ETV Bharat / international

బైడెన్​పై రష్యా ఆంక్షలు.. నాటో వైఖరి పట్ల జెలెన్​స్కీ అసంతృప్తి

author img

By

Published : Mar 15, 2022, 10:29 PM IST

Russia sanctions on Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్​లపై రష్యా ఆంక్షలు విధించింది. మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, నాటో వైఖరి పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యన్ ప్రముఖులపై బ్రిటన్ ఆంక్షల కొరడా ఝులిపించింది.

russia ukraine war
రష్యా ఉక్రెయిన్ వార్

Russia sanctions on Biden: ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు పలు దఫాలుగా కఠిన ఆంక్షలు విధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, ఇతర అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఆంక్షలు విధించినట్టు రష్యా మీడియా సంస్థ స్పుత్నిక్‌ పేర్కొంది.

zelensky warns nato:

రష్యా కట్టడి విషయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తదితర యూరోపియన్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నో-ఫ్లై జోన్‌ను అమలు చేయడానికి నిరాకరించినందుకుగానూ నాటో విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నాటో.. ప్రపంచంలో అత్యంత బలమైన కూటమి. అయితే, ఈ కూటమిలోని కొంతమంది సభ్యులు రష్యా దూకుడుతో హిప్నటైజ్ అయ్యారు' అని విమర్శించారు. నో ఫ్లై జోన్‌గా ప్రకటించకపోవడం.. రష్యన్ సైన్యానికి ఉక్రెయిన్‌లోని శాంతియుత నగరాలపై బాంబు దాడులకు అనుమతి కల్పిస్తోందని తెలిపారు.

ప్రస్తుతం తమ ప్రజలు.. నాటో కూటమి కంటే అంతర్జాతీయ భాగస్వాముల మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని అన్నారు. 'వాస్తవమే. ఉక్రెయిన్.. నాటో సభ్యత్వ దేశం కాదు. అందులో చేరలేమనీ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్‌ను రక్షించేందుకు భద్రతాపర హామీలు ఇవ్వాలి' అని వ్యాఖ్యానించారు. రష్యా సరిహద్దులోని ఇతర దేశాలు.. నాటో మినహాయించి తమ స్వతంత్ర రక్షణ సామర్థ్యాల గురించి ఆలోచించాలని అన్నారు. బ్రిటన్‌, ఇతర దేశాల నుంచి అందుతున్న ఆయుధ సరఫరాలు సరిపోవడం లేదని, ఫలితంగా రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలు, పాత సోవియట్ కాలం నాటి కిట్‌లను వినియోగించాల్సి వస్తోందని తెలిపారు. రష్యాపై పూర్తిస్థాయి వాణిజ్య ఆంక్షలకు పిలుపునిచ్చారు.

బ్రిటన్‌ ఆంక్షల కొరడా..

మరోవైపు, 370 మంది రష్యా ప్రముఖులు, సంస్థలే లక్ష్యంగా బ్రిటన్‌ మంగళవారం ఆంక్షల కొరడా ఝులిపించింది. ఈ జాబితాలో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్, విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా, రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగు, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వ్‌దేవ్‌ తదితరులున్నారు. 'ప్రధాని నుంచి పారిశ్రామికవేత్తల వరకు పుతిన్‌కు అత్యంత సన్నిహితులయిన వారిపై ఆంక్షల విషయంలో వేగంగా ముందుకెళ్తున్నాం' అని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫొటోగ్రాఫర్ మృతి

ఉక్రెయిన్​లో జరుగుతున్న యుద్ధంలో ఫాక్స్ న్యూస్ ఫోటోగ్రాఫర్ పియరీ జక్రెజ్​విస్కీ.. ప్రాణాలు కోల్పోయాడని ఫాక్స్ న్యూస్ సంస్థ తెలిపింది. తోటి రిపోర్టర్ బెంజమిన్ హాల్​తో కలిసి ఓ వాహనంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. మృతుడు పియరీ.. ఇరాక్, అఫ్గానిస్థాన్, సిరియా యుద్ధాలనూ కవర్ చేశారని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.

ఇదీ చదవండి: 13,500 మంది రష్యా సైనికులు హతం- కీవ్​కు మూడు దేశాల ప్రధానులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.