ETV Bharat / international

అంతరిక్షంలోకి కల్పనా చావ్లా పేరుతో వ్యోమనౌక

author img

By

Published : Sep 10, 2020, 11:16 AM IST

దివంగత వ్యోమగామి కల్పనా చావ్లాకు సమున్నత గౌరవం దక్కింది. అంతరిక్షంలోకి పంపనున్న ఓ వ్యోమనౌకకు కల్పనా పేరు పెట్టనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నార్త్‌రాప్‌ గ్రుమ్మన్ తెలిపింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించింది.

US spacecraft named after late Indian-American astronaut Kalpana Chawla
అంతరిక్షంలోకి కల్పనా చావ్లా పేరుతో వ్యోమనౌక!

అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళగా రికార్డు సృష్టించిన దివంగత వ్యోమగామి కల్పనా చావ్లాకు సమున్నత గౌరవం దక్కింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి తాము పంపనున్న వ్యోమనౌకకు అమెరికా అంతరిక్ష సంస్థ నార్త్‌రాప్‌ గ్రుమ్మన్‌... కల్పనా చావ్లా పేరును నిర్ణయించింది. అమెరికా రక్షణ శాఖతో కలిసి ఈ వ్యోమనౌకను పంపనుంది.

కల్పనా చావ్లాపై ప్రశంసలు కురిపించిన నార్త్‌రాప్ ‌గ్రుమ్మన్‌... అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారని పేర్కొంది. మానవ సహిత అంతరిక్ష యాత్రలపై ఆమె సుదీర్ఘకాలం ప్రభావం చూపేంత కృషి చేశారని తెలిపింది. సహచర వ్యోమగాములు, తన అడుగు జాడల్లో ప్రవేశించిన వారిపై ఆమె వారసత్వం కొనసాగుతుందని పేర్కొంది.

కొలంబియా వ్యోమనౌకలో ఆమె జరిపిన అంతరిక్ష ప్రయోగం వ్యోమగాముల ఆరోగ్యం, భద్రత గురించి అర్థం చేసుకునేలా తమకు మేలు చేసిందని ప్రశంసించింది. కల్పనా చావ్లా జీవితాన్ని తాము సంబరంగా చేసుకునేందుకు గర్విస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 29న వ్యోమనౌకను నార్త్‌రాప్‌ గ్రుమ్మన్‌ సంస్థ రోదసిలోకి పంపనుంది.

ఇదీ చూడండి: పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సరిహద్దులో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.