 15, 2022, 10:08 PM IST

Russia Ukraine War: రష్యా చేస్తున్న యుద్ధం వారి ప్రణాళిక ప్రకారం సాగడం లేదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, నాటోలో చేరే విషయమై ఫిన్లాండ్, స్వీడన్ వేగంగా అడుగులు వేస్తున్నాయి.

Russia faces stall in Ukraine
Russia faces stall in Ukraine

Russia Ukraine War: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్ పేర్కొన్నారు. రష్యా చేస్తున్న యుద్ధం వారి ప్రణాళికలకు అనుగుణంగా సాగడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్​కు నాటో కూటమి సాయం కొనసాగించాలని అన్నారు.

russia ukraine news: మరోవైపు, నాటోలో చేరాలని ఫిన్లాండ్ ఇదివరకే నిర్ణయం తీసుకోగా.. ఈ విషయంపై చర్చించేందుకు కూటమి నేతలతో బెర్లిన్​లో సమావేశం కానుంది. స్వీడన్ సైతం నాటోలో చేరనున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ.. నాటోలో చేరేందుకు మొగ్గు చూపింది. ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఈ రెండు దేశాలు.. రష్యా దురాక్రమణ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తమ దేశ రక్షణ కోసం నాటోను ఆశ్రయిస్తున్నాయి. ఇది రష్యాను తీవ్రంగా కలిచివేసే అవకాశం ఉంది. నాటో తూర్పువైపు విస్తరిస్తూ తమ దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమిస్తోందన్న ఆరోపణలతోనే ఉక్రెయిన్​పై దండెత్తారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు జరుగుతుండటం గమనార్హం. అయితే, నాటో మాత్రం తమది దురాక్రమణ కూటమి కాదని, రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కూటమేనని చెబుతోంది.

మరోవైపు, ఉక్రెయిన్​లో రష్యా యుద్ధం నెమ్మదించింది. రష్యా దళాలను దీటుగా ఎదుర్కొంటున్నామని ఉక్రెయిన్ ఆదివారం ప్రకటించింది. ఒక్కో అడుగు వేస్తూ దురాక్రమణదారులను వెనక్కి తరిమేస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్​స్కీ పేర్కొన్నారు.

టర్కీ వ్యతిరేకం...: ఇదిలా ఉండగా.. నాటోలో చేరాలనుకుంటున్న స్వీడన్, ఫిన్లాండ్​ దేశాలకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ షాక్ ఇచ్చారు. ఆ దేశాల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రెండు దేశాలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్నాయని ఆరోపించిన ఆయన.. వాటి చేరికపై తమ దేశానికి సానుకూల అభిప్రాయం లేదన్నారు. ఒక దేశం.. నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. ముందుగా కూటమిలోని 30 సభ్యత్వ దేశాలు దానికి అధికారిక ఆహ్వానాన్ని అందించేందుకు ఏకగ్రీవంగా అంగీకరించాలి. అనంతరం.. సభ్యత్వంపై చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత.. సభ్య దేశాలు తుది నిర్ణయాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. నాటో సభ్య దేశమైన టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ మేరకు అసమ్మతి గళాన్ని వినిపించిన మొదటి దేశం టర్కీనే.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.