మళ్లీ పేలిన ఇండోనేసియా అగ్నిపర్వతం- 23కు చేరిన మృతుల సంఖ్య

author img

By PTI

Published : Dec 5, 2023, 1:57 PM IST

Merapi Volcano Eruption In Indonesia 2023

Indonesia Volcano Eruption Death Toll : ఇండోనేసియాలోని మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరుకుంది. సోమవారం మరో విస్ఫోటనం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Indonesia Volcano Eruption Death Toll : ఇండోనేసియాలోని పశ్చిమ ప్రాంతంలో సంభవించిన అగ్నిపర్వతం విస్ఫోటనం ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఘటన నుంచి స్థానికులు ఇంకా కోలుకోకముందే సోమవారం మరో విస్ఫోటనం సంభవించింది. దీని ధాటికి సుమారు 2,620 అడుగుల ఎత్తుకు బూడిద గాల్లోకి ఎగసిపడింది. దీంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. అయితే, తాజాగా లభ్యమైన మృతదేహాలు విస్ఫోటనం జరిగిన ప్రదేశానికి చాలా దూరంలో కనిపించాయని పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌ డిప్యూటీ పోలీస్​ చీఫ్​ ఏడీ మార్డియాంటో తెలిపారు.

సుమత్రా దీవిలో ఉన్న మౌంట్ మరాపిని పర్వతాన్ని అధిరోహించేందుకు శనివారం మెుత్తం 75 మంది పర్వతారోహకులు బయలుదేరారు. ఆదివారం వీరంతా ట్రెక్కింగ్‌ చేసే సమయంలో అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. భారీ స్థాయిలో జరిగిన విస్ఫోటనం ధాటికి 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. సమాచారం అందుకున్న యంత్రాంగం హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టింది. ఈ రెస్క్యూ ఆపరేషన్​లో 49 మందిని సహాయక సిబ్బంది కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

"పర్వతం విస్ఫోటనం ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరుకుంది. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలను పోస్ట్​మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. అయితే మిగిలిన వారు ఇంకా ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. వారి బాడీలను కూడా ఈరోజు లేదా రేపు గుర్తిస్తాం."
- ఏడీ మార్డియాంటో, సుమత్రా ప్రావిన్స్‌ డిప్యూటీ పోలీస్​ చీఫ్​

3వేల మీటర్ల ఎత్తుకు బూడిద..!
అగ్నిపర్వతం బద్దలైన నేపథ్యంలో మౌంట్ మరాపి సమీపంలోని పలు ప్రాంతాల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అగ్నిపర్వత ప్రాంతం వైపు వెళ్లకుండా నిషేధం విధించారు. మరోవైపు అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం చెందడం వల్ల ఆకాశంలో బూడిద ఎగిసి పడుతోంది. సమీప ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, ఇళ్లు, వాహనాలను బూడిద కప్పేసింది. ఇక విస్ఫోటనం ధూళి నుంచి రక్షణగా అధికారులు ప్రజలకు మాస్కులు, అద్దాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా మౌంట్ మరాపి సమీప గ్రామాలైన రుబాయి, గోబా కుమాంటియాంగ్‌లో నివసిస్తున్న దాదాపు 1400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
ఇక ఇండోనేసియాలో మెుత్తం 127 క్రీయాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ దేశం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ ప్రాంతంలో ఉండటం వల్ల తరచూ ఇక్కడ అగ్ని పర్వత విస్ఫోటనాలు, భూకంపాలు సంభవిస్తుంటాయి.

చెట్టును ఢీకొన్న బస్సు- 14 మంది మృతి- డ్రైవర్ నిద్రమత్తు వల్లే!

అగ్నిపర్వతం బద్దలు- కొండ పైకి ఎక్కుతూ 11మంది మృతి- 3వేల మీటర్ల ఎత్తుకు బూడిద!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.