ETV Bharat / entertainment

'ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నల్లగా ఉన్నాడు అనే వాళ్లు.. కాలేజీలో ఆమె నా సీనియర్'

author img

By

Published : Oct 25, 2022, 9:15 PM IST

ఒకే ఒక్క డైలాగ్​తో టాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు ప్రియదర్శి. అయితే ఆ గుర్తింపు అంత సులువుగా రాలేదు అంటున్నారు ఆయన. ఆడిషన్స్​కు వెళ్లినప్పుడు నల్లగా ఉన్నావని.. అవకాశాలు ఇచ్చేవారు కాదని చెప్పారు. మొదట్లో ఇలాంటి అవమానాలెన్నో అనుభవించానని తెలిపారు. తన సినిమా జీవితం గురించి ప్రియదర్శి పంచుకున్న విశేషాలివే..

young actor priyadarsi special interview
young actor priyadarsi special interview

టెర్రర్‌ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత 'పెళ్లిచూపులు'లో 'నా చావు నేను చస్తా' అనే ఒక్క డైలాగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి (ప్రియదర్శి పులికొండ). పెద్ద హీరోలతోనూ కలిసి నవ్వుల్ని పంచుతూ.. ఆరోగ్యకరమైన కామెడీని ఇస్తూ అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. 'మల్లేశం' లాంటి సినిమాల్లో తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు. మరి ప్రియదర్శి పంచుకున్న విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

young actor priyadarsi special interview
ప్రియదర్శి

సినిమాటోగ్రాఫర్‌ అవుదామని వచ్చారా ఇండస్ట్రీకి?
ప్రియదర్శి: సినిమాల్లోకి వెళతాను అంటే మా ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. అందుకే కెమెరా వర్క్ నేర్చుకుంటాను. సినిమాటోగ్రాఫర్‌గా అవకాశాలు వస్తాయని ఇంట్లో చెప్పాను. ఎలా అయినా ఇండస్ట్రీకి రావాలని వచ్చాను. 2014లో శ్రీకాంత్‌ హీరోగా నటించిన టెర్రర్‌ సినిమాలోని పాత్రల కోసం ఆడిషన్స్‌ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. వాళ్లు మొదట నన్ను తీసుకోలేదు. కానీ తర్వాత ఆ పాత్రకు నేనే సరిపోతాననిపించి నన్ను పిలిచారు.

పెళ్లిచూపులు తర్వాత వెనక్కి తిరిగి చూడలేదనుకుంటా..? మీరు యాక్టింగ్‌ భిక్షుగారి దగ్గర నేర్చుకున్నారట?
ప్రియదర్శి: అవును, ఆ పెళ్లిచూపులు సినిమాతో నా కెరీర్‌లో చాలా మార్పు వచ్చింది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. నేను తనకి ఎప్పుడు ఫోన్‌ చేసినా ఏం చేస్తున్నావ్‌? అని అడగను.. ఏం చేయట్లేదు అని అడుగుతాను. ఇక యాక్టింగ్‌ విషయానికొస్తే నాకు చిన్నప్పటి నుంచే భిక్షుగారు తెలుసు. మేము చేసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌ ఆయనకు చూపించాను. ఆయన సింపుల్‌గా 'నువ్వు యాక్టింగ్‌ బాగా చేయట్లేదు' అని చెప్పేశారు. 'ఇంటికి రా నేను నేర్పిస్తాను' అన్నారు. అందరూ నా నటన బాగుందని మెచ్చుకుంటుంటే ఆయన అలా అన్నారేంటని ఆలోచించాను. కానీ ఆయన నాకు నటనలో చాలా నేర్పించారు.

young actor priyadarsi special interview
మల్లేశం

మల్లేశం లాంటి గొప్ప సినిమా చేసినందుకు ఎలా ఫీల్‌ అవుతున్నారు?
ప్రియదర్శి: ఆ సినిమాకు సంబంధించిన కథ తెలుసుకున్న తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యా. ఈ సినిమా చేయడానికి మొదట భయపడ్డాను. కానీ నా పాత్రను చూసి చాలామంది ప్రశంసించారు. ఆ సినిమా తర్వాతే చాలా మంది చేనేత కుటుంబాల గురించి తెలుసుకున్నారు.

పెళ్లిచూపులు సినిమాలో విజయ్‌ దేవరకొండతో కలిసి చేయడం ఎలా అనిపించింది?
ప్రియదర్శి: పెళ్లిచూపులు సమయంలో అందరం ఎలా అయినా మేమేంటో నిరూపించుకోవాలి అనే తపనతో ఉన్నాం. పెళ్లిచూపులు సినిమా అంత విజయం సాధించిందంటే ఆ క్రెడిట్‌ అంతా తరుణ్‌ భాస్కర్‌కే దక్కుతుంది. తరుణ్‌ ఒక ఆర్టిస్టులో ఉన్న ప్రతిభను గుర్తిస్తారు. విజయ్‌ నాకు మంచి ఫ్రెండ్‌.

young actor priyadarsi special interview
ప్రియదర్శి

మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, వెంకటేశ్‌లతో చేయడం ఎలా ఉంది?
ప్రియదర్శి: నన్ను చూసి మహేశ్‌బాబు గారు పెట్టిన ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్‌ నాకు ఇంకా గుర్తుంది. నువ్వా..! అని ప్రేమగా పలకరించారు. మహేశ్‌ సినిమాల్లో ఎంత కామెడీ చేస్తారో కెమెరా వెనక కూడా అలానే ఉంటారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి నటించాను. తారక్‌తో మూడు రోజుల షూట్‌. నాకు భయంగా ఉండేది ఆయనతో చేయడం. ఎన్టీఆర్‌ నాతో రిహర్సల్స్‌ చేసేవారు. అప్పుడు భయం పోయింది. అలాంటి పెద్ద యాక్టర్‌ నాలాంటి చిన్న యాక్టర్‌లతో సమయం గడపడం చాలా ఆనందంగా అనిపించింది. వెంకటేశ్‌ గారు కూడా అంతే చాలా సింపుల్‌గా ఉంటారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నా.

young actor priyadarsi special interview
ప్రియదర్శి

ఓటీటీ మీకు కలిసోచ్చిందా?
ప్రియదర్శి: నా కెరీర్‌ మొదలైందే షార్ట్‌ఫిల్మ్స్‌తోనే. నాకు ఓటీటీల పవర్‌ ఏంటో బాగా తెలుసు. సినిమా థియేటర్లకు ఏమాత్రం తీసిపోవని నాకు అర్థమైంది. ఆ తర్వాత కొవిడ్‌ వచ్చింది. అందరూ ఇళ్లలో కూర్చొని ఓటీటీలను బాగా చూశారు. ఆ సమయంలో నాకు మల్లేశం సినిమా అవకాశం వచ్చింది. చాలా మంది పెద్ద హీరోలు కూడా కలిసినప్పుడు చాలా బాగా చేస్తున్నావు అని ప్రోత్సహిస్తారు.

కొన్ని పాత్రలు కొందరికే సరిపోతాయి అంటారు. మరి ప్రియదర్శికి ఎలాంటి పాత్రలు సరిపోతాయి?
ప్రియదర్శి: 'నేను ఇలాంటి పాత్రలే చేయాలి' అని ప్రణాళికలు ఏవీ వేసుకోలేదు. ఎవరు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేసుకుంటూ వెళిపోతున్నా అంతే. నిర్మాతలు, దర్శకులు, హీరోలు వాళ్లందరూ నన్ను నమ్మి నాకు అవకాశం ఇస్తారు. నేనెప్పుడూ నా పరిధిని నిర్ణయించుకోలేదు. నేను 'పెళ్లి చూపులు' సినిమా చేశాక రవివర్మ గారు 'నువ్వు కమెడియన్‌ అని నేను అనుకోను. నువ్వు మంచి టైమింగ్‌ ఉన్న నటుడివి' అన్నారు. అది మర్చిపోలేని ప్రశంస.

young actor priyadarsi special interview
ప్రియదర్శి

ఇటీవల విడుదలైన 'ఒకే ఒక జీవితం' సినిమాలో వెన్నెల కిషోర్‌తో కలిసి నటించారు కదా.. ఎలా అనిపించింది?
ప్రియదర్శి: వెన్నెల కిషోర్‌ అన్నని చూశాక నేను కమెడియన్‌ని కాదని నాకు అర్థమైంది. బ్రహ్మనందం, వెన్నెల కిషోర్‌ వీళ్లందరూ లెజెండ్స్‌. నిజమైన హాస్యనటులు. వెన్నెల కిషోర్‌ అన్నకు సాహిత్యం మీద పట్టు ఉంది. ఆయన మంచి రచయిత.

మీ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్లు. మీరు నటనవైపు వచ్చారు. వాళ్ల నుంచి ఒత్తిడి ఉంటుందా? ఖాళీ టైమ్‌లో ఏం చేస్తారు?
ప్రియదర్శి: వాళ్ల నుంచి ఒత్తిడి కంటే సపోర్టు నాకు బాగా ఉంది. నేను చేయగలను అనే నమ్మకం ఉన్నా కూడా వాళ్ల భయాలు వాళ్లకు ఉంటాయి కదా. నాకు కొత్త ప్రాంతాలకు వెళ్లడం చాలా ఇష్టం. ఖాళీ దొరికితే కొత్త ప్రాంతాలకు వెళతాను.

ఏయే దర్శకులతో పని చేయాలని ఉంది?ఏ సినిమా అంటే ఇష్టం?
ప్రియదర్శి: అలా నేను చెప్పలేను. నాకు నచ్చిన దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్లతో పని చేయాలని ఉందని వాళ్లని కలిసినప్పుడు చెప్పాను. చాలా మంది దర్శకులు నాకు తెలుగు నేర్పించారు. విశ్వనాథ్‌గారు, బాలచందర్‌గారు, రామ్‌గోపాల్‌ వర్మ గారు ఇలా చాలామంది మన తెలుగు సినిమాకు ఎంతో చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ గారు ఎన్ని హిందీ సినిమాలు తీశారో. ఇప్పుడు పాన్‌ ఇండియా యాక్టర్స్ ఉన్నారు. కానీ గతంలో పాన్‌ ఇండియా డైరెక్టర్లు ఉండేవాళ్లు. నాకు సాగర సంగమం, స్వయంకృషి, పుష్పక విమానం, భైరవద్వీపం, చంటి ఇలాంటి సినిమాలంటే ఇష్టం.

తెలుగు మీద ఎంతైతే పట్టు ఉందో ఇంగ్లిషులోనూ అలానే మాట్లాడతారని విన్నాం. నిజమేనా?
ప్రియదర్శి: నాకు తెలుగు బాగా వచ్చు కాబట్టే నేను ఇంగ్లిషు మాట్లాడగలను. దానికి ఒక లాజిక్‌ ఉంది. నేను ఏభాషలో మాట్లాడాలన్నా తెలుగులోనే ఆలోచించుకుంటా అందుకే బాగా మాట్లాడగలుగుతాను అని నేను నమ్ముతాను.

టాలీవుడ్‌లో చేస్తూ.. టాలీవుడ్ అనే పదం నచ్చదు అని చెప్పారట?
ప్రియదర్శి: నేను చాలాసార్లు గమనించా. ఇండియన్‌ సినిమా అనగానే బాలీవుడ్‌ అంటారు. హిందీ సినిమాలు కాకుండా మిగతా అన్నింటినీ కలిపి రీజనల్‌ సినిమాలు అంటారు. నాకు ఇలా అనడం నచ్చేదికాదు. మనవి భాషాపరమైన రాష్ట్రాలు.. సినిమాలు అంతే. అందుకే ఏ భాష పేరు చెప్పి ఆ సినిమా అని పిలవాలి. తెలుగు, తమిళ, మలయాళం సినిమాలు అని పిలవాలి అంతే కానీ అన్నింటినీ కలిపి రీజనల్‌ సినిమాలు అంటే నచ్చదు.

జాతిరత్నాలు గురించి చెప్పండి?
ప్రియదర్శి: జాతిరత్నాలు సినిమా కథ చెప్పడానికి దర్శకుడు వచ్చినప్పుడు నేను ఒక 10 నిమిషాలు నవ్వుతూనే ఉన్నాను. అశ్వనీదత్‌ బ్యానర్‌లో సినిమా చేయడం నా కల. జాతిరత్నాలుతో అది నెరవేరింది. ఆ సినిమాని ఇక్కడ శాంతి థియేటర్లో చూసినప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో. విదేశాల్లో చూసినప్పుడు అక్కడ కూడా అంతమంది జనాలు ఉన్నారు.

మీ జీవితంలో విమర్శలను ఎదుర్కోలేదా?
ప్రియదర్శి: చాలా సార్లు ఎదుర్కొన్నా. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నల్లగా, సన్నగా ఉన్నాడు, మొటిమలు ఎక్కువ ఉన్నాయి. హీరో కంటే పొడుగ్గా ఉన్నాడు అనే వాళ్లు. అలా అన్నప్పుడల్లా నన్ను నేను ప్రొత్సహించుకునే వాడిని.

మీది ప్రేమ పెళ్లి కదా?
ప్రియదర్శి: అవును, తన పేరు రిచా. వాళ్లది ఆగ్రా. కాలేజీలో ఆమె నా సీనియర్‌. మా ప్రేమ గురించి చెప్పగానే ఇంట్లో వాళ్లు వెంటనే ఓకే అన్నారు. ఆమె మంచి రచయిత. తను రాసిన చాలా రచనలు ప్రచురించారు.

భవిష్యత్తులో మరొకసారి బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే.. ఎవరిది చేయాలని కోరుకుంటారు?
ప్రియదర్శి: కొమరంభీం. ఆయన కథని చేయాలని ఉంది. కాళోజీ జీవిత చరిత్ర కూడా చేయాలని ఉంది. అలాగే రామోజీరావు గారి జీవితచరిత్ర సినిమాగా తీస్తే అందులో నటించాలని ఉంది. ఆయన గొప్ప వ్యక్తి. శాంతా బయోటెక్‌ వరప్రసాద్‌ గారి బయోపిక్‌ చేయాలని ఉంది. నేను చేయాలని కాదు.. వీళ్ల జీవితచరిత్రలు ప్రజలకు తెలియాలి. ఎవరు నటించినా చూసి సంతోషిస్తాను.

ఇవీ చదవండి : 'kgf​'ను బీట్ చేసిన 'కాంతార'.. ఆగని కలెక్షన్ల వర్షం

కెనడాలో భారీగా ఆస్తులు స్విస్ బ్యాంక్​లో అకౌంట్ గురించి షాకింగ్ లెక్కలు చెప్పిన సీనియర్ నటుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.