ETV Bharat / entertainment

కృష్ణకు ఆ దేశ ప్రభుత్వం అరుదైన గౌరవం.. సూపర్​స్టార్​ కన్నా ముందున్న బిరుదులు ఇవే

author img

By

Published : Nov 15, 2022, 7:44 AM IST

Updated : Nov 15, 2022, 10:32 AM IST

ఆయన సావాసానికైనా, సాహసానికైనా మొనగాడు. ఆయనొక అసాధ్యుడు. అనితరసాధ్యుడు. మంచివాళ్లకు మంచివాడు. ఆయనే సూపర్‌స్టార్ కృష్ణ. అయితే ఆయనకు సూపర్​ స్టార్​ కన్నా ముందే ఇచ్చిన బిరుదులు ఏంటో తెలుసా? అసలు సూపర్​ స్టార్ అని ఎలా వచ్చిందో తెలుసా? దాని గురించే ఈ కథనం.

Super star krishna Title
కృష్ణకు.. సూపర్ స్టార్ కన్నా ముందు ఉన్న బిరుదులు ఏంటో తెలుసా

సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు సినీ చరిత్రలో ఓ ట్రెండ్ సెట్టర్. సంచలన సినిమాలు చేయాలన్నా.. సాహస సినిమాలు తీయాలన్నా.. సూపర్ స్టార్ తర్వాతే ఎవరైనా. నటుడిగా మొదలైన తన సినీ జీవితంలో.. దర్శకుడిగా మారి ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. నిర్మాతగా మారి ఎన్నో మరుపురాని చిత్రాలకు ప్రాణం పోశారు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు, తొలి ఫుల్‌స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం వంటివి ఎన్నో హిట్ చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించారు. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాల్లోనూ నటించారు. అయితే ఆయన ఎలా సినిమాల్లోకి వచ్చారు, సూపర్​స్టార్ అన్న బిరుదు ఎలా వచ్చింది? దాన్ని కన్నా ముందు ఆయనకు ఉన్న టైటిల్స్​ ఏంటో చూద్దాం..

అలా సినిమాల్లోకి..
తెలుగు సినిమా చరిత్రలో సూపర్‌ స్టార్‌ కృష్ణది ప్రత్యేక అధ్యాయం. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 1942, మే 31న జన్మించారు. ఆయన అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణను హీరోగా పరిచయం చేశారు. అంతకుముందు ఒకట్రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. పూర్తిగా కొత్తవాళ్లతో తీసిన తేనెమనుసులు(1965) చిత్రంలో కృష్ణకు అవకాశం దక్కింది. అయితే అందులో ఆయన సోలో హీరో కాదు. మరో కొత్త నటుడితో తెరపంచుకున్నారు. ఆ సినిమా విజయం సాధించడంతో కృష్ణను వరుస అవకాశాలు తలుపు తట్టాయి. జానపద, పౌరాణిక, చరిత్ర, సాంఘిక చిత్రాల్లో నటించి ఆంధ్రుల హీరో అయ్యారు.

మూడో సినిమాతోనే.. స్టార్‌హోదా.. తేనెమనసులుతో కొత్త హీరోగా ఆకట్టుకున్న సూపర్‌స్టార్‌ ఆ తదుపరి చిత్రాన్నికూడా ఆదుర్తి సుబ్బరావుతోనే తీశారు. ఆ సినిమా పేరు కన్నెమనుసులు. మూడో చిత్రంగా వచ్చిందే గూఢచారి 116. తెలుగులో వచ్చిన తొలి జేమ్స్ బాండ్‌ చిత్రం. అది సూపర్‌ డూపర్‌ హిట్టై స్టార్‌ హీరో స్థాయినిచ్చింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సాక్షి, అవే కళ్లు ఇలా వరుస హిట్లతో కెరియర్‌ తారాస్థాయికి చేరుకుంది. ఏజెంట్‌ గోపిలో వేసిన పాత్రతో ఆంధ్ర జేమ్స్‌ బాండ్‌గా మారిపోయారు. అలా ఆయన వరుస హిట్​ సినిమాల్లో నటించి సూపర్​స్టార్​గా ఎదిగారు.

సూపర్​స్టార్​ కన్నా ముందు.. ఆయన నటనకు ఇప్పుడు మనమందరం సూపర్​స్టార్ అని పిలుచుకుంటున్నాం. కానీ అంతకన్నా ముందే ఆయన్ను నటశేఖర, డేరింగ్ అండ్ డ్యాషింగ్ అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ అప్పట్లో ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కేవీ రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ నటశేఖర బిరుదును అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఓ వారపత్రిక అప్పట్లో తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారని ఓటింగ్ నిర్వహించింది. అందులో కృష్ణ తిరుగులేని ఓటింగ్ సంపాదించారు. దీంతో ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ అయిపోయారు.

ఇదీ చూడండి: విషమంగా సూపర్​స్టార్​ కృష్ణ ఆరోగ్యం​.. హెల్త్​ బులిటెన్​ విడుదల చేసిన డాక్టర్లు

Last Updated : Nov 15, 2022, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.