యుద్ధం మళ్లీ మొదలు- గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

author img

By PTI

Published : Dec 1, 2023, 12:49 PM IST

Israel Hamas Ceasefire Expires

Israel Hamas Ceasefire Expires : వారంరోజుల కాల్పుల విరమణ తర్వాత గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. హమాస్‌ స్థావరాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో దాడులు ప్రారంభించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్‌ ఉల్లంఘించినట్లు ఆరోపించింది. గాజా నుంచి తమ భూభాగంపై రాకెట్‌ దాడులు జరిగినట్లు పేర్కొంది. మరోవైపు.. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ వందమందికిపైగా బందీలను వదిలిపెట్టగా.. ఇజ్రాయెల్‌ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

Israel Hamas Ceasefire Expires : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియటం వల్ల శుక్రవారం ఉదయం గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. హమాస్‌ను నిర్మూలించాలన్న తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు.. దాడులు పునరుద్ధరిస్తామన్న ప్రకటించిన ఇజ్రాయెల్‌ ఉదయం 7గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిన అరగంట తర్వాత దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ తెలిపింది. ఖాన్‌ యూనిస్ పట్టణానికి తూర్పున ఉన్న అబాసాన్ కమ్యూనిటీసహా దక్షిణ గాజాపై వైమానిక దాడులు జరిగినట్లు.. హమాస్ అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. గాజా నగరానికి వాయవ్యంగా ఉన్న ఓ నివాసంపై కూడా దాడి జరిగినట్లు పేర్కొంది.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్‌ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఒప్పందం సమయంలోనే గాజా నుంచి రాకెట్‌ దాడులు జరిగాయని పేర్కొంది. ఉత్తర గాజాలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, కాల్పుల చప్పుళ్లు వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. జెరూసలెంలో గురువారం ఉదయం ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు పాలస్తీనా సాయుధులు బస్టాప్‌లో ఉన్న వారిపై కాల్పులు జరపటం వల్ల ముగ్గురు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.

మరోవైపు.. కాల్పుల విరమణ చివరి రోజు తమ వద్ద ఉన్నబందీల్లో మరో 8 మందిని హమాస్‌ వదిలిపెట్టగా అందుకు బదులుగా ఇజ్రాయెల్‌ 30 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తెల్లవారుజామున గాజాస్ట్రిప్‌ చేరుకున్న పాలస్తీనా ఖైదీలకు.. స్థానికులు, వారి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. హమాస్‌ జెండాలను పట్టుకొని నినాదాలు చేశారు. గత నెల 24న ఇరువర్గాల మధ్య కుదిరిన వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా హమాస్‌ వంద మందికిపైగా బందీలను వదిలి పెట్టగా.. ఇజ్రాయెల్‌ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన మెరుపుదాడిలో 1200 మంది పౌరులు చనిపోయారు. హమాస్‌ మిలిటెంట్లు మరో 240 మందిని బందీలుగా పెట్టుకున్నారు. అందుకు ప్రతీకారంగా గాజా పట్టీపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక, భూతల దాడుల్లో 15వేల మంది చనిపోయారు. అందులో అత్యధికులు పౌరులే ఉన్నారు.

ఎన్నికల ముందు నవాజ్​ షరీఫ్​కు భారీ ఊరట- అవినీతి కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

వంట నూనె ఇంధనంగా - నింగిలోకి దూసుకెళ్లిన 'వర్జిన్ అట్లాంటిక్​' ఫ్లైట్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.