ETV Bharat / international

రష్యా 'బంగారం'పై జీ-7 దేశాల బ్యాన్​.. భారత్​కు లాభమా?

author img

By

Published : Jun 26, 2022, 5:11 PM IST

Russian Gold Ban: రష్యా నుంచి ముడిచమురు దిగుమతులపై ఇప్పటికే నిషేధం విధించిన ఐరోపా సహా పలు దేశాలు ఇప్పుడు బంగారంపై దృష్టిసారించాయి. రష్యాను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే దిశగా అమెరికా, ఐరోపా దేశాలు.. రష్యా నుంచి బంగారం దిగుమతులను బ్యాన్​ చేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన మంగళవారం వచ్చే అవకాశముంది. మరోవైపు.. దాదాపు 3 వారాల అనంతరం కీవ్​పై రష్యా వరుస క్షిపణి దాడులు చేసింది. జీ-7 శిఖరాగ్ర సదస్సు జరుగుతుండగా పుతిన్​ సర్కార్​ దాడులు పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది.

G-7 to ban Russian gold in response to Ukraine war
G-7 to ban Russian gold in response to Ukraine war

Russian Gold Ban: ఉక్రెయిన్​పై యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా.. పెద్దన్న అమెరికా సహా ఐరోపా దేశాలు కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ దేశ చమురును కొనొద్దని చాలా రోజుల కిందటే పశ్చిమాసియా దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇది భారత్​కు ప్రయోజనం చేకూర్చింది. రష్యా డిస్కౌంట్​లో భారత్​కు చమురును విక్రయించింది.

ఇప్పుడు రష్యాను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాలని భావించిన జీ-7 దేశాలు.. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం భావించాలని చూస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఆదివారం వెల్లడించారు. ఆంక్షలకు సంబంధించి అధికారిక ప్రకటన మంగళవారం వచ్చే అవకాశం ఉంది.

రాయితీతో భారత్​కు లాభం: రష్యాపై ఆంక్షలతో.. సౌదీ సహా పలు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలతో ఇతర దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​కు చౌక ధరలకు చమురు విక్రయించింది వ్లాదిమిర్​ పుతిన్​ సర్కార్​. భారత ప్రభుత్వం ఫిబ్రవరి- మే మధ్య రష్యా నుంచి 40 మిలియన్‌ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. 2021లో వచ్చిన మొత్తం దిగుమతులతో పోలిస్తే ఇది 20 శాతం అధికం.
ఇప్పుడు రష్యా నుంచి బంగారం దిగుమతులపై కూడా ప్రపంచ దేశాలు నిషేధం విధిస్తే అది భారత్​కు ప్రయోజనం చేకూరుస్తుందా? లేదా? అని వ్యాపార నిపుణులు మాట్లాడుకుంటున్నారు.

మరోవైపు.. జీ-7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు.. ఉక్రెయిన్​ రాజధాని కీవ్​పై క్షిపణి దాడులతో విరుచుకుపడింది రష్యా. రెండు నివాస భవంతుల్ని కూల్చివేసినట్లు కీవ్​ మేయర్​ విటలీ క్లిట్స్కో తెలిపారు.
దాడులు మళ్లీ తీవ్రం: తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంపై గత కొన్ని రోజులుగా దృష్టిసారించిన రష్యా సేనలు మళ్లీ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై గురిపెట్టాయి. కీలకమైన డాన్‌బాస్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పుతిన్ సేనలు.. క్రమంగా పట్టు సాధించాయి.

ఫలితంగా మళ్లీ కీవ్‌పై క్షిపణులు ఎక్కుపెట్టాయి. కీవ్‌కు పశ్చిమాన గంటల వ్యవధిలోనే 14 క్షిపణులను రష్యా ప్రయోగించింది. ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రక్షణ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కీవ్‌పై ఈనెల 5 నుంచి దాడులు చేయని రష్యా సేనలు.. ఏకబిగిన 14 క్షిపణులు ప్రయోగించి దాడుల తీవ్రతను పెంచాయి.

తూర్పు ఉక్రెయిన్‌లోని కీలకమైన డాన్‌బాస్‌ ప్రాంతంలో మాస్కో సేనలు దాదాపుగా పట్టు సాధించాయి. ఈ ప్రాంతంలోని 2 ప్రావిన్సుల్లో ఒకటైన.. లుహాన్స్క్‌ను పుతిన్‌ సేనలు దాదాపు పూర్తిగా ఆక్రమించాయి. లుహాన్స్క్‌కు పరిపాలనా కేంద్రంగా ఉన్న సీవీరో దొనెట్స్క్‌పై పట్టు కోసం కొన్ని రోజులుగా భీకరంగా పోరాడుతున్న రష్యా ఎట్టకేలకు విజయం సాధించింది. సీవీరో దొనెట్స్క్‌ నగరం, దాని చుట్టుపక్కల గ్రామాలు తమ నియంత్రణలోకి వచ్చినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అజోట్ రసాయన కర్మాగారం నుంచి పోరాటం చేయాలన్న ఉక్రెయిన్ ప్రయత్నం విఫలమైందని పేర్కొంది. వారాల పాటు జరిగిన పోరు తర్వాత ఉక్రెయిన్ సేనలు సీవీరో దొనెట్స్క్‌ నుంచి వెనక్కి వెళ్తున్నట్లు లుహాన్స్ ప్రావిన్స్ గవర్నర్ చెప్పారు. సీవీరో దొనెట్స్క్‌ పొరుగు నగరం లిసిచాన్స్క్‌ నగరంపై రష్యా దృష్టిసారించిందని.. వివరించారు. దీర్ఘశ్రేణి TU-22 బాంబర్ల క్షిపణులను బెలారస్ నుంచి రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ తెలిపింది. లిసిచాన్స్క్‌ నగరంలో భీకర పోరు జరుగుతోందని రష్యా మీడియా తెలిపింది. ఈ విషయంపై ఉక్రెయిన్‌ నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరో ప్రావిన్సు దొనెట్స్క్‌లోనూ సగం భూభాగం మాస్కో వశమైనట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: సరిహద్దులో తొక్కిసలాట.. 23 మంది వలసదారుల దుర్మరణం

లీటర్ పెట్రోల్​పై రూ.50, డీజిల్​పై రూ.60 పెంపు.. లంకేయులపై మరో పిడుగు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.